Ind Vs Nz: కాన్ఫూర్ టెస్టుకు విశిష్ట అతిథిగా రాష్ట్రపతి..? గట్టిగా ట్రై చేస్తున్న బీసీసీఐ

By team teluguFirst Published Nov 20, 2021, 2:38 PM IST
Highlights

Ram Nath Kovind: టీ20లు ముగిసిన తర్వాత న్యూజిలాండ్ తో టీమిండియా టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ టెస్టుకు అతిథిగా రావాలని భారతదేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ప్రత్యేక ఆహ్వానం పంపింది. 

భారత పర్యటనలో ఉన్న న్యూజిలాండ్.. మూడు టీ20 లతో పాటు రెండు టెస్టులు కూడా ఆడనున్న విషయం తెలిసిందే. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (World Test championship) లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్ లో తొలి టెస్టు ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ప్రముఖ నగరం కాన్పూర్ (Kanpur Test) లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఈ టెస్టు కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) విశిష్ట అతిథిని తీసుకువచ్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నది. ఈ టెస్టుకు అతిథిగా రావాలని భారతదేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (Ram Nath Kovind)కు ప్రత్యేక ఆహ్వానం పంపింది. రాష్ట్రపతితో పాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ (UP Governor) ఆనందీబెన్ పటేల్ (Anandiben Patel)కు కూడా ఆహ్వానం అందించింది. 

యూపీకే చెందిన రామ్ నాథ్ కోవింద్ స్వస్థలం కూడా కాన్పూరే. ఇక్కడ్నుంచే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.  మొదట్నుంచి వివాదరహితుడిగా పేరున్న కోవింద్.. అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి అయ్యారు. ఈ ఏడాది ప్రథమార్థంలో ఆయన రాష్ట్రపతి హోదాలో తొలిసారి కాన్పూర్ కు వెళ్లి అక్కడ నాలుగు రోజులు గడిపారు. కాన్పూర్ కు దగ్గర్లోని పరూంఖ్ ఆయన స్వగ్రామం. కాగా.. పలు కార్యక్రమాల నిమిత్తం ఈనెల 25న (అదేరోజున  తొలి టెస్టు ఆరంభం కానుంది) ఆయన కాన్పూర్ కు రానున్నారు.  

ఈ నేపథ్యంలో తొలి  టెస్టుకు (India Vs New Zealand Test Series) హాజరుకావాలని బీసీసీఐ.. రామ్ నాథ్ కోవింద్ కు ఆహ్వానం పంపింది. అయితే దీనిపై ఆయన ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ ఆయన అంగీకారం తెలిపితే రాష్ట్రపతి హోదాలో తొలిసారి మ్యాచ్ చూడబోతున్నారు. 

రామ్ నాథ్ తో పాటు యూపీ గవర్నర్ ఆనందీబెన్ కూ బీసీసీఐ ఆహ్వానం పంపింది. దీనికి  ఆమె సమ్మతం తెలిపినట్టు సమాచారం. నవంబర్ 25న పలు కార్యక్రమాలలో  పాల్గొనడానికి రాష్ట్రపతి, గవర్నర్ సహా ఇతర ప్రజా ప్రతినిధులు కాన్పూర్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో తొలి టెస్టు  ప్రారంభమయ్యాక  (ఉదయం 9.30 గంటలకు) కాసేపు అక్కడుండి ఇతర కార్యక్రమాలకు  గవర్నర్ వెళ్లనున్నట్టు తెలుస్తున్నది. మరి రాష్ట్రపతి బీసీసీఐ ఆహ్వానంపై ఎలా స్పందిస్తారో చూడాలి. 

కాగా.. ఒకవేళ రాష్ట్రపతి ఈ మ్యాచ్ కు గనక హాజరైతే అందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.  వీవీఐపీల భద్రతను చూసుకునే ప్రత్యేక ఏజెన్సీలు.. ముందు క్షుణ్ణంగా పరిశీలించన మీదటే  కోవింద్ అక్కడికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ఏజెన్సీలు కాన్పూర్  నుంచి నివేదికలు కోరినట్టు తెలుస్తున్నది.

ఇండియా-న్యూజిలాండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్: 

తొలి టెస్టు : నవంబర్ 25 నుంచి 29 దాకా.. కాన్పూర్ 
రెండో టెస్టు : డిసెంబర్ 3 నుంచి 7 దాకా.. ముంబై 

కాగా.. కోహ్లి గైర్హాజరీలో తొలి టెస్టుకు అజింక్యా రహానే సారథ్యం వహించనున్నాడు. ముంబై టెస్టులో విరాట్.. జట్టుతో చేరతాడు. 

click me!