వార్నర్...నువ్వు ఛాంపియన్ అన్న విషయాన్ని మరిచిపోకు: ఆసిస్ కోచ్

By Arun Kumar PFirst Published Sep 16, 2019, 9:34 PM IST
Highlights

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్  యాషెస్ సీరిస్ లో ఘోరంగా  విఫలమయ్యాడు. దీంతో అభిమానులు అతడిపై విమర్శల వర్షం కురిపిస్తున్న వేళ ఆసిస్ హెడ్ కోచ్ లాంగర్ అతడిని వెనకేసుకొచ్చాడు. 

యాషెస్ సీరిస్ లో ఘోరంగా విఫలమైన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడిపై ఆసిస్ మాజీలతో పాటు అభిమానులు విరుచుకుపడుతున్నారు. యాషెస్ సీరిస్ మొత్తంలో కేవలం 95 పరుగులు మాత్రమే చేసిన అతన్నే ఆసిస్ ఓటములకు బాద్యున్ని చేస్తున్నారు. అతడి వల్లే యాషెస్ సీరిస్ దక్కకుండా పోయిందంటూ అందరూ విమర్శిస్తున్న వేళ ఆసిస్ చీఫ్ కోచ్ జస్టిన్‌ లాంగర్‌ మాత్రం వార్నర్ ను వెనకేసుకొచ్చాడు. 
  
''డేవిడ్ వార్నర్ ఈ యాషెస్ సీరిస్ లో రాణించకపోవచ్చు. కానీ అతడు ఆసిస్ కు ఎన్నో అద్భుత విజయాలను అందించాడన్న విషయాన్ని మరిచిపోవద్దు. అతడు ఒకటి రెండు మ్యాచుల్లో  చెత్త ప్రదర్శన చేయవచ్చు.  కానీ తిరిగి పామ్ ను అందుకుని అద్భుతాలు సృష్టించగల సత్తా అతడి సొంతం. కాబట్టి ప్రస్తుతం ఎదుర్కొంటున్న విమర్శలను చూసి బాధపడవద్దు. నువ్వు(వార్నర్) ఛాంపియన్ అన్న విషయాన్ని మరిచిపోకు. ఈ గడ్డుకాలం నుండి బయటపడి  మళ్లీ ఫామ్ ను అందుకోవాలని కోరుకుంటున్నాను. 

యాషెస్ సీరిస్ ను ఓ  పీడకలలా మరిచిపో. నీపై వస్తున్న విమర్శలపై స్పందించాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియా క్రికెట్ టీం నీనుండి ఇంకెంతో ఆశిస్తోంది. కాబట్టి జట్టు ప్రయోజనాల కోసం మరింత  మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నించు. '' అంటూ వార్నర్ ను లాంగర్ వెనకేసుకొచ్చాడు. 

బాల్  ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఏడాదిపాటు వార్నర్, స్మిత్ లు అంతర్జాతీయ క్రికెట్ కు దూరమయ్యారు. అయితే ఇటీవలే ప్రపంచ కప్ ద్వారా మళ్లీ క్రికెట్లోకి అడుగుపెట్టిన వారిద్దరు యాషెస్ సీరిస్ కూడా ఎంపికయ్యారు. ఇంగ్లాండ్ వేదికన జరిగిన ఈ సీరిస్ లో స్మిత్ వరుస సెంచరీలతో అదరగొట్టగా వార్నర్ మాత్రం చెత్త ఆటతీరుతో విమర్శలను ఎదుర్కొంటున్నాడు. పేలవ ఫామ్‌తో ఆసీస్‌ అభిమానులను వార్నర్ తీవ్రంగా నిరాశపరిచాడు. 


 

click me!