ICC T20 World Cup: వేదికలు ఖరారు.. అదొక్కటే బ్యాలెన్స్.. వచ్చే టీ20 ప్రపంచకప్ కీలక అప్డేట్ విడుదల చేసిన ఐసీసీ

By Srinivas MFirst Published Jan 18, 2022, 2:38 PM IST
Highlights

ICC T20 World Cup 2022: గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ జ్ఞాపకాలు ఇంకా క్రికెట్ అభిమానుల మదిలోంచి చెదిరిపోకముందే.. క్రికెట్ అభిమానులకు ఐసీసీ మరో తీపి కబురు అందించింది. 
 

కంగారూల దేశం ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరుగనున్న ఎనిమిదవ టీ20 ప్రపంచకప్ నకు సంబంధించిన కీలక అప్డేట్ ను  అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్ నుంచి మొదలుకాబోయే ఈ మెగా టోర్నీకి సంబంధించి వేదికలను ఐసీసీ ఖరారు చేసింది. మొత్తం 7 వేదికలలో ఈ  ఈవెంట్ ను నిర్వహించేందుకు ఐసీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.  ఈ మేరకు మంగళవారం ట్విట్టర్ లో వేదికలను ఖరారు చేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. 

వేదికలివే... ఆస్ట్రేలియా వేదికగా జరిగే ఈ టోర్నీని మెల్బోర్న్, పెర్త్, హోబర్ట్, బ్రిస్బేన్, అడిలైడ్, సిడ్నీ, గీలాంగ్ లలో పొట్టి ప్రపంచకప్ మ్యాచులు జరుగుతాయని  నిర్వాహకులు వెల్లడించారు. 

 

The host cities are all locked in and ready for Australia's biggest Men’s T20 event for 2022 🏟 pic.twitter.com/QX3sZjOUGE

— T20 World Cup (@T20WorldCup)

మొత్తంగా 12 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 దాకా సాగనుంది.  నవంబర్ 9,10 తేదీలలో సెమీఫైనల్స్, 13న మెల్బోర్న్ లో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. కాగా ఈ మెగా టోర్నీ కోసం ఫిబ్రవరి నుంచే టికెట్ల విక్రయం ప్రారంభించనున్నట్టు సమాచారం. ఇదిలాఉండగా..  ప్రపంచకప్ షెడ్యూల్, ఏ గ్రూపులో ఏ జట్లు ఉంటాయి..?, ఇతరత్రా విషయాలను ఈ నెల 21న వెల్లడించనున్నట్టు తెలుస్తున్నది. 

 

🗓 21.01.2022
The ICC Men's T20 World Cup Australia 2022 fixture is coming! pic.twitter.com/9Z2ASZgaty

— T20 World Cup (@T20WorldCup)

2021 చివరినాటికి టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా  టాప్-8లో ఉన్న జట్లు ప్రపంచకప్-2022 కు  నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన నాలుగు స్థానాల కోసం క్వాలిఫైయర్ మ్యాచులు నిర్వహించనున్నారు. శ్రీలంక, వెస్టిండీస్, నమీబియా, స్కాట్లాండ్ లు క్వాలిఫైయర్స్ లో తలపడుతాయి. టీమిండియా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఇప్పటికే అర్హత సాధించాయి.  దుబాయ్ వేదికగా గతేడాది జరిగిన ఏడవ టీ20 ప్రపంచకప్ లో  ఆరోన్ ఫించ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా.. తొలిసారి పొట్టి కప్పును నెగ్గిన విషయం తెలిసిందే. ఇక ఈ టోర్నీలో ఫేవరేట్ గా బరిలోకి దిగిన భారత జట్టు.. గ్రూప్ దశలోనే ఇంటి బాట పట్టింది.   
 

click me!