
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో ఆస్ట్రేలియానే ఫెవరెట్. ఐసీసీ టెస్టు నెం.1 టీమ్‌గా భారత్‌లో అడుగుపెట్టింది ఆస్ట్రేలియా. అయితే తొలి రెండు టెస్టుల్లో మాత్రం ఆసీస్ పర్ఫామెన్స్ కనీసం శ్రీలంక స్థాయిలో కూడా లేదు. అయితే ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో మాత్రం 9 వికెట్ల తేడాతో గెలిచి టీమిండియాకి షాక్ ఇచ్చింది ఆస్ట్రేలియా...
ఆసీస్ రెగ్యూలర్ టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, రెండో టెస్టు ముగిసిన తర్వాత స్వదేశానికి వెళ్లిపోయాడు. ప్యాట్ కమ్మిన్స్ తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండడంతో అక్కడే ఉండి ఆమెను చూసుకుంటున్నాడు... మూడో టెస్టు సమయానికి కమ్మిన్స్, ఇండియాకి తిరిగి వస్తాడని ఆస్ట్రేలియా ప్రకటించినా, అతని తల్లి ఆరోగ్యం విషమించడంతో అక్కడే ఉండిపోయాడు ఆసీస్ సారథి...
దీంతో వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో ఇండోర్ టెస్టు ఆడిన ఆస్ట్రేలియా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో తొలి విజయం అందుకుంది. అది కూడా ఆట ఆరున్నర సెషన్ల పాటు సాగితే అందులో ఐదున్నర సెషన్ల పాటు ఆస్ట్రేలియా ఆధిపత్యమే సాగింది...
రెండో రోజు తొలి సెషన్‌లో మాత్రమే 11 పరుగుల తేడాలో 6 వికెట్లు తీసి టీమిండియా ఆధిపత్యం చూపించింది. ఓవర్ ఓవర్‌కి ఫీల్డింగ్‌లో మార్పులు చేసి, బ్యాటర్లకు తగ్గట్టుగా బౌలర్లను మారుస్తూ చురుగ్గా కదిలిన స్టీవ్ స్మిత్... ఫీల్డింగ్‌లో మెరుపు క్యాచులు అందుకున్నాడు.
భారత టాపార్డర్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ముగ్గురు స్పిన్నర్లను మార్చి మార్చి వాడుతూ ఇబ్బంది పెట్టిన స్టీవ్ స్మిత్... అశ్విన్, అక్షర్ పటేల్ వంటి భారత స్పిన్నర్లు బ్యాటింగ్‌కి వచ్చిన సమయంలో మిచెల్ స్టార్క్ రూపంలో ఫాస్ట్ బౌలర్‌ని తీసుకొచ్చి ఫలితం రాబట్టాడు..
రెండో ఇన్నింగ్స్‌లో 59 పరుగులు చేసి క్రీజులో నిలదొక్కుకుపోయిన ఛతేశ్వర్ పూజారా, స్టీవ్ స్మిత్ పట్టిన ఓ బ్లైడ్ క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు... ఇండియాలో రెండు టెస్టు విజయాలు అందుకున్న ఆసీస్ కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు స్టీవ్ స్మిత్. ఇంతకుముందు ఆడమ్ గిల్‌క్రిస్ట్ మాత్రమే ఈ ఫీట్ సాధించాడు.
2017 టీమిండియా పర్యటనలో పూణె టెస్టులో 300+ పరుగుల భారీ తేడాతో భారత జట్టుపై టెస్టు మ్యాచ్ గెలిచిన స్టీవ్ స్మిత్, ఇండోర్ టెస్టులో 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్నాడు. 2010 నుంచి గత 13 ఏళ్లలో టీమిండియా స్వదేశంలో 3 టెస్టులు మాత్రమే ఓడింది. అందులో రెండు స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో కాగా మరోటి 2021లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ కెప్టెన్సీలో ఓడింది..
‘ఇండియాలో టెస్టు క్రికెట్ ఆడడాన్ని నేను ఎంతగానో ఎంజాయ్ చేస్తాను. ఇక్కడ గెలవడానికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఎన్నో ఏళ్లుగా భారత్‌కి వస్తున్నా. ఇక్కడ పిచ్, పరిస్థితుల గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. మా బౌలర్లు సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేసి, భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలిగారు...
కుహ్నేమన్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. తొలి రోజు అతని బౌలింగ్ మా విజయానికి ప్రధాన కారణం. బౌలింగ్‌లో మా బౌలర్లు చూపించిన భాగస్వామ్యాలు అద్భుతం..
తొలి ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖావాజా చక్కగా బ్యాటింగ్ చేశాడు. ఈ సిరీస్‌లో అతను మాకు కీలక ప్లేయర్. రెండో రోజు టీమిండియా చాలా బాగా పోరాడింది. రెండో ఇన్నింగ్స్‌లో మేం 250 పరుగులు చేయాలనుకున్నాం. అయితే భారత బౌలర్ల కారణంగా అది వీలు కాలేదు...
పూజారా అసాధారణ ఇన్నింగ్స్‌తో మమ్మల్ని చాలా ఇబ్బందిపెట్టాడు. అతని అవుట్ చేయకపోతే పరిస్థితి మారిపోయి ఉండేది. నాథన్ లియాన్ 8 వికెట్లు తీసి అదరగొట్టాడు. స్వదేశానికి వెళ్లిన ప్యాట్ కమ్మిన్స్ కోసం ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించడం గర్వంగా ఉంది. నాలుగో టెస్టులో కూడా ఇదే రకమైన పర్ఫామెన్స్ చూపించి, సిరీస్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నిస్తాం...’ అంటూ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా తాత్కాలిక టెస్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్..
అహ్మదాబాద్‌లో జరిగే నాలుగో టెస్టులో కూడా ప్యాట్ కమ్మిన్స్ ఆడడం అనుమానంగా మారింది. చివరి టెస్టులో కూడా స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో 37 టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా 21 విజయాలు అందుకుంది.