థాయ్లాండ్ కథ ముగిసింది.. మహిళల ఆసియా కప్ ఫైనల్స్‌కు భారత్

Published : Oct 13, 2022, 11:32 AM ISTUpdated : Oct 13, 2022, 11:36 AM IST
థాయ్లాండ్ కథ ముగిసింది.. మహిళల  ఆసియా కప్ ఫైనల్స్‌కు భారత్

సారాంశం

Women's Asia Cup 2022: మహిళల ఆసియా కప్ లో భారత జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది. షిల్హెట్  వేదికగా థాయ్లాండ్ తో ముగిసిన  మొదటి సెమీస్ లో హర్మన్ప్రీత్ కౌర్ సేన.. 74 పరుగుల  తేడాతో విజయదుందుభి మోగించింది. 

బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్-2022లో భారత జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది.  మొదటి సెమీస్ లో భాగంగా థాయ్లాండ్ తో ముగిసిన మ్యాచ్  లో భారత మహిళల జట్టు 74 పరుగుల తేడాతో  ఆ జట్టును చిత్తు చేసింది.  ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన భారత జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మ (28 బంతుల్లో 42, 5 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (36) రాణించింది.  లక్ష్య ఛేదనలో థాయ్లాండ్.. 74 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా భారత్ ఈ మెగా టోర్నీలో వరుసగా ఎనిమిదోసారి ఫైనల్ కు చేరింది. 

బంగ్లాదేశ్ లోని షిల్హెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో  టాస్ ఓడిన భారత జట్టుకు  ఓపెనర్లు శుభారంభం అందించారు. స్మృతి మంధాన (13) విఫలమైనా  జెమీమా రోడ్రిగ్స్ (27)  తో కలిసి షఫాలీ  దూకుడుగా ఆడింది.  

షఫాలీ నిష్క్రమించాక  హర్మన్ప్రీత్ కూడా ధాటిగా ఆడింది.  చివర్లో పూజా వస్త్రకార్ (17 నాటౌట్)  మెరవడంతో భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. 

అనంతరం లక్ష్య ఛేదనలో థాయ్లాండ్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు.  టీమిండియా స్పిన్నర్ దీప్తి శర్మ.. ఆదిలోనే ఆ జట్టును దెబ్బతీసింది.   నన్నపత్ (5), చెంతమ్ (4) లతో పాటు తిప్పోచ్ (5) లను  వెనక్కి పంపింది. ఫలితంగా  థాయ్లాండ్ 8 ఓవర్లకే  నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. 

 

అయితే కెప్టెన్ చైవై (21), నట్టయ భూచతమ్ (21) కాస్త ప్రతిఘటించారు. వికెట్ల పతనాన్నైతే అడ్డుకున్నారు గానీ వీళ్లు జట్టును విజయం దిశగా నడిపించలేకపోయారు.  చివరికి 16.6 ఓవర్లో భూచతమ్ ను స్నేహ్ రాణా ఎల్బీగా ఔట్ చేసింది. ఆ తర్వాత థాయ్లాండ్ మళ్లీ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేయగలిగింది. ఫలితంగా భారత్.. 74 పరగుల తేడాతో విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా.. రాజేశ్వరి గైక్వాడ్ రెండు, రేణుకా సింగ్, స్నేహ్ రాణా, షఫాలీ వర్మ తలా ఓ వికెట్ పడగొట్టారు. 

ఈ విజయంతో  భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఫైనల్లో భారత్.. నేటి మధ్యాహ్నం  పాకిస్తాన్-శ్రీలంకల మధ్య జరిగే మ్యాచ్ లో విజేతతో ఈనెల 15న ఇదే వేదికగా  ఫైనల్ ఆడుతుంది. ఇది టీమిండియాకు 8వ ఫైనల్ కావడంత గమనార్హం. మహిళల ఆసియా కప్ లో భారత్ ఇది వరకే 6 ట్రోఫీలు నెగ్గింది.  చివరిసారి బంగ్లాదేశ్ ట్రోఫీని ఎగురేసుకుపోయింది. మరి ఈసారి ఆసియా ఛాంపియన్లు ఎవరవుతారనేది  ఈనెల 15న తేలనుంది. 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !