9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ని చిత్తు చేసిన న్యూజిలాండ్.. సెంచరీలతో మోత మోగించిన డివాన్ కాన్వే, రచిన్ రవీంద్ర..
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని పరాజయంతో మొదలెట్టింది. 2019 వన్డే వరల్డ్ కప్ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది ఇంగ్లాండ్. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 282 పరుగుల స్కోరు చేయగా ఈ లక్ష్యాన్ని కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి ఆడుతూ పాడుతూ ఛేదించింది న్యూజిలాండ్..
ఓపెనర్ విల్ యంగ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. డివాన్ కాన్వే, రచిన్ రవీంద్ర అజేయ సెంచరీలతో రెండో వికెట్‌కి 273 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌కి ఇదే అత్యధిక భాగస్వామ్యం. డివాన్ కాన్వే 121 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సర్లతో 152 పరుగులు చేశాడు. డివాన్ కాన్వేకి ఇది నాలుగో వన్డే సెంచరీ..
తొలిసారి టాపార్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన రచిన్ రవీంద్ర 96 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 123 పరుగులు చేశాడు.
వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఛేదనలో వచ్చిన అత్యధిక భాగస్వామ్యం కూడా ఇదే. ఇంతకుముందు 2011 వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పైనే శ్రీలంక బ్యాటర్లు తిలకరత్నే దిల్షాన్ - ఉపుల్ తరంగ 231 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేయగలిగింది..
24 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన డేవిడ్ మలాన్, మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 35 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసిన జానీ బెయిర్‌స్టో, మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
16 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసి దూకుడుగా ఇన్నింగ్స్ మొదలెట్టిన హారీ బ్రూక్‌ని రచిన్ రవీంద్ర అవుట్ చేశాడు. మొయిన్ ఆలీ 17 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేసి గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..
కెప్టెన్ జోస్ బట్లర్ 42 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేయగా లియామ్ లివింగ్‌స్టోన్ 20, సామ్ కుర్రాన్ 14 పరుగులు చేశారు. జో రూట్ 86 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 77 పరుగులు చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓ ఎండ్‌లో కుదురుకుపోయిన జో రూట్ కూడా గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు..
క్రిస్ వోక్స్ 11 పరుగులు చేసి అవుట్ కాగా అదిల్ రషీద్, మార్క్ వుడ్ కలిసి 4.2 ఓవర్లు బ్యాటింగ్ చేసి ఆఖరి వికెట్‌కి 30 పరుగులు జోడించారు. మార్క్ వుడ్ 14 బంతుల్లో 13 పరుగులు చేయగా ఓ సిక్సర్ బాదిన అదిల్ రషీద్ 15 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బ్యాటర్లు అందరూ డబుల్ డిజిట్ స్కోరు చేయడం విశేషం.