అవి టెస్టులా.. టీ20లా..? బాదుడే బాదుడు.. మరో ఐదారు ఓవర్లుంటే కరాచీ టెస్టు మూడో రోజే ముగిసేదేమో..

By Srinivas MFirst Published Dec 19, 2022, 6:53 PM IST
Highlights

PAKvsENG: 167 పరుగుల లక్ష్య  ఛేదనలో ఇంగ్లాండ్ దూకుడునే నమ్ముకుంది.  ఓపెనర్ జాక్ క్రాలే, బెన్ డకెట్ లు ఆడుతున్నది టెస్టులా లేక టీ20లా అన్నట్టుగా ఆడారు. ‘బజ్‌బాల్’ అంటూ తమ క్రికెట్ ను కొత్త పుంతలు తొక్కిస్తున్న ఇంగ్లాండ్ ఆ దిశగా మరో విజయం అందుకోవడానికి సిద్ధంగా ఉంది.

‘బజ్‌బాల్’ అంటూ తమ క్రికెట్ ను కొత్త పుంతలు తొక్కిస్తున్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు  ఆ దిశగా మరో విజయం అందుకోవడానికి సిద్ధంగా ఉంది.  17 ఏండ్ల తర్వాత  పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్.. 22 ఏండ్ల తర్వాత  పాకిస్తాన్ లో సిరీస్ నెగ్గిన విషయం తెలిసిందే. ఇప్పుడు కరాచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో కూడా పాకిస్తాన్ పరాజయం ఖాయమైంది.  కరాచీ టెస్టు విజయానికి ఇంగ్లాండ్ 55 పరుగుల దూరంలో ఉంది.  రెండో ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ నిర్దేశించిన  167 పరుగుల లక్ష్యాన్ని  ఛేదించే క్రమంలో  ఇంగ్లాండ్ 17 ఓవర్లలోనే  2 వికెట్ల నష్టానికి 112 పరుగుల చేసింది.  మూడో రోజు మరో ఏడెనిమిది ఓవర్లు ఉండుంటే గనక  ఇంగ్లాండ్ విజయం మూడో రోజే  ఖాయమయ్యేది. 

167 పరుగుల లక్ష్య  ఛేదనలో ఇంగ్లాండ్ దూకుడునే నమ్ముకుంది.  ఓపెనర్ జాక్ క్రాలే, బెన్ డకెట్ లు ఆడుతున్నది టెస్టులా లేక టీ20లా అన్నట్టుగా ఆడారు.  క్రాలే.. 41 బంతుల్లో  7 ఫోర్ల సాయంతో 41 పరుగులు చేయగా  బెన్ డకెట్  38 బంతుల్లోనే 50 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.  ఇందులో 8 ఫోర్లున్నాయి.

ఈ ఇద్దరూ తొలి వికెట్ కు 11.3 ఓవర్లలోనే  87 పరుగులు జోడించారు.  అబ్రర్ అహ్మద్ ఇంగ్లాండ్ దూకుడుకు అడ్డుకట్ట వేశాడు.  11.3 ఓవర్లో  జాక్ క్రాలేను ఔట్ చేసిన అబ్రర్.. తర్వాత  నైట్ వాచ్ మెన్ గా వచ్చిన రెహాన్ అహ్మద్ ను కూడా పెవిలియన్ కు పంపాడు.  అయితే  బెన్ డకెట్ తో కలిసి బెన్ స్టోక్స్ (10 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు.  మూడో రోజు ఆట ముగిసేసమయానికి ఇంగ్లాండ్.. 17 ఓవర్లలోనే 112 పరుగులు (రన్ రేట్ 6.59 గా ఉంది)  చేసింది. 

ఇక ఈ టెస్టులో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 304 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ 354 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది.  మూడో రోజు ఉదయం కూడా  పాకిస్తాన్ బాగానే  ఆడింది.  

ఓపెనర్లిద్దరూ తొలి వికెట్ కు 53 పరుగులు జోడించారు. షఫీక్ (26), షాన్ మసూద్ (24) లు నిష్క్రమించిన తర్వాత తన కెరీర్ లో చివరి టెస్టు ఆడుతున్న అజర్ అలీ (0) డకౌట్ అయ్యాడు.  ఈ మూడు వికెట్లూ జాక్ లీచ్ కే దక్కాయి. కెప్టెన్ బాబర్ ఆజమ్ (54), సౌద్ షకీల్ (53) లు కాసేపు పోరాడారు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 110 పరుగులు జోడించారు. కానీ  రెహన్ అహ్మద్ ఈ జోడీని విడదీశాడు.  పాక్ ఇన్నింగ్స్ 52 ఓవర్ చివరి బంతికి  అతడు బాబర్  ను పెవిలియన్ కు పంపాడు.   ఆ తర్వాత కొద్దిసేపటికే  షకీల్ ను కూడా ఔట్ చేశాడు.  అదే ఊపులో రిజ్వాన్ (7), అగా సల్మాన్ (21) లను   వెనక్కి పంపాడు.   ఆ తర్వాత పాకిస్తాన్  లోయరార్డర్  కూడా  క్రీజులో నిలువలేకపోయింది. ఫలితంగా పాక్.. 74.5 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌట్ అయింది. 

17 ఏండ్ల కుర్రాడు రెహన్ అహ్మద్ ఐదు వికెట్లతో చెలరేగగా  జాక్ లీచ్ కు  మూడు వికెట్లు దక్కాయి. మార్క్ వుడ్, జో రూట్ లకు తలా వికెట్ దక్కింది. రావల్పిండి,  ముల్తాన్ లలో  గెలిచి  సిరీస్ ను ఇప్పటికే 2-0తో దక్కించుకున్న ఇంగ్లాండ్  కరాచీలో కూడా విజయానికి  అత్యంత చేరువలో ఉంది. ఈ టెస్టులో ఓడితే పాకిస్తాన్  పై విజయం పరిపూర్ణం అవుతుంది.  

click me!