Sri Lanka vs Bangladesh: 49.3 ఓవర్లలో 279 పరుగులకి ఆలౌట్ అయిన శ్రీలంక... సెంచరీ చేసిన చరిత్ అసలంక...
ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా నేడు ఢిల్లీలో బంగ్లాదేశ్, శ్రీలంకతో తలబడుతోంది. బంగ్లాదేశ్ ఇప్పటికే సెమీస్ రేసు నుంచి తప్పుకోగా శ్రీలంక సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే నేటి మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక, 49.3 ఓవర్లలో 279 పరుగులకి ఆలౌట్ అయ్యింది. కుసాల్ పెరేరా 4 పరుగులు చేయగా కెప్టెన్ కుసాల్ మెండిస్ 30 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేశాడు.
36 బంతుల్లో 8 ఫోర్లతో 41 పరుగులు చేసిన పథుమ్ నిశ్శంకని తన్జీమ్ హసన్ అవుట్ చేశాడు. సధీర సమరవిక్రమ 42 బంతుల్లో 4 ఫోర్లతో 41 పరుగులు చేశాడు. సమరవిక్రమని షకీబ్ అల్ హసన్ అవుట్ చేయగా ఏంజెల్ మాథ్యూస్ టైమ్ అవుట్ విధానంలో పెవిలియన్ చేరాడు.
హెల్మెట్ విరిగిపోవడంతో క్రీజులో బ్యాటింగ్ చేయడానికి నిర్ధిష్ట సమయం కంటే ఎక్కువ సమయం తీసుకోవడం, బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అప్పీల్ చేయడంతో అంపైర్, మాథ్యూస్‌ని అవుట్‌గా ప్రకటించాడు. ధనంజయ డి సిల్వ 36 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేయగా మహీశ్ తీక్షణ 31 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేశాడు..
ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో క్రీజులో సెటిలైన చరిత్ అసలంక 105 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 108 పరుగులు చేశాడు. అసలంకకి ఇది వన్డేల్లో రెండో సెంచరీ.