T20 World Cup: ఈ సెమీస్ హీరోలు ఒకప్పుడు జాన్ జిగ్రీ దోస్తులు.. ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్లో ప్రత్యర్థులు..

By team teluguFirst Published Nov 13, 2021, 11:09 AM IST
Highlights

Australia Vs New Zealand: ఒకరకంగా చెప్పాలంటే  ఆసీస్ కు స్టాయినిస్.. కివీస్ కు మిచెల్ సెమీస్ హీరోలు. వేర్వేరు దేశాలకు చెందిన ఈ ఇద్దరూ జాన్ జిగ్రీ దోస్తులు అన్న విషయం చాలా మందికి తెలియదు. 

యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20  ప్రపంచకప్ ముగింపుదశకు చేరింది. ఆదివారం ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ పోరు జరుగనున్నది. అంచనాలేమీ లేకుండా బరిలోకి దిగిన న్యూజిలాండ్..  టీ20 ప్రపంచకప్ లో అనూహ్యంగా ఫైనల్ చేరగా.. అయిదు సార్లు వన్డే ప్రపంచ ఛాంపియన్ అయి ఉండి కూడా పొట్టి ప్రపంచకప్ నెగ్గని అపప్రదను చెరిపేసుకోవడానికి ఆసీస్ కూడా సెమీస్ లో పాకిస్థాన్ ను ఓడించి తుది పోరుకు సిద్దమైంది. ఈ రెండు జట్ల మధ్య చిరకాల వైరమే. ఈ రెండు జట్లు ఐసీసీ ఈవెంట్లలో పోటీ పడటం ఇది రెండోసారి. అయితే ఈసారి రెండు జట్ల మధ్య పోరులో మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. 

టీ20 ప్రపంచకప్ సెమీస్ లో  ఆస్ట్రేలియా.. పాకిస్థాన్ ను ఓడించి ఫైనల్స్ కు చేరింది. 16 వ ఓవర్ దాకా తమ చేతిలో లేని మ్యాచ్ ను ఆసీస్ ఆ తర్వాత తమ వైపునకు తిప్పుకుంది. ఇందులో ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాట్స్మెన్ మార్కస్ స్టాయినిస్ ది కీలక పాత్ర. ఆ తర్వాత  మాథ్యూ వేడ్.. 19వ ఓవర్లో  మూడు సిక్సర్లు కొట్టి హీరో అయినా విజయంలో స్టాయినిస్ పాత్ర మరువలేనిది. 

ఇక ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మ్యాచ్ లో సైతం  కివీస్ విజయంపై ఎవరికీ నమ్మకం లేదు. 167 పరుగుల ఛేదనలో ఆ జట్టు 5 ఓవర్లలో 20 పరుగుల లోపే అనుభవజ్ఞులైన గప్తిల్, కేన్ విలిమయ్సన్ వికెట్లను కోల్పోయింది. ఈ సమయంలో కివీస్ ను ఆదుకున్నది డరిల్ మిచెల్, డేవిన్ కాన్వే. ఆ మ్యాచ్ లో కూడా దాదాపు 15 వ ఓవర్ తర్వాత కివీస్ పోటీలోకి వచ్చింది. ఓపెనర్ గా వచ్చిన మిచెల్.. 47 బంతుల్లోనే 71 పరుగులు బాదాడు. మిచెల్ వీరవిహారంతో టీ20 ప్రపంచకప్ లో ఆ జట్టు తొలిసారి ఫైనల్స్ కు ప్రవేశించింది. 

ఒకరకంగా చెప్పాలంటే  ఆసీస్ కు స్టాయినిస్.. కివీస్ కు మిచెల్ సెమీస్ హీరోలు. వేర్వేరు దేశాలకు చెందిన ఈ ఇద్దరూ జాన్ జిగ్రీ దోస్తులు.  ఒక్కటి కాదు.. రెండు కాదు.. దాదాపు పుష్కర కాలం (12 ఏండ్లు)గా వీరి ఫ్రెండ్షిప్ కొనసాగుతున్నది.

అవును.. స్టాయినిస్,  మిచెల్ ఇద్దరూ కలిసి చదువుకున్నారు. న్యూజిలాండ్ కు చెందిన మిచెల్.. ఆస్ట్రేలియాలోనే పుట్టిన స్టాయినిస్ ఒకే స్కూల్ లో చదువుకున్నారు. అప్పట్నుంచే ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి స్కార్బరో తరఫున ఆడారు. 2009లో జరిగిన వాకా ప్రీమియర్షిప్ లో భాగంగా ఈ ఇద్దరూ సెమీస్, ఫైనల్స్ లో తమ జట్టును గెలిపించారు. సెమీస్ లో  స్టాయినిస్ 189 పరుగులు చేయగా... పైనల్స్ లో మిచెల్ 4 వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించారు.  ఆ తర్వాత ఇద్దరూ వారి కెరీర్ కోసం జాతీయ జట్లలో చోటు కోసం తమ దారులు వెతుక్కుంటూ వెళ్లారు. మళ్లీ వరల్డ్ కప్ ఫైనల్లో ఈ ఇద్దరూ  ప్రత్యర్థులుగా తలపడుతుండటం గమనార్హం. ఇంకో ముఖ్యవిషయమేమిటంటే ఈ ఇద్దరికీ ప్రస్తుత ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ మెంటార్ గా వ్యవహరించాడు. 

ఇదే విషయమై మిచెల్ మాట్లాడుతూ.. ‘లాంగర్, హోల్డర్ (మిచెల్ మెంటార్) ఇద్దరూ నా కెరీర్ పై ప్రభావం చూపారు. వారితో కలిసి పనిచేయడం వల్ల క్రికెటర్ గానే గాక వ్యక్తిగా నేను చాలా నేర్చుకున్నాను.  పాఠశాల నుంచి బయటకు వచ్చాక క్లబ్  క్రికెట్ ఆడుతున్న సమయంలో లాంగర్ తో పరిచయమవడం.. అతడితో కలిసి పనిచేయడం మరిచిపోలేనిది. చిన్నప్పట్నుంచి అతడిని చూస్తూ పెరిగాను. ఇప్పుడు అతడితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం అద్భుతంగా ఉంది’ అని అన్నాడు. 

ఇక స్టాయినిస్ గురించి స్పందిస్తూ.. ‘మార్కస్ స్టాయినిస్, హారిస్ తో  కలిసి క్లబ్ క్రికెడ్ ఆడటం.. ఇప్పుడు వాళ్లు ఆసీస్ కు ప్రాతినిథ్యం వహిస్తుండటం గొప్ప అనుభూతినిస్తుంది. వీరితో కలిసి ఎదగడం.. క్రికెట్ ప్రాక్టీస్.. వాళ్లతో గడిపిన సమయంల నన్ను నాకు క్రికెటర్ గా ఎదగడానికి ఎంతగానో తోడ్పడింది..’ అని మిచెల్ చెప్పాడు. 

2015  వన్డే  ప్రపంచకప్ లో న్యూజిలాండ్-ఆస్ట్రేలియా తలపడ్డాయి. అయితే ఈ పోరులో మైకెల్ క్లార్క్ నేతృత్వంలోని కంగారూలనే విజయం వరించింది. ఫైనల్ లో కివీస్ చతికిలపడింది. మిచెల్ స్టార్క్ విజృంభించడంతో న్యూజిలాండ్ తక్కువ స్కోరుకే ఔట్ అయింది.  ఆ జట్టులో ఆడిన గప్తిల్, విలియమ్సన్ ఇప్పుడు న్యూజిలాండ్ బ్యాటింగ్ కు వెన్నెముకగా నిలిచారు. మరి రేపటి పోరులో ఈ రెండు జట్ల మధ్య పోటీ రసవత్తరం కానున్నదనడంలో ఏమాత్రం సందేహం లేదు. 

click me!