గల్లీ క్రికెట్ ఆడిన భజ్జీ.. కీపింగ్ చేస్తూ సూపర్ క్యాచ్.. కామెంట్రీ చెప్పింది ఎవరో తెలుసా..?

By team teluguFirst Published Nov 18, 2021, 7:07 PM IST
Highlights

Harbhajan Singh: టీమిండియా తరఫున వందలాది మ్యాచులాడిన హర్భజన్ సింగ్.. గల్లీ క్రికెట్ ఆడాడు. ఇందుకు సంబంధించిన  వీడియోను భజ్జీ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. దీనికి  గల్లీ క్రికెట్ విత్ కామెంట్రీ అని రాసుకొచ్చాడు.

టర్బోనేటర్.. ఆఫ్ స్పిన్ మాంత్రికుడు.. ఆసీస్ ఆటగాళ్లకు కొరకరాని కొయ్య.. ఇవీ టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కు ఉన్న పేర్లు. వందకు పైగా టెస్టులు.. రెండు వందలకు పైగా వన్డేలు ఆడి తన  అంతర్జాతీయ కెరీర్ లో సుమారు 700కు పైగా వికెట్లు తీసుకున్న ఈ మాజీ స్పిన్నర్ గల్లీ క్రికెట్ ఆడాడు. అది కూడా బౌలర్ గానో, బ్యాటర్ గానో కాదు.. ఈసారి భజ్జీ కొత్త అవతారమెత్తాడు. వికెట్ కీపర్ అయ్యాడు.  అదేంటి.. హర్భజన్ గల్లీ క్రికెట్ ఎందుకు ఆడాడు...? బౌలింగ్ వేయకుండా కీపింగ్ ఎందుకు చేస్తాడు..? అనుకుంటున్నారా..? 

తన ఇంటికి సమీపంలో హర్భజన్ గల్లీ క్రికెట్ ఆడాడు. చుట్టు పక్కల మిత్రులు, స్నేహితులతో కలిసి భజ్జీ  మళ్లీ క్రీజులో అడుగుపెట్టాడు. అయితే ఈసారి బౌలర్ గా కాదు. వికెట్ కీపర్ గా. ఓ స్పిన్నర్ బౌలింగ్ చేయగా వికెట్ కీపింగ్ చేసిన టర్భోనేటర్.. సూపర్ క్యాచ్  కూడా అందుకున్నాడు. అయితే తొలిసారి ఈ క్యాచ్ మిస్ అయినా రెండో ప్రయత్నంలో మాత్రం భజ్జీ దానిని ఒడిసిపట్టుకున్నాడు. ఆ తర్వాత భల్లే.. భల్లే అంటూ డాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నది. 

ఈ వీడియోను భజ్జీ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. దీనికి  గల్లీ క్రికెట్ విత్ కామెంట్రీ అని రాసుకొచ్చాడు. ఈ వీడియోను ఇప్పటికే వేలాది మంది లైక్ చేశారు. కాగా ఈవీడియోకు  భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కామెంట్రీ చెప్పడం గమనార్హం. 

 

వీడియోపై  పలువురు నెటిజన్లు స్పందిస్తూ..‘ఈ అబ్బాయి  తిరిగి టీమిండియాకు ఆడాల్సిన సమయం ఆసన్నమైంది..’ అని ‘సింగ్ ఈజ్ కింగ్..’ అని కామెంట్ చేయగా.. మరో యూజర్ ‘కమ్రాన్ అక్మాల్ (పాకిస్థాన్ వికెట్ కీపర్) కంటే బాగా కీపింగ్ చేస్తున్నావ్..’ అని కామెంట్ చేశాడు. 

భారత్ తరఫున 103 టెస్టులాడిన భజ్జీ.. 417 వికెట్లు తీశాడు. వన్డేలలో 236 మ్యాచులాడి 269 వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20 లలో 28 మ్యాచులాడి 25 వికెట్లు తీశాడు. మొత్తంగా అంతర్జాతీయ కెరీర్ లో భజ్జీ.. 711 వికెట్లు తీయడం గమనార్హం.  టెస్టులలో 5 వికెట్లు 25 సార్లు తీయగా.. ఉత్తమ ప్రదర్శన 8-84 గా ఉంది. అంతేగాక బ్యాటింగ్ విషయానికొస్తే.. టెస్టుల్లో 2,224 పరుగులు చేసిన భజ్జీ.. ఓ సెంచరీ (115) కూడా చేయడం విశేషం. 

click me!