ICC World cup 2023: ఎట్టకేలకు బోణీ కొట్టిన ఆస్ట్రేలియా... ఆఖరి పొజిషన్‌కి శ్రీలంక..

By Chinthakindhi Ramu  |  First Published Oct 16, 2023, 9:37 PM IST

శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న ఆస్ట్రేలియా... పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పడిపోయిన శ్రీలంక.. 


మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడి, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పడిపోయిన ఆస్ట్రేలియా... ఎట్టకేలకు బోణీ కొట్టింది. సెమీస్ అవకాశాలు చేజారకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. సీనియర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ నిరాశపరిచినా మిచెల్ మార్ష్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లీష్ కలిసి ఆస్ట్రేలియాకి విజయాన్ని అందించారు..

ఓ సిక్సర్‌ బాది 11 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌ని దిల్షాన్ మధుశనక అవుట్ చేశాడు. అదే ఓవర్‌లో 5 బంతులు ఆడిన స్టీవ్ స్మిత్ కూడా డకౌట్ కావడంతో ఒకే ఓవర్‌లో 2 కీలక వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. అయితే మిచెల్ మార్ష్, మార్నస్ లబుషేన్ కలిసి మూడో వికెట్‌కి 77 పరుగుల భాగస్వామ్యం జోడించారు..

Latest Videos

51 బంతుల్లో 9 ఫోర్లతో 52 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ రనౌట్ అయ్యాడు. మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లీష్ కలిసి నాలుగో వికెట్‌కి 77 పరుగులు జోడించారు. 60 బంతుల్లో 2 ఫోర్లతో 40 పరుగులు చేసిన లబుషేన్ కూడా మధుశనక బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.

అయితే అప్పటికే ఆసీస్ మంచి పొజిషన్‌లోకి చేరుకుంది. 59 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 58 పరుగులు చేసిన జోష్ ఇంగ్లీష్, దునిత్ వెల్లలాగే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అయితే అప్పటికి ఆసీస్ విజయానికి 17 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే కావాలి..

గ్లెన్ మ్యాక్స్‌‌వెల్, మార్కస్ స్టోయినిస్ కలిసి మ్యాచ్‌ని ముగించేశారు. స్టోయినిస్ 10 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేయగా మ్యాక్స్‌వెల్ 21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. 


అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక, 43.3 ఓవర్లలో 209 పరుగులకి ఆలౌట్ అయ్యింది. పథుమ్ నిశ్శంక, కుసాల్ పెరేరా కలిసి తొలి వికెట్‌కి 125 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు. ఇన్నింగ్స్ మొదటి బంతికి పథుమ్ నిశ్శంక వికెట్ కోసం అప్పీలు చేసి, రివ్యూ తీసుకుంది ఆస్ట్రేలియా. అయితే టీవీ రిప్లైలో బంతి వికెట్లను మిస్ కావడంతో ఆసీస్ ఓ రివ్యూ కోల్పోయింది..

10వ ఓవర్‌లో మరోసారి కుసాల్ పెరేరా వికెట్ కోసం అప్పీలు చేసింది ఆస్ట్రేలియా. అయితే ఈసారి ఆసీస్ డీఆర్‌ఎస్ తీసుకోలేదు. టీవీ రిప్లైలో కుసాల్ పెరేరా అవుట్ అవుతున్నట్టు క్లియర్‌గా కనిపించింది. 67 బంతుల్లో 8 ఫోర్లతో 61 పరుగులు చేసిన పథుమ్ నిశ్శంక, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

82 బంతుల్లో 12 ఫోర్లతో 78 పరుగులు చేసిన కుసాల్ పెరేరా కూడా ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. 13 బంతుల్లో 9 పరుగులు చేసిన కుసాల్ మెండిస్, ఆడమ్ జంపా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.. ఆ తర్వాత 13 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన ధనంజయ డి సిల్వని మిచెల్ స్టార్క్‌ క్లీన్ బౌల్డ్ చేశాడు..

9 బంతుల్లో 2 పరుగులు చేసిన దునిత్ వెల్లలాగే రనౌట్ అయ్యాడు. కరుణరత్నే 2, లాహీరు కుమార 4 పరుగులు చేయగా మహీశ్ తీక్షణ డకౌట్ అయ్యాడు. 39 బంతుల్లో ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసిన చరిత్ అసలంక, గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో శ్రీలంక ఇన్నింగ్స్‌కి తెరపడింది..

click me!