ICC World cup 2023: మెరుపులు మెరిపించి అవుటైన రోహిత్ శర్మ.. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా...

By Chinthakindhi Ramu  |  First Published Oct 19, 2023, 7:29 PM IST

మెరుపు ఇన్నింగ్స్‌తో 48 పరుగులు చేసి అవుటైన రోహిత్ శర్మ... ఒకే ఇన్నింగ్స్‌లో మూడు రికార్డులు బ్రేక్.. 


ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ తన సూపర్ ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసి, వరల్డ్ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన రోహిత్, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 86 పరుగులు చేశాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ టీమిండియాకి మెరుపు ఆరంభం అందించి, పెవిలియన్ చేరాడు రోహిత్ శర్మ..

మొదటి ఓవర్‌లో 2 ఫోర్లు బాదిన రోహిత్ శర్మ, ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో 4, 6 బాదాడు. ఓ ఎండ్‌లో రోహిత్ దూకుడుగా ఆడితే, సెటిల్ అవ్వడానికి సమయం తీసుకున్న శుబ్‌మన్ గిల్ కూడా బౌండరీలు బాదడం మొదలెట్టాడు. నసుమ్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదాడు శుబ్‌మన్ గిల్..

Latest Videos

undefined

ఈ ఏడాది ఇప్పటికే 61 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ, ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాకుండా ఛేజింగ్‌లో 750+ పరుగులు చేసిన రోహిత్, వన్డే వరల్డ్ కప్‌లో ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు..

ఏషియాలో 6 వేల వన్డే పరుగులు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ, 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసి... హాఫ్ సెంచరీకి 2 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. హసన్ మహ్మద్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదిన రోహిత్ శర్మ, ఆ తర్వాతి బంతికి కూడా భారీ షాట్‌ ఆడి బౌండరీ లైన్ దగ్గర తోహిద్ హృదయ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..

88 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా.  విరాట్ కోహ్లీ వస్తూనే 2, 4, 6 బాదడంతో ఆ ఓవర్‌లో టీమిండియా ఖాతాలో 23 పరుగులు చేరాయి.  హసన్ మహ్మద్ వరుసగా రెండు నో బాల్స్ వేశాడు. 14 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 106 పరుగులు చేసింది టీమిండియా.. 

click me!