
న్యూఢిల్లీ: విధ్వంసకర బ్యాటింగ్‌కు కేరాఫ్‌గా నిలిచే వెస్టిండీస్ బ్యాట్‌మెన్ క్రిస్ గేల్ మరోసారి తన బ్యాట్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాడు. ఈ సారి స్కోరింగ్ కాకుండా మరో కారణంతో అహో అనిపించాడు. ఓ బంతిని బలంగా స్టేడియం బయటకు బాదబోయాడు. కానీ, తన చేతిలోని బ్యాటే విరిగిపోయింది. కేవలం హ్యాండిల్ మాత్రమే చేతిలో మిగిలి ఉండగా, మేజర్ పార్ట్ విరిగి క్రీజులో పడింది. సీపీఎల్ టీ20 మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వెస్టిండీస్ క్రికెట్ కరీబియన్ దేశాల్లో కరీబియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజా సీపీఎల్ టీ20లో ఓ ఘటన నెటిజన్లను ఆకర్షించింది. సెయింట్ కీట్స్ పేట్రియట్స్, గయానా అమేజాన్ వారియర్స్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా ఓపెనింగ్ దిగిన క్రిస్ గేల్ తన వీరప్రతాపం చూపించడం ప్రారంభించాడు. గయానా అమేజాన్ వారియర్స్ 179 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. సెయింట్ కీట్స్ పేట్రియట్స్ టీమ్‌ను గెలిపించడానికి క్రీజులో దిగిన క్రిస్ గేల్ ప్రత్యర్థి జట్టు నుంచి ఓడియన్ స్మిత్ వేసిన నాలుగో ఓవర్‌లో బంతిని ఆఫ్‌సైడ్ బాదడానికి ప్రయత్నించాడు. కానీ, స్మిత్ వేసిన బంతి వేగంగా తగలడంతో గేల్ బ్యాట్ రెండు ముక్కలైంది. కేవలం హ్యాండిల్ మాత్రమే చేతిలో ఉండిపోయింది. గేల్ ఒకింత ఆశ్చర్యానికి గురై బ్యాట్‌ను పరిశీలించుకున్నాడు. తర్వాత కొత్త బ్యాట్ అందుకుని బాదడం మొదలెట్టారు. 27 బంతుల్లో 42 రన్స్ సాధించాడు. మూడు వికెట్ల తేడాతో సెయింట్ కీట్స్ టీమ్ విజయం సాధించి సీపీఎల్ టీ20 ఫైనల్‌లో అడుగుపెట్టింది.