
వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత మహిళా జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. 261 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన భారత మహిళా జట్టుకి శుభారంభం దక్కలేదు. ‘ఛేజ్ మాస్టర్’ స్మృతి మంధాన 21 బంతుల్లో 6 పరుగులు చేసి అవుట్ కాగా, దీప్తి శర్మ 13 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసి పెవిలియన్ చేరింది...
ఓపెనర్‌గా వచ్చిన యషికా భాటియా 59 బంతుల్లో 2 ఫోర్లతో 28 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి గురి కావడంతో 24 ఓవర్లు ముగిసే సరికే ఐదు మెయిడిన్లు వచ్చాయి. కెప్టెన్ మిథాలీ రాజ్ తన స్టైల్‌లో నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించడానికే ప్రాధాన్యం ఇస్తుంటే, ఆమెకు తోడుగా వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ క్రీజులో ఉంది. 25 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది టీమిండియా. భారత జట్టు విజయం సాధించాలంటే 25 ఓవర్లలో 186 పరుగులు సాధించాల్సి ఉంటుంది.
అంతకుముందు టాస్ గెలిచి, ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది భారత జట్టు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగుల భారీ స్కోరు చేసింది...
సూజీ బేట్స్ 5 పరుగులు చేసి రనౌట్ కాగా, కెప్టెన్ సోఫీ డివైన్ 30 బంతుల్లో 7 ఫోర్లతో 35 పరుగులు, అమిలియా కేర్ 64 బంతుల్లో 5 ఫోర్లతో 50 పరుగులు చేశారు. అమీ సథర్త్‌వైట్ 84 బంతుల్లో 9 ఫోర్లతో 75 పరుగులు చేయగా మ్యాడీ గ్రీన్ 36 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు చేసింది...
51 బంతుల్లో 3 ఫోర్లతో 41 పరుగులు చేసిన వికెట్ కీపర్ కేటీ మార్టిన్‌ను జులన్ గోస్వామీ బౌల్డ్ చేయగా హేలీ జాన్సన్ 7 బంతుల్లో 1 పరుగు చేసి రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరింది.
ఒకానొక దశలో 42 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసిన న్యూజిలాండ్, భారత జట్టు ముందు భారీ లక్ష్యాన్ని పెట్టేలా కనిపించింది. అయితే భారత బౌలర్ పూజా వస్తాకర్ సంచలన స్పెల్‌తో కివీస్ బ్యాటర్లను కట్టడి చేసింది...
కెప్టెన్ సోఫీ డివైన్, 75 పరుగులు చేసి అమీ సథర్త్‌వైట్‌లను అవుట్ చేసిన పూజా వస్తాకర్, ఒకే ఓవర్‌లో వరుస బంతుల్లో లీ టహుహు, జెస్ కేర్‌లను అవుట్ చేసింది. ఫ్రాన్సెస్ మాకీ 13 పరుగులు, హన్నా రో 2 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
భారత బౌలర్లలో పూజా వస్తాకర్ 10 ఓవర్లలో 34 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా రాజేశ్వరి గైక్వాడ్ 10 ఓవర్లలో 4 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. జులన్ గోస్వామి 9 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 41 పరుగులిచ్చి ఓ వికెట్ తీసింది. దీప్తి శర్మకు ఓ వికెట్ దక్కింది.