
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్ లో అపజయమెరుగని జట్టుగా దూసుకుపోతున్న ఆస్ట్రేలియా.. సెమీఫైనల్లో వెస్టిండీస్ ను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది. టాస్ ఓడినా మ్యాచులో ఆద్యంతం ఆధిపత్యం చెలాయిస్తూ ఏడో వన్డే ప్రపంచకప్ సాధించే దిశలో మరో ముందడుగు వేసింది. తొలుత బ్యాటింగ్ లో విజృంభించి తర్వాత బంతితో వెస్టిండీస్ పని పట్టింది. వర్షం కారణంగా 45 ఓవర్లకే కుదించిన మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 45 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. అనంతరం 306 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ ను 37 ఓవర్లలో 148 పరుగులకే పరిమితం చేసింది. ఫలితంగా 157 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచులో సెంచరీతో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెస్స హీలి (107 బంతుల్లో 129) కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
టాస్ గెలిచిన విండీస్ ఆహ్వానం మేరకు ఆసీస్ తొలుత బ్యాటింగ్ కు వచ్చింది. అంతగా పసలేని విండీస్ బౌలింగ్ ఓపెనర్లు (85), హీలి సమర్థవంతంగా ఎదుర్కున్నారు. వీరిద్దరూ తొలి వికెట్ కు ఏకంగా 216 పరుగులు జోడించడం విశేషం. హేన్స్ తో పోల్చితే ధాటిగా ఆడిన హీలి.. 107 బంతుల్లోనే 17 బౌండరీలు, ఒక సిక్సర్ సాయంతో 129 పరుగులు చేసింది.
32వ ఓవర్లో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. హీలి స్థానంలో వచ్చిన గార్డ్నర్ (12) పెద్దగా రాణించకపోయినా కెప్టెన్ లానింగ్ (26 నాటౌట్), మూనీ (43 నాటౌట్) లు కలిసి ఆఖర్లో ఆసీస్ స్కోరును 300 దాటించారు.
ఇక భారీ లక్ష్య ఛేదనలో విండీస్ కు శుభారంభం దక్కలేదు. ఆ జట్టు ఓపెనర్ రషద విలియమ్స్ (0) డకౌట్ అయింది. కానీ డాటిన్ (34), మాథ్యూస్ (34) లు పట్టుదలగా ఆడారు. మాథ్యూస్ కాస్త నిదానంగా ఆడినా డాటిన్ మాత్రం ధాటిగా ఆడింది. అయితే ఆమెను తహిల మెక్ గ్రాత్ ఔట్ చేసింది. ఆమె స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ టేలర్ (48) మాథ్యూస్ తో కలిసి కాసేపు ప్రతిఘటించింది. అయితే మాథ్యూస్ ను జొనాసేన్ పెవిలియన్ కు పంపింది. 22 వ ఓవర్లో విండీస్.. 91 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఇక అప్పట్నంచి విండీస్ వికెట్ల పతనం వేగంగా సాగింది. ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన క్యాంప్బెల్ (8) సహా మిగిలిన మ్యాటర్లంతా సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు. 117-4 గా ఉన్న విండీస్ స్కోరు.. 148 కే ఆలౌటైంది. విండీస్ లో హెన్రీ, మహ్మద్ లు గాయాలతో బ్యాటింగ్ కు రాలేదు. ఆసీస్ బౌలర్లు సమిష్టిగా రాణించారు.
ఇదిలాఉండగా.. మార్చి 31న ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య జరిగే రెండో సెమీస్ లో విజేతతో ఆస్ట్రేలియా ఫైనల్ లో తలపడుతుంది. ఏప్రిల్ 03న క్రిస్ట్ చర్చ్ లో ఫైనల్ జరుగనుంది.