MS Dhoni: ఏదేమైనా సరే.. నా లాస్ట్ మ్యాచ్ మెరీనా తీరాన్నే ఆడతా.. తమిళ తంబీలకు తలైవా హామీ

Published : Nov 21, 2021, 02:15 PM IST
MS Dhoni: ఏదేమైనా సరే.. నా లాస్ట్ మ్యాచ్ మెరీనా తీరాన్నే ఆడతా.. తమిళ తంబీలకు తలైవా హామీ

సారాంశం

Tamilnadu CM Praised MS Dhoni: తమ అభిమాన ఆటగాడు వచ్చే సీజన్ లో తమతో ఉంటాడా..? ఉండడా..? అని తర్జనభర్జన పడుతున్న చెన్నై అభిమానులకు ధోని గుడ్ న్యూస్ చెప్పాడు. ఇప్పుడైనా.. మరో ఐదేండ్లైనా తన చివరి మ్యాచ్ ఇక్కడే ఆడతానని స్పష్టం చేశాడు. 

టీమిండియా మాజీ సారథి.. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) తమిళ తంబీలు పండుగ చేసుకునే న్యూస్ చెప్పాడు. వచ్చే ఏడాదైనా.. మరో ఐదేండ్లకైనా తాను చివరి  మ్యాచ్ మెరీనా తీరాన ఉన్న చెన్నై (Chennai) చెపాక్ స్టేడియంలోనే ఆడతానని స్పష్టం చేశాడు. దీంతో  మహేంద్రుడు చెన్నైని వీడటం లేదని స్పష్టమైంది. కొద్దిరోజుల్లో ఐపీఎల్ (IPL) వేలం జరుగనున్న నేపథ్యంలో  పాత ఫ్రాంచైజీలు నలుగురు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకునే అవకాశముంది. అయితే ధోని.. ఇకపై చెన్నైకి ఆడతాడా..? లేక మెంటార్ గా ఉంటాడా..? అనేది  తమిళ అభిమానులకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.  అయితే  శనివారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ధోని తో పాటు సీఎస్కే  యజమాని శ్రీనివాసన్ కూడా  అభిమానుల అనుమానాలను పటాపంచలు చేశారు. తమిళనాడు (Tamilnadu)ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ (MK Stalin) కూడా..  ధోని మరో కొన్నేళ్లు చెన్నైని నడిపించాలని కోరడం గమనార్హం. 

ఇటీవలే ముగిసిన ఐపీఎల్-14లో సీఎస్కేను  విజేతగా నిలిపి ఆ జట్టుకు నాలుగో టైటిల్ అందించిన ధోని.. చెన్నై లో జరిగిన విజయ సంబురాల  కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ.. ‘నా క్రికెట్ కోసం నిత్యం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా.  భారత్ లో చివరి వన్డేను నా స్వరాష్ట్రమైన జార్ఖండ్ రాజధాని రాంచీలో ఆడాను.  ఇక ఐపీఎల్ లో  నా చివరి టీ20ని చెన్నైలోనే ఆడతాననే నమ్మకంతో ఉన్నా. అది తర్వాత ఏడాదా..?లేక మరో ఐదేళ్లకా..? అనేది నాక్కూడా తెలీదు..’ అని అన్నాడు. 

 

అభిమానుల బలమే చెన్నైని నడిపిస్తుందని ధోని చెప్పాడు. తాము భారత్ తో పాటు విదేశాల్లో ఆడినా కూడా సీఎస్కే అభిమానులు అక్కడకు వచ్చి తమకు మద్దతు తెలుపుతున్నారని తెలిపాడు. రెండేళ్ల పాటు తమ జట్టు లీగ్ కు దూరమైతే కూడా సామాజిక మాధ్యమాలలో  చెన్నై గురించే ఎక్కువగా మాట్లాడారని చెప్పుకొచ్చాడు. చెన్నై యజమాని శ్రీనివాసన్ మాట్లాడుతూ.. ‘అతడెక్కడికీ వెళ్లడం లేదు. మాతోనే ఉన్నాడు’ అని తెలిపాడు. 

 

ధోని అభిమానిగా వచ్చా : స్టాలిన్ 

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. ‘శ్రీనివాసన్ నన్ను ముఖ్యమంత్రి హోదాలో ఆహ్వానించారు. కానీ నేను మాత్రం ధోని అభిమానిగా ఇక్కడకు వచ్చా. నేనే కాదు.. మా కుటుంబంలో అందరూ ధోని అభిమానులమే. దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి కూడా ఆయన ఫ్యానే.  ధోని స్వరాష్ట్రం జార్ఖండ్ కావచ్చు గానీ అతడిప్పుడు తమిళనాడుకు చెందినవాడిగానే ఇక్కడి అభిమానులు చూస్తున్నారు. అతడెప్పుడూ కూల్ గా ఉంటాడు. క్లిష్ట సమయాలను ఎలా ఎదుర్కోవాలో ధోనికి బాగా తెలుసు. ఈ సంవత్సరం ఐపీఎల్ గెలిచినందుకు అభినందనలు. ధోని మరిన్ని సీజన్లు సీఎస్కే తరఫున ఆడాలని నేను కోరుకుంటున్నాను..’ అని తెలిపాడు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

స్మృతి మంధాన vs సానియా మీర్జా : ఇద్దరిలో ఎవరు రిచ్.. ఎవరి ఆస్తులెన్ని?
IND vs SA: టీమిండియాకు తలనొప్పిగా మారిన స్టార్ ప్లేయర్ !