IND VS ENG 4th Test: మ్యాచ్ గెలవాలంటే.. ఈ ఆటగాళ్లు మెరవాల్సిందే..!

By team teluguFirst Published Sep 2, 2021, 7:58 AM IST
Highlights

పటౌడీ ట్రోఫీలో భారత్‌, ఇంగ్లాండ్‌లు 1-1తో సమవుజ్జీలుగా నిలిచాయి. సిరీస్‌లో స్పష్టమైన ఆధిపత్యం కోసం నేడు ఇరు జట్లు రంగంలోకి దిగుతున్నాయి.

భారత్‌, ఇంగ్లాండ్‌ టెస్టు సమరం వేరే లెవెల్ కి చేరుకుంది. తొలి రెండు టెస్టుల్లో టీమ్‌ ఇండియా పైచేయి సాధించగా.. మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ ఎదురులేదని నిరూపించుకుంది. సిరీస్‌ ఫలితం ప్రభావితం చేసే సమరాల నేపథ్యంలో ఓవల్‌ మైదానంలో అత్యుత్తమ టెస్టు పోటీని చూడవచ్చు. 

పటౌడీ ట్రోఫీలో భారత్‌, ఇంగ్లాండ్‌లు 1-1తో సమవుజ్జీలుగా నిలిచాయి. సిరీస్‌లో స్పష్టమైన ఆధిపత్యం కోసం నేడు ఇరు జట్లు రంగంలోకి దిగుతున్నాయి. అటు ఇంగ్లాండ్‌ను, ఇటు భారత్‌ను అంతర్గత సమస్యలు వెంటాడుతున్నా.. ఆధిపత్య పోరులో పైచేయి కోసం అమీతుమీకి సిద్ధపడుతున్నాయి. నేడు మధ్యాహ్నాం 3.30 గంటలకు ఓవల్‌ మైదానంలో నాలుగో టెస్టు ఆరంభం కానుంది.

Latest Videos

మార్పులు ఉంటాయా..?

కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి వింత పోకడను అనుసరిస్తున్నాడు!. తొలినాళ్లలో ఏ రెండు టెస్టులకు ఒకే తుది జట్టుతో వెళ్లని విరాట్‌.. ఇప్పుడు కాంబినేషన్‌ మార్పుపై పెద్దగా ఆసక్తి చూపటం లేదు. మూడు టెస్టులు ముగియటంతో జట్టులో కీలక ఆటగాళ్ల ప్రదర్శనపై సమీక్ష అవశ్యం. సిరీస్‌ ఫలితాన్ని నిర్దేశించే టెస్టుకు కోహ్లి కాంబినేషన్‌ మార్పు చేసే అవకాశం ఉంది. బ్యాటింగ్‌ లైనప్‌లో విరాట్‌ కోహ్లి సహా చతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానెలు ప్రధాన సమస్య. 

Also Read: ఇషాంత్ శర్మ అవుట్... నాలుగో టెస్టులో అతనికి అవకాశం ఇవ్వకపోతే...

లీడ్స్‌ రెండో ఇన్నింగ్స్‌లో పుజారా 91 పరుగుల ఇన్నింగ్స్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. రహానే పూర్తి విశ్వాసంగా క్రీజులో కదలటం లేదు. ఈ ముగ్గురు బ్యాట్‌తో మెరిస్తే భారత్‌ మెరుగైన పోటీ ఇవ్వనుంది. నిలకడగా విఫలమవుతున్న అజింక్య రహానె స్థానంలో ధనాధన్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, సంప్రదాయ బ్యాట్స్‌మన్‌ హనుమ విహారిలలో ఒకరిని తుది జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్‌ పెరుగుతోంది. 

బౌలింగ్‌ విభాగంలో రెండు మార్పులకు ఆస్కారం ఉంది. మూడు టెస్టుల్లో రెండు వికెట్లే కూల్చిన రవీంద్ర జడేజా స్థానంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకునే వీలుంది. కౌంటీల్లో ఆరు వికెట్ల ప్రదర్శన చేసిన అశ్విన్‌.. ఓవల్‌లో ఇంగ్లాండ్‌ను ఇరకాటంలో పెట్టగలడు. 

లీడ్స్‌ టెస్టులో 22 ఓవర్లు వేసినా ఒక్క వికెట్‌ పడగొట్టలేదు ఇషాంత్‌ శర్మ. 4.18 ఎకానమీతో పరుగులు ఇచ్చిన ఇషాంత్‌ శర్మను పక్కనపెట్టి సీమ్‌ ఆల్‌రౌండర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకునే యోచన ఉంది. ఒక్క టెస్టు వైఫల్యంతో ఇషాంత్‌పై వేటు వేయటం కష్టమే, కానీ కోహ్లి కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. తొలి మూడు టెస్టుల్లో వందకు పైగా ఓవర్లు వేసిన జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ షమిలకు విశ్రాంతి లభించే సూచనలు లేవు. మహ్మద్‌ సిరాజ్‌ తోడుగా ఈ పేస్‌ ద్వయం ఓవల్‌లోనూ బరిలోకి దిగనుంది.

జోరు మీద ఇంగ్లాండ్... 

లార్డ్స్‌ ఓటమితో కుంగిపోయిన ఇంగ్లాండ్‌.. లీడ్స్‌లో విమర్శకులకు దీటైన సమాధానం ఇచ్చింది. ఇంగ్లాండ్‌ విజయంలో ప్రధాన పాత్ర కెప్టెన్‌ జో రూట్‌. సిరీస్‌లో హ్యాట్రిక్‌ శతకాలు సహా 500కి పైగా పరుగులు బాదేసిన రూట్‌ నాల్గో టెస్టులోనూ భారత్‌కు సవాల్‌ విసరనున్నాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఓపెనర్లు సైతం ఫామ్‌లోకి రావటం ఇంగ్లాండ్‌కు కలిసిరానుంది. 

Also Read: ది ఓవల్‌లో టీమిండియాకి చెత్త రికార్డు... 13 టెస్టులు ఆడితే, గత 50 ఏళ్లలో భారత జట్టుకి...

మిడిల్‌ ఆర్డర్‌లో జానీ బెయిర్‌స్టో ఊపందుకుంటే.. ఇంగ్లాండ్‌ జోరుకు అడ్డుకట్ట వేయటం అంత సులువు కాబోదు. లీడ్స్‌లో ఎంతో పట్టుదలగా బంతులేసిన జేమ్స్‌ అండర్సన్‌ అదే జోరు ఓవల్‌లోనూ చూపించాలని తపన పడుతున్నాడు. ఓలీ రాబిన్సన్‌, మార్క్‌వుడ్‌, క్రిస్‌ వోక్స్‌లు అండర్సన్‌కు అండగా నిలువనున్నారు. స్పిన్‌ ప్రభావం చూపే ఓవల్‌లో మోయిన్‌ అలీ కీలక పాత్ర పోషిస్తాడని ఇంగ్లాండ్‌ శిబిరం అంచనా వేస్తోంది.

click me!