ఆరంభమే సంచలనం! టీ20 వరల్డ్ కప్‌ 2022లో శ్రీలంకను చిత్తు చేసిన నమీబియా...

By Chinthakindhi RamuFirst Published Oct 16, 2022, 12:52 PM IST
Highlights

టీ20 వరల్డ్ కప్ 2022 ఆరంభమ్యాచ్‌లో నమీబియా చేతుల్లో 55 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన శ్రీలంక.. 164 పరుగుల లక్ష్యఛేదనలో 108 పరుగులకి ఆలౌట్ అయిన లంక...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే సంచలనం జరిగింది. పసికూన నమీబియా చేతుల్లో చిత్తుగా ఓడింది శ్రీలంక జట్టు. మూడు సార్లు ఫైనల్ చేరి, 2014లో టీ20 వరల్డ్ కప్ నెగ్గిన శ్రీలంక, ఓ అసోసియేట్ టీమ్ చేతుల్లో ఓడి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.  ఆసియా కప్ 2022 గెలిచి, పొట్టి ప్రపంచ కప్‌లో అడుగుపెట్టిన శ్రీలంకకి మొదటి మ్యాచ్‌లోనే ఊహించని షాక్ తగిలింది... 164 పరుగుల లక్ష్యఛేదనలో 108 పరుగులకి ఆలౌట్ అయిన లంక, 55 పరుగుల తేడాతో ఓడింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. మైఖేల్ వాన్ లింగెన్ 3, డివాన్ లా కాక్ 9 పరుగులు చేయగా 12 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 20 పరుగులు చేసిన లోఫ్టీ ఈటెన్‌ని కరుణరత్నే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. బార్డ్ 24 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేయగా కెప్టెన్ ఎరామస్ 24 బంతుల్లో 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

జాన్ ఫ్రైలింక్ 28 బంతుల్లో 4 ఫోర్లతో 44 పరుగులు చేసి రనౌట్ అయ్యింది. డేవిడ్ వీజ్‌ని మహీశ్ తీక్షణ గోల్డోన్ డకౌట్ చేశాడు. జెజె స్మిత్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. ఆఖరి 5 ఓవర్లలో నమీబియా బ్యాటర్లు 68 పరుగులు రాబట్టారు. లంక బౌలర్లలో ప్రమోద్ మదుషాన్ 2 వికెట్లు తీయగా మహీశ్ తీక్షణ, దుస్మంత ఛమీరా, కరుణరత్నే, వానిందు హసరంగ తలా ఓ వికెట్ తీశారు...

టీ20 వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంక ఇచ్చిన అత్యధిక స్కోరు ఇదే. ఇంతకుముందు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలతో మొదటి మ్యాచ్ ఆడినప్పుడు కూడా లంక జట్టు 160+ పరుగుల స్కోరు ఇవ్వకపోవడం విశేషం... 

భారీ లక్ష్యఛదనలో 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది శ్రీలంక. పథుమ్ నిశ్శంక 9 పరుగులు చేయగా కుశాల్ మెండిస్ 6 పరుగులు చేసి అవట్ అయ్యాడు. నిశ్శంకను అవుట్ చేసిన బెన్ సికాంగో, ఆ తర్వాతి బంతికే ధనుష్క గుణతిలకని గోల్డెన్ డకౌట్ చేశాడు. ధనంజయ డి సిల్వ 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...

ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన బెన్ సికాంగో రెండు వికెట్లు తీసి డబుల్ వికెట్ మెయిడిన్ వేశాడు. టీ20 వరల్డ్ కప్‌లో మెయిడిన్ ఓవర్ వేసిన రెండో నమీబియా బౌలర్‌గా నిలిచాడు బెన్ సికాంగో. ఇంతకుముందు 2021లో రూబెన్ ట్రంపెల్మన్, పాకిస్తాన్‌పై మెయిడిన్ ఓవర్ వేశాడు...

భనుక రాజపక్షతో కలిసి ఐదో వికెట్‌కి 34 పరుగుల భాగస్వామ్యం జోడించిన ధస్సున్ శనక కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. 21 బంతుల్లో 2 ఫోర్లతో 20 పరుగులు చేసిన రాజపక్షని స్కాల్జ్‌ అవుట్ చేయగా 4 పరుగులు చేసిన వానిందు హసరంగ కూడా అతని బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 

23 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 29 పరుగులు చేసిన శనక కూడా జాన్ ఫ్రైలిక్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో లంక ఓటమి ఖరారైపోయింది. ప్రమోద్ మదుషాన్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే రనౌట్ రూపంలో డైమండ్ డకౌట్ అయ్యాడు. కరుణరత్నే 5 పరుగులు చేసి అవుట్ కాగా మహీశ్ తీక్షణ పరుగులు చేసి లంక స్కోరు 100 మార్కు దాటించాడు... 19 ఓవర్లకు 108 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 

2003 వన్డే వరల్డ్ కప్‌లో కెన్యా చేతుల్లో ఓడిన శ్రీలంక, ఆ తర్వాత ఆఫ్రికా అసోసియేట్ దేశం చేతుల్లో ఓడడం ఇదే తొలిసారి. 

 

click me!