వార్నర్ భాయ్ విధ్వంసం.. రెండో టీ20 ఆసీస్‌దే.. చిత్తుగా ఓడిన వెస్టిండీస్

Published : Oct 07, 2022, 06:01 PM IST
వార్నర్ భాయ్ విధ్వంసం.. రెండో టీ20 ఆసీస్‌దే.. చిత్తుగా ఓడిన వెస్టిండీస్

సారాంశం

AUS vs WI T20I: ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య ముగిసిన రెండో టీ20లో కంగారూలనే విజయం వరించింది. టీ20 ప్రపంచకప్ కు ముందు సన్నాహకంగా భావించిన ఇరు జట్లకు మంచి  మ్యాచ్ ప్రాక్టీస్ లభించింది. 

టీ20  ప్రపంచకప్ కు ముందు ఆస్ట్రేలియా స్వదేశంలో  మరో సిరీస్ ను  సొంతం చేసుకుంది. వెస్టిండీస్ తో రెండు టీ20ల  సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో వెస్టిండీస్.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులకే పరిమితమైంది.  డేవిడ్ వార్నర్ (41 బంతుల్లో 75, 10 ఫోర్లు, 3 సిక్సర్లు)  హాఫ్ సెంచరీతో రాణించగా బౌలింగ్ లో మిచెల్ స్టార్క్ నాలుగు వికెట్లతో చెలరేగి విండీస్ ను దెబ్బతీశాడు. 

టాస్ గెలిచిన  విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. విధ్వంసకర బ్యాటర్ కామోరూన్ గ్రీన్ (1) వికెట్ తో పాటు ఫించ్ (15), స్టీవ్ స్మిత్ (17), మ్యాక్స్‌వెల్ (1) విఫలమయ్యారు. 

టాపార్డర్ బ్యాటర్లు విఫలమైనా డేవిడ్ వార్నర్ మాత్రం దూకుడుగా ఆడి  ఆసీస్ స్కోరును పెంచాడు. రన్  రేట్ పడిపోకుండా  ధాటిగా ఆడాడు. అయితే 11.1 ఓవర్లో వార్నర్ ను ఒడియన్ స్మిత్ పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత వచ్చిన టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 42, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) తనదైన శైలిలో రెచ్చిపోయాడు.  

179 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ ఆదినుంచి ఎదురీదుతూనే వచ్చింది. ఆసీస్ పేసర్లు  మిచెల్ స్టార్క్, గ్రీన్, కమిన్స్ లు విండీస్ ను కోలుకోనీయలేదు. ఓపెనర్ కైల్ మేయర్స్  (6) ను స్టార్క్ ఔట్ చేయగా.. చార్లెస్ (29) ను గ్రీన్ పెవిలియన్ కు పంపాడు. బ్రాండన్ కింగ్ (23, 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడినా స్పిన్నర్ జంపా బౌలింగ్ లో వికెట్ కీపర్  మాథ్యూ వేడ్ కు క్యాచ్ ఇచ్చాడు. విండీస్ సారథి  పూరన్ (2) మరసారి విఫలమయ్యాడు.  జేసన్ హోల్డర్ (16), రొవ్మన్ పావెల్ (18), అకీల్ హోసెన్ (25), ఒడియన్ స్మిత్ (4) లు కూడా మెరుపులు మెరిపించలేకపోయారు. 

 

స్టార్క్ కు నాలుగు వికెట్లు దక్కగా కమిన్స్ కు 2, గ్రీన్, జంపాకు చెరె వికెట్ దక్కింది. తొలి మ్యాచ్ లో కూడా ఆసీస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫలితంగా ఆసీస్.. 2-0తో సిరీస్ ను కైవసం చేసుకుని ప్రపంచకప్  వేటను సిరీస్ విజయంతో ప్రారంభించనుంది. 

 

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు