T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఇటీవలే పాకిస్తాన్ తో ముగిసిన మ్యాచ్ లో టీమిండియాను ఓటమి నుంచి గట్టెక్కించి అనూహ్య విజయాన్ని అందించిన మాజీ సారథి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు ముందు ఎంత క్రేజ్ ఉందో అది ముగిసి మూడు రోజులైనా ఆ రసవత్తరపోరుకు సంబంధించిన ఏదో ఒక విషయం నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంది. 160 పరుగుల లక్ష్య ఛేదనలో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి అసలు భారత్ గెలుస్తుందా..? అనే స్థితి నుంచి పాకిస్తాన్ ను ఓడించాం అని భారత అభిమానులు సగర్వంగా చెప్పుకునే స్థితికి తీసుకొచ్చింది విరాట్ కోహ్లీ. మెల్‌బోర్న్ లో కోహ్లీ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఐఏఎస్ ఆఫీసర్ అవనీశ్ శరన్ కూడా కోహ్లీ ఇన్నింగ్స్ కు ఫిదా అయ్యారు. తాజాగా ఆయన కోహ్లీ ఇన్నింగ్స్ కు సంబంధించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
2009 బ్యాచ్ కు చెందిన అవనీశ్ శరన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవేనని ఐదు విషయాలను వెల్లడించారు. ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ ఆ పంచ సూత్రాలను ట్వీట్ చేశారు.
‘విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ నుంచి నేర్చుకోవాల్సిన ఐదు పాఠాలు.. 1. మీ బ్యాడ్‌టైమ్ తాత్కాలికం. అది శాశ్వతమైనది కాదు. 2. మీ ప్రదర్శన ద్వారానే మీరు సమాధానమివ్వాలి. 3. చివరి నిమిషం వరకు మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి. 4. ప్రజలు ఏ విషయాన్నైనా చాలా త్వరగా మరిచిపోతారు. 5. ఆత్మవిశ్వాసం పెరిగితే ఎంత పెద్ద కష్టాన్నైనా సునాయసంగా ఛేదించవచ్చు..’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
की पारी से सीख:
1. आपका बुरा समय भी स्थायी नहीं है
2. सिर्फ़ अपने परफ़ॉर्मेंस से ही जवाब दिया जा सकता
3. अंतिम समय तक अपनी भावनाओं पर नियंत्रण रखना
4. लोगों की याददाश्त बहुत छोटी होती है
5. जब आत्मविश्वास बढ़ता है तो कठिन परिस्थिति भी आसान लगती है
అవనీశ్ చెప్పినట్టు కోహ్లీ విషయాన్నే తీసుకుంటే ఆయన చెప్పిన ప్రతీ విషయం అక్షర సత్యమే. బ్యాడ్ టైమ్ తాత్కాలికమే అన్నారాయన. అవును.. గత మూడేండ్లుగా కోహ్లీ ఫామ్ బాగోలేదని, సెంచరీ చేయడం లేదని.. శతకం పక్కనబెడితే కనీసం 30, 40 లు కూడా చేయలేకపోతున్నాడని కోహ్లీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఆసియా కప్ కు ముందు విశ్రాంతి తీసుకున్న కోహ్లీ ఆ ఫేజ్ ను దాటాడు.
రెండో విషయం ప్రదర్శనతోనే సమాధానమివ్వాలి.. తనను విమర్శించిన ఏ ఒక్కరిపైనా కోహ్లీ ఎన్నడూ ప్రత్యక్షంగా ఒక్క మాట కూడా అనలేదు. ఆసియా కప్ నుంచి మళ్లీ పరుగుల దాహాన్ని తీర్చుకుంటూ వస్తున్నాడు. తన బ్యాట్ తోనే మాట్లాడుతున్నాడు. మూడేండ్లుగా లేని సెంచరీని కూడా పూర్తి చేశాడు.
చివరి నిమిషం వరకు భావోద్వేగాలను నియంత్రించుకోవడం.. మాములుగా కోహ్లీ కి దూకుడెక్కువ. మైదానంలో అతడిని చూస్తే అది అర్థమవుతుంది. కానీ పాకిస్తాన్ తో మ్యాచ్ లో వరుసగా వికెట్లు పోతున్నా.. పాక్ బౌలర్లు రెచ్చిపోతున్నా.. ఛేదించాల్సిన లక్ష్యం పెరిగిపోతున్నా కోహ్లీ వెరవలేదు. చివరివరకూ నిలబడ్డాడు. చివర్లో తలబడ్డాడు. మ్యాచ్ ముగిశాక కోహ్లీ ఎక్స్‌ప్రెషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రపంచమంతా చూసింది.
ప్రజలు ఏ విషయాన్నైనా మరిచిపోతారు.. నిన్నా మొన్నటిదాకా కోహ్లీ రిటైరైతే బెటర్ అన్న చాలా మంది ఇప్పుడు మళ్లీ ‘కింగ్ ఈజ్ బ్యాక్’ అంటున్నారు. తన పరుగుల దాహం తీరలేదని.. మరో ఐదారేండ్లు కోహ్లీకి తిరుగులేదని చెబుతున్నారు.
ఆత్మవిశ్వాసం పెరిగితే ఎంత పెద్ద లక్ష్యాన్నైనా ఛేదించడం.. పాకిస్తాన్ ఇన్నింగ్స్ లో కోహ్లీ ఆడిన ఆటే ఇందుకు సజీవ సాక్ష్యం. నెమ్మదిగా ఇన్నింగ్స్ సాగుతున్నామొక్కవోని దీక్షతో చివరి వరకు నిలిచి ఆఖరి 3 ఓవర్లలో 48 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అనేది మామూలు విషయం కాదు. అదీ బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై.. షాహీన్ షా అఫ్రిది, హరీస్ రౌఫ్ బౌలింగ్ లలో కోహ్లీ బాదుడే ఇందుకు సజీవ సాక్ష్యం.