మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ కారుకి యాక్సిడెంట్... ఐసీయూలో ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్...

By Chinthakindhi RamuFirst Published Dec 14, 2022, 10:09 AM IST
Highlights

బీబీసీ ‘టాప్ గేర్’ టెస్టు షూట్‌లో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌కి ప్రమాదం... హుటాహుటీన ఆసుపత్రికి తరలింపు... 

ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న ఆండ్రూ ఫ్లింటాఫ్... బీబీసీ కార్యక్రమం ‘టాప్ గేర్’ కోసం షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. సుర్రేలోని డన్స్‌ఫోల్డ్ పార్క్ ఏరియాలో షూటింగ్ చేస్తున్న సమయంలో ఆండ్రూ ఫ్లింటాఫ్ నడుపుతున్న కారు... ప్రమాదానికి గురైంది...

ఈ ప్రమాదంలో ఆండ్రూ ఫ్లింటాఫ్ తీవ్రంగా గాయపడినట్టు, అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించినట్టు బీసీసీఐ ప్రకటన ద్వారా తెలియచేసింది. ‘ఫెడ్డీ (ఫ్లింటాఫ్) టాప్ గేర్ టెస్ట్ ట్రాక్‌లో ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే షూటింగ్‌లో ఉన్న డాక్టర్లు, అతనికి చికిత్స అందించారు. ట్రీట్‌మెంట్ కోసం అతన్ని ఆసుపత్రికి తరలించాం... పూర్తి వివరాలను త్వరలో తెలియచేసింది. ఫ్లింటాఫ్‌కి అయిన గాయాలు మరీ ప్రమాదకరమైనవేమీ కావు...’ అంటూ స్టేట్‌మెంట్ విడుదల చేసింది బీబీసీ...

ఇంగ్లాండ్ తరుపున 79 టెస్టులు, 141 వన్డేలు, 7 టీ20 మ్యాచులు ఆడిన ఆండ్రూ ఫ్లింటాఫ్... అన్ని ఫార్మాట్లలో కలిపి 7315 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్‌లో 400 వరకూ వికెట్లు పడగొట్టాడు. కొన్ని మ్యాచుల్లో ఇంగ్లాండ్‌కి కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన ఆండ్రూ ఫ్లింటాఫ్.. గాయాలతో సుదీర్ఘ కెరీర్‌ని కొనసాగించలేకపోయాడు..

తన ఆట కంటే ఎక్కువగా క్రీజులో దూకుడు, అగ్రెసివ్ యాటిట్యూడ్‌తో ఎక్కువగా వార్తల్లో నిలిచాడు ఆండ్రూ ఫ్లింటాఫ్. కోల్‌కత్తాలో ఈడెన్ గార్డెన్‌లో వన్డే మ్యాచ్ టై చేసుకున్న తర్వాత ఆండ్రూ ఫ్లింటాఫ్... షర్టు విప్పి సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి రివెంజ్‌గానే లార్డ్స్‌లో వన్డే మ్యాచ్ గెలిచిన తర్వాత అప్పటి భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ, లార్డ్స్ బాల్కనీలో షర్డు విప్పి సెలబ్రేట్ చేసుకున్నాడు.

2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పై ఆరుకి ఆరు సిక్సర్లు బాది, 12 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకుని రికార్డు క్రియేట్ చేశాడు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. యువీ ఈ రేంజ్‌లో చితక్కొట్టడానికి కూడా ఆండ్రూ ఫ్లింటాఫే కారణం. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌కి రావడానికి ముందు యువీతో ఏదో అంటూ ట్రోల్ చేశాడు ఆండ్రూ ఫ్లింటాఫ్...

ఆ తర్వాతి ఓవర్‌లో యువరాజ్ సింగ్ రెచ్చిపోయి ఆరుకి ఆరు సిక్సర్లు బాదాడు. క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత కామెంటేటర్‌గా మారిన ఆండ్రూ ఫ్లింటాఫ్.. రేడియో ప్రెసెంటర్‌గా, టీవీ ప్రెసెంటర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.  1998లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన ఆండ్రూ ఫ్లింటాఫ్, 2009లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. 2005లో ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆండ్రూ ఫ్లింటాఫ్, 2009 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడాడు.. 

click me!