Rumeli Dhar: టీమిండియాకు గుడ్ బై చెప్పిన రుమేలి ధర్.. 15 ఏండ్ల కెరీర్ కు శుభం కార్డు

By Srinivas MFirst Published Jun 22, 2022, 4:25 PM IST
Highlights

Rumeli Dhar retirement: టీమిండియా మహిళా క్రికెట్ లో సుదీర్ఘకాలం సేవలందించిన మరో క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పింది. 2003 నుంచి 15 ఏండ్లు భారత జట్టు తరఫున ఆడిన రుమేలి.. 

ఇటీవలే భారత మహిళా క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్ ఆటకు గుడ్ బై చెప్పగా తాజాగా రుమేలి ధర్ కూడా ఆమె బాటలోనే నడిచింది. మిథాలీ మాదిరే సుదీర్ఘ క్రికెట్ కెరీర్ రుమేలి సొంతం. 2003 నుంచి 2018 వరకు ఆమె భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించింది.  సుదీర్ఘకాలం భారత క్రికెట్ లో కొనసాగిన ఈ బెంగాల్ క్రికెటర్.. బుధవారం అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. 

2003లో ఇంగ్లాండ్ పర్యటన ద్వారా భారత జట్టులోకి ప్రవేశించిన రుమేలి.. టీమిండియా తరఫున 4 టెస్టులు, 78 వన్డేలు, 18 టీ20 లు ఆడింది.  ఆల్ రౌండర్ గా సేవలందించిన రుమేలి.. టెస్టులలో 29.50 సగటుతో 236 పరుగులు చేసి 8 వికెట్లు తీసింది. వన్డేలలో 19 సగటుతో 961 పరుగులు చేయడమే గాక బౌలింగ్ లో 63 వికెట్లు పడగొట్టింది. ఇక టీ20లలో 131 పరుగులు చేసిన ఆమె.. 13 వికెట్లు తీసుకుంది. 

బెంగాల్ నుంచి టీమిండియా స్టార్ పేసర్ జులన్ గోస్వామి తర్వాత భారత క్రికెట్ లోకి అడుగిడిన రెండో క్రికెటర్ గా రుమేలి ఘనత సాధించింది. ఇక 2008లో మిథాలీ గైర్హాజరీలో ఆమె.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు సారథిగా వ్యవహరించింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rumeli Dhar (@rumelidhar54)

తన రిటైర్మెంట్ గురించి  రుమేలి ఇన్స్టాగ్రామ్ లో స్పందిస్తూ.. ‘బెంగాల్ లోని శ్యామ్ నగర్ నుంచి ప్రారంభమై 23 ఏండ్ల పాటు సాగి నా క్రికెట్ ప్రస్థానం చివరికి ముగింపునకు చేరింది. నేను అన్ని  ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాను. ఈ  సుదీర్ఘ ప్రయాణంలో నేను చాలా ఎత్తుపల్లాలు చూశాను. నా కెరీర్ లో నేను చూసిన అత్యంత ఎత్తు భారత మహిళా క్రికెట్ జట్టుకు ప్రాతనిథ్యం వహించడమే. అంతేగాక 2005 వరల్డ్ కప్ ఫైనల్ లో ఆడటం. నా కెరీర్ లో  చాలాసార్లు గాయలైనప్పటికీ చాలా  స్ట్రాంగ్ గా తిరిగొచ్చా. ఈ నా ప్రయాణంలో భాగమైన తోటి ఆటగాళ్లకు, బీసీసీఐకి, నా స్నేహితులకు, అభిమానులకు కృతజ్ఞతలు..’ అని రాసుకొచ్చింది. దేశవాళీలో తనకు ఆడటానికి అవకాశమిచ్చిన రాజస్తాన్, బెంగాల్, రైల్వేస్, ఎయిరిండియా, ఢిల్లీ, అసోంలకు  రుమేలి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. 

బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేయగల రుమేలి..  2011 లో వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఆడిన టీ20 మ్యాచ్ లో ఓపెనింగ్ బౌలర్ గా బౌలింగ్ చేయడమే గాక ఓపెనర్ గా ఇన్నింగ్స్ ను కూడా ప్రారంభించింది. ఇక చాలాకాలం పాటు జులన్ గోస్వామి-రుమేలి ధర్ లు భారత జట్టుకు ఓపెనింగ్ బౌలింగ్ జోడీగా సేవలందించారు. 2008 ఆసియా కప్ లో రుమేలి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికైంది. 

click me!