
ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియాకి ఊహించని షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డేవిడ్ వార్నర్ గాయపడిన విషయం తెలిసిందే. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఓ బౌన్సర్, డేవిడ్ వార్నర్ మోచేతికి బలంగా తాకింది...
ఫిజియో పర్యవేక్షణ తర్వాత తిరిగి ఆటను కొనసాగించిన డేవిడ్ వార్నర్, బౌన్సర్లను ఎదుర్కోవడానికి బాగా ఇబ్బందిపడ్డాడు. 44 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసి అవుటైన డేవిడ్ వార్నర్.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి రావడం అనుమానంగా మారింది...
డేవిడ్ వార్నర్ గాయానికి స్కానింగ్ నిర్వహించిన వైద్యులు, విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో అతను రెండో టెస్టు నుంచి దాదాపు తప్పుకున్నట్టే. డేవిడ్ వార్నర్ స్థానంలో మ్యాట్ రెంషాని కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా టీమ్‌లోకి తీసుకొచ్చింది క్రికెట్ ఆస్ట్రేలియా...
ఓపెనర్ స్థానంలో మరో ఓపెనర్‌ని మాత్రమే కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఆడించడానికి అవకాశం ఉంటుంది. ఆసీస్ టీమ్‌లో ఓపెనర్లు అందుబాటులో లేకపోవడంతో ఆల్‌రౌండర్ మ్యాట్ రెంషాని టీమ్‌లోకి తీసుకున్నారు. అయితే రెంషోతో బౌలింగ్ వేయించడానికి వీలు లేదని రిఫరీ, క్రికెట్ ఆస్ట్రేలియాకి స్పష్టం చేశాడు..
‘వార్నర్, స్పోర్ట్స్ ప్రోటోకాల్ ప్రకారం కోలుకుని, ఇండోర్‌లో జరిగే మూడో టెస్టుకి సిద్ధమవుతాడు...’ అంటూ అధికారిక ప్రకటన విడుదల చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా..
నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 1 పరుగు చేసి మహ్మద్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన డేవిడ్ వార్నర్, రెండో ఇన్నింగ్స్‌లో 41 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు..
నాగ్‌పూర్ టెస్టులో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసిన మ్యాట్ రెంషా... తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా బౌలింగ్‌లో మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 7 బంతుల్లో 2 పరుగులు చేసి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు..
నాగ్‌పూర్ టెస్టులో ఓ ఓవర్ బౌలింగ్ చేసి 7 పరుగులు ఇచ్చాడు. తొలి టెస్టు సమయానికి ట్రావిస్ హెడ్ ఫిట్‌గా లేకపోవడంతో మ్యాట్ రెంషాకి అవకాశం దక్కింది. రెండో టెస్టులో ట్రావిస్ హెడ్ తుదిజట్టులోకి రావడంతో రెంషా, రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఓపెనర్‌గా రాణించిన మ్యాట్ రెంషాపై భారీ ఆశలే పెట్టుకుంది క్రికెట్ ఆస్ట్రేలియా.
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 263 పరుగులకి ఆలౌట్ అయ్యింది. నాగ్‌పూర్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 200+ అందుకోలేకపోయింది ఆసీస్. తొలి టెస్టులో ఆసీస్ బ్యాటర్లు ఎవ్వరూ హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయారు. అయితే రెండో టెస్టులో ఆసీస్ 250+ స్కోరు చేయడమే కాకుండా ఇద్దరు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు అందుకున్నారు...
రెండో రోజు ఆటలో టీమిండియా చేసే స్కోరు బట్టి, మ్యాచ్ రిజల్ట్ ఆధారపడి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టుకి 120-150+ పరుగుల ఆధిక్యం దక్కితే ఆస్ట్రేలియా కమ్‌బ్యాక్ ఇవ్వడం కష్టమే అవుతుంది. ఒకవేళ ఆసీస్, భారత జట్టును స్వల్ప స్కోరుకే ఆలౌట్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం దక్కించుకుంటే మాత్రం సీన్ రివర్స్ అవుతుంది..