మిథాలీ కెప్టెన్ ఇన్నింగ్స్, హర్మన్‌ప్రీత్ మెరుపులు... కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ముందు...

Published : Mar 19, 2022, 09:54 AM IST
మిథాలీ కెప్టెన్ ఇన్నింగ్స్, హర్మన్‌ప్రీత్ మెరుపులు... కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ముందు...

సారాంశం

India Women vs Australia Women: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన కెప్టెన్ మిథాలీ రాజ్... యస్తికా భాటికాతో కలిసి శతాధిక భాగస్వామ్యం... ఆఖర్లో హర్మన్‌ప్రీత్ కౌర్ మెరుపు హాఫ్ సెంచరీ... 

వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు... నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 277 పరుగుల స్కోరు చేయగలిగింది. వరల్డ్ కప్‌లో మరోసారి టీమిండియాకి శుభారంభం దక్కలేదు. 11 బంతుల్లో ఓ ఫోర్2తో 10 పరుగులు చేసిన స్మృతి మంధాన, డార్సీ బ్రౌన్ బౌలింగ్‌లో మెగ్ లానింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది...

11 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు. వుమెన్స్ వరల్డ్‌కప్ 2022 టోర్నీలో తొలిసారి తుదిజట్టులో చోటు దక్కించుకున్న యంగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ 16 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్2తో 12 పరుగులు చేసి డార్సీ బ్రౌన్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరింది. దీంతో 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది టీమిండియా...


ఈ దశలో కెప్టెన్ మిథాలీ రాజ్, యస్తికా భాటియా కలిసి మూడో వికెట్‌కి 130 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి, భారత జట్టును ఆదుకున్నారు. వన్డే వరల్డ్ కప్‌ టోర్నీ చరిత్రలో భారత జట్టుకి మూడో వికెట్‌కి ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. 83 బంతుల్లో 6 ఫోర్లతో 59 పరుగులు చేసిన యస్తికా భాటియా కూడా డార్సీ బ్రౌన్ బౌలింగ్‌లోనే భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యింది...

కెప్టెన్ మిథాలీ రాజ్ 96 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 68 పరుగులు చేసింది. మిథాలీ రాజ్‌‌కి వన్డే కెరీర్‌లో ఇది 63వ హాఫ్ సెంచరీ కాగా వన్డే వరల్డ్ కప్‌లో 12వ, ఆస్ట్రేలియాపై 9వ హాఫ్ సెంచరీ. వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా న్యూజిలాండ్‌ క్రికెటర్ డెబ్బీ హాక్లీ రికార్డును సమం చేసింది మిథాలీ రాజ్.

మిథాలీ రాజ్ అవుటైన తర్వాత రిచా ఘోష్ 14 బంతుల్లో 8 పరుగులు, స్నేహ్ రాణా 5 బంతులాడి డకౌట్ కావడంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఆ తర్వాత పూజా వస్త్రాకర్, హర్మన్‌ప్రీత్ కౌర్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 

అలానా కింగ్ వేసిన ఇన్నింగ్స్ 46వ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 17 పరుగులు రాబట్టిన ఈ ఇద్దరూ అదే జోరును కొనసాగించారు. 42 బంతుల్లో 6 ఫోర్లతో వన్డే వరల్డ్ కప్‌ టోర్నీలో మూడో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది హర్మన్‌ప్రీత్ కౌర్. ఓవరాల్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్‌కి ఇది కెరీర్‌లో 15వ వన్డే హాఫ్ సెంచరీ.   

మేగన్ స్కాట్ బౌలింగ్‌లో 81 మీటర్ల భారీ సిక్సర్ బాదిన పూజా వస్త్రాకర్, వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీలో అతి పెద్ద సిక్సర్ నమోదు చేసింది. 28 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 34 పరుగులు చేసి, హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి ఏడో వికెట్‌కి 47 బంతుల్లో 64 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన పూజా వస్త్రాకర్, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రనౌట్ అయ్యింది...

47 బంతుల్లో 6 ఫోర్లతో 57 పరుగులు చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ నాటౌట్‌గా నిలిచింది. ఎక్స్‌ట్రాల రూపంలో ఆస్ట్రేలియా జట్టు బౌలర్లు 29 పరుగులు అదనంగా ఇవ్వడం విశేషం. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?