దూసుకొస్తున్న రవీంద్ర జడేజా ఫ్యాన్: కేఎల్ రాహుల్ ప్లేస్ సేఫ్

By telugu teamFirst Published Feb 28, 2020, 1:54 PM IST
Highlights

టీ20 ర్యాంకింగ్స్ లో బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆస్టన్ అగర్ ముందుకు దూసుకొస్తున్నాడు. ఏకంగా నాలుగో స్థానానికి ఎకబాకాడు. కేఎల్ రాహుల్ తన రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు.

దుబాయ్: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా స్పిన్నర్, టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఫ్యాన్ ఆస్టన్ అగర్ ముందుకు దూసుకొస్తున్నాడు. దక్షిణాఫ్రికాపై జరిగిన రెండు టీ20 మ్యాచుల్లో దుమ్ము రేపిన అగర్ ఐసిసి ర్యాంకింగ్స్ లో బౌలర్ల కెటగిరీలో ఒకేసారి ఆరు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానాన్ని ఆక్రమించాడు. 

దక్షిణాఫ్రికాపై జరిగిన తొలి టీ20 మ్యాచులో ఐదు వికెట్లు తీసుకున్న తర్వాత అగర్ మాట్లాడుతూ తాను ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు ఫ్యాన్ ని అని, జడేజాతో మాట్లాడడం తనకు ఎంతో ఉపయోగపడిందని ఆయన చెబుకున్నాడు. తొలి మ్యాచులో ఐదు వికెట్లు తీసిన అగర్ రెండో మ్యాచులో మూడు వికెట్లు తీశాడు. తద్వారా 712 రేటింగ్ పాయింట్లతో అతను నాలుగో స్థానంలో నిలిచాడు. 

ఆస్ట్రేలియాకే చెందిన ఆడమ్ జంపా 713 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ ర్యాంకింగ్స్ లో అఫ్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 749 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా, అఫ్గానిస్తాన్ కే చెందిన ముజిబ్ ఉర్ రహ్మాన్ 742 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. టాప్ 10లో భారత బౌలర్లు ఎవరూ లేరు. 

also Read: రాక్ స్టార్ జడేజా నా అభిమాన ఆటగాడు: హ్యాట్రిక్ హీరో అగర్

బ్యాటింగ్ విభాగంలో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ తన రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. 823 పాయింట్లతో రాహు్ల రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. గత నెలలో అతను రెండో స్థానానికి ఎగబాకాడు. దాన్ని ఇప్పుడు పదిలం చేసుకున్నాడు. ఈ విభాగంలో బాబర్ ఆజమ్ 879 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పదవ స్థానంలో నిలిచాడు. ఆరోన్ ఫించ్ మూడోస్థానంలో, కోలిన్ మన్రో నాలుగో స్థానంలో నిలిచారు. ఆల్ రౌండర్స్ విభాగంలో అఫ్గనిస్తాన్ ఆటగాడు మహ్మద్ నబీ 319 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. జింబాబ్వే ఆటగాడు సీన్ విలియమ్స్ 212 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. మ్యాక్స్ వెల్ మూడో స్థానంలో నిలిచాడు. 

click me!