T20 Worldcup: అఫ్ఘానిస్థాన్ క్రికెట్ కు అతడొక ధ్రువతార.. రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్ఘాన్

Published : Oct 31, 2021, 06:21 PM ISTUpdated : Oct 31, 2021, 06:30 PM IST
T20 Worldcup: అఫ్ఘానిస్థాన్ క్రికెట్ కు అతడొక ధ్రువతార.. రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్ఘాన్

సారాంశం

Asghar Afghan: 33 ఏండ్ల అస్గర్.. 2009 లో అఫ్ఘాన్ క్రికెట్ లోకి అరంగ్రేటం చేశాడు. ఆ జట్టు అప్పుడప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడుతున్నది. ఒకరకంగా.. అఫ్ఘాన్ జట్టు ప్రయాణాన్ని,  అస్గర్ కెరీర్ ను వేరు చేసి చూడలేనంతగా అతడు ప్రభావితం చేశాడు.

అఫ్ఘానిస్థాన్ (Afghanistan) స్టార్ ఆటగాడు, ఆ జట్టు వన్డే కెప్టెన్ అస్గర్ అఫ్ఘాన్ (Asghar Afghan) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐసీసీ టీ 20 ప్రపంచకప్ (ICC T20 Worldcup) లో భాగంగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్ తన ఆఖరు మ్యాచ్ అని ప్రకటించాడు. ఈ మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు (Asghar Afghan Retirement)  పలుకనున్నట్టు తెలిపాడు. 

33 ఏండ్ల అస్గర్.. 2009 లో అఫ్ఘాన్ క్రికెట్ లోకి అరంగ్రేటం చేశాడు. ఆ జట్టు అప్పుడప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడుతున్నది. ఒకరకంగా.. అఫ్ఘాన్ జట్టు ప్రయాణాన్ని,  అస్గర్ కెరీర్ ను వేరు చేసి చూడనంతగా అతడు ప్రభావితం చేశాడు. కనీస సౌకర్యాలు కూడా లేని రోజుల్లో.. తాలిబన్ల భయాందోళనల నుంచి అఫ్ఘాన్ కుర్రాళ్లను  క్రికెట్ వైపునకు నడిపించడంలో అస్గర్ ది కీలక పాత్ర. 

 

2009 లో వన్డే అరంగ్రేటం చేసిన అస్గర్.. 2015 నుంచి ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.  అతడి సారథ్యంలో అఫ్ఘానిస్థాన్.. 59 వన్డేలు ఆడింది. అందులో 34 గెలువగా.. 21 మ్యాచ్ లు ఓడింది. ఒక మ్యాచ్ టై అయింది. మూడింటిలో ఫలితం తేలలేదు.  వన్డేలతో పాటు టెస్టుల్లో ఆ జట్టుకు తొలి కెప్టెన్ అజ్గరే కావడం గమనార్హం. 

 

 

 

2018లో  అఫ్ఘాన్  క్రికెట్ జట్టు.. భారత్ (India) తో  సిరీస్ తో టెస్టు క్రికెట్ లోకి అడుగుపెట్టింది. ఈ టెస్టుకు అస్గర్ కెప్టెన్. అతడి సారథ్యంలో 4 టెస్టులు ఆడగా.. అందులో రెండు గెలిచాడు. రెండు ఓడాడు. ఇక టీ20లలో  అయితే అస్గర్ కు తిరుగులేని రికార్డు ఉంది. 52 టీ20లలో అఫ్ఘాన్ ను ముందుండి నడిపించిన అతడు.. ఏకంగా 42 మ్యాచ్ లలో గెలిపించాడు. తొమ్మిది మాత్రమే ఓటమి పాలయ్యాడు. ఒక మ్యాచ్  టై అయింది. అస్గర్.. పొట్టి  ఫార్మాట్ లో అత్యధిక విజయాలు సాధించిన సారథిగా రికార్డు సాధించాడు. ఈ జాబితాలో టీమిండియా (team India) మాజీ సారథి ధోని (MS Dhoni) (72 మ్యాచ్ లలో 41 విజయాలు) రెండో స్థానంలో ఉన్నాడు. 

మొత్తంగా అస్గర్.. తన కెరీర్ లో  అఫ్ఘాన్ తరఫున.. 6 టెస్టులు, 115 వన్డేలు, 75 టీ20 లు ఆడాడు. టెస్టులలో 440, వన్డేలలో 2424, టీ20లలో 1,351 పరుగులు చేశాడు. కాగా.. అఫ్ఘాన్ మాజీ కెప్టెన్ రిటైర్మెంట్ పై అతడి క్లోజ్ ఫ్రెండ్, ప్రస్తుత టీ20 జట్టు కెప్టెన్ మహ్మద్ నబీ (Mohammad Nabi) స్పందించాడు. 

 

నబీ ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘నాకు అత్యంత ఆప్తుడు, సోదర సమానుడైన అస్గర్ రిటైర్మెంట్ ప్రకటన నాకు వ్యక్తిగతంగా తట్టుకోలేనిది. అఫ్ఘాన్ క్రికెట్ లో అతడు ఒక ధ్రువ తార. నీ విజయాలను అఫ్ఘాన్ క్రికెట్, చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఒక ఆటగాడిగా, కెప్టెన్ గా జాతీయ జట్టుకు ఎప్పుడూ గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చాడు. నీ క్రికెట్ తర్వాత జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా..’ అని ట్వీట్ చేశాడు. 

కాగా.. నమీబియా (Namibia) తో జరుగుతున్న పోరులో  చివరి మ్యాచ్ ఆడిన అస్గర్.. 23 బంతుల్లో 31 పరుగుల చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. ఇక అతడు ఔటై వెళ్తుండగా.. క్రీజులో ఉన్న నబీతో పాటు నమీబియా క్రికెటర్లు కూడా అతడితో కరచాలనం చేశారు. గ్రౌండ్ దాటి పెవిలియన్ కు చేరే సమయంలో అతడికి జట్టు సహచరులంతా గార్డ్ ఆఫ్ హానర్ చేశారు. అతడికి ఘనమైన వీడ్కోలు పలికారు. అఫ్ఘాన్ ఇన్నింగ్స్ అనంతరం అస్గర్ క్రికెట్ కామెంటరేటర్ తో మాట్లాడుతూ.. తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు.  కాగా, ఈ మ్యాచ్ లో గెలిచి తమ మాజీ కెప్టెన్ కు ఘనమైన వీడుకోలు పలకాలని అఫ్ఘాన్ భావిస్తున్నది. ప్రస్తుతం అఫ్ఘాన్ బౌలర్లు అదే పనిలో ఉన్నారు. పది ఓవర్లు ముగిసేసరికి నమీబియా.. నాలుగు కీలక వికెట్లు కోల్పోయి 55 పరుగులే చేసింది. ఆ జట్టు గెలవాలంటే మరో 60 బంతుల్లో 106 పరుగుల చేయాలి.

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !