అక్కడ వీరూలా రెచ్చిపోతున్న ‘నయా’ వాల్... 73 బంతుల్లోనే సెంచరీ బాదిన ఛతేశ్వర్ పూజారా...

By Chinthakindhi RamuFirst Published Aug 13, 2022, 9:59 AM IST
Highlights

73 బంతుల్లోనే సెంచరీ బాది వీరోచితపోరాటం చేసిన కెప్టెన్ ఛతేశ్వర్ పూజారా... అయినా 4 పరుగుల తేడాతో ఓడిన సుసెక్స్...

ఛతేశ్వర్ పూజారా... ఈ పేరు చెప్పగానే జిడ్డు బ్యాటింగ్‌తో బౌలర్లను విసిగించే టెస్టు బ్యాట్స్‌మెన్‌ గుర్తుకువస్తాడు. పూజారా కొన్ని మ్యాచుల్లో 50 బంతులు ఆడిన తర్వాత సింగిల్ తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే పూజారాని అందరూ ‘నయా వాల్’ అంటారు. అలాంటి ఛతేశ్వర్ పూజారా ఇప్పుడు వీరేంద్ర సెహ్వాగ్‌లా రెచ్చిపోయాడు... డిఫెన్స్‌తో బౌలర్లను విసిగించే పూజారా, వారిపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు...


మూడేళ్లుగా సెంచరీ చేయలేక భారత జట్టులో చోటు కోల్పోయిన ఛతేశ్వర్ పూజారా, కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సుసెక్స్ కౌంటీ క్లబ్ తరుపున అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ 2022లో 8 మ్యాచులు ఆడిన ఛతేశ్వర్ పూజారా 13 ఇన్నింగ్స్‌ల్లో 109.40 సెన్సేషనల్ యావరేజ్‌తో 1094 పరుగులు చేశాడు...

కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పూజారా స్ట్రైయిక్ రేటు 60.11. కౌంటీ 2022 సీజన్‌లో 10 మ్యాచులు ఆడి 19 ఇన్నింగ్స్‌ల్లో 1127 పరుగులు చేసిన సామ్ నార్‌ఈస్ట్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ ఛతేశ్వర్ పూజారానే. సీజన్‌లో 5 సెంచరీలు చేసిన పూజారా, అత్యధిక సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు...

కౌంటీ ఛాంపియన్‌షిప్ తర్వాత రాయల్ లండన్ వన్డే కప్ టోర్నీలోనూ సుసెక్స్ క్లబ్ తరుపున ఆడుతున్నాడు ఛతేశ్వర్ పూజారా. ఈ సీజన్‌లో సుసెక్స్ క్లబ్‌కి ఓ కౌంటీ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఛతేశ్వర్ పూజారా, రాయల్ కప్‌లోనూ సారథిగా వ్యవహరిస్తున్నాడు...

4 2 4 2 6 4

TWENTY-TWO off the 47th over from . 🔥 pic.twitter.com/jbBOKpgiTI

— Sussex Cricket (@SussexCCC)

వార్‌విక్‌షైర్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న ఛతేశ్వర్ పూజారా, సెన్సేషనల్ సెంచరీతో చెలరేగిపోయాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన వార్‌విక్‌షైర్, నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది...

ఓపెనర్ రాబర్ట్ ఏట్స్ 114 పరుగులు చేయగా విల్ రోడ్స్ 76 పరుగులు, మైకెల్ బార్గెస్ 58 పరుగులు చేశాడు. వార్‌విక్‌షైర్ తరుపున ఆడుతున్న భారత ఆటగాడు కృనాల్ పాండ్యా, 2 బంతులాడి డకౌట్ అయ్యాడు. 

311 పరుగుల లక్ష్యఛేదనలో అలెస్టర్ ఓర్ 81 పరుగులు చేయగా కెప్టెన్ ఛతేశ్వర్ పూజారా 79 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 107 పరుగులు చేశాడు. పూజారా స్ట్రైయిక్ రేటు 135.44... అదీకాకుండా సుసెక్స్ టీమ్ తరుపున అత్యధిక స్ట్రైయిక్ రేటు నమోదు చేసిన బ్యాటర్ కూడా పూజారాయే...

పూజారా సెంచరీతో ఒంటరిపోరాటం చేసినా అతనికి మిగిలిన బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించలేదు. వెంటవెంటనే వరుస వికెట్లు కోల్పోయిన సుసెక్స్, 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 306 పరుగులకు పరిమితమైంది. 47వ ఓవర్‌లో 4, 2, 4, 2, 6, 4  బాది 24 పరుగులు రాబట్టాడు పూజారా. అయితే విజయానికి 12 బంతుల్లో 20 పరుగులు కావాల్సిన సమయంలో ఛతేశ్వర్ పూజారా అవుట్ కావడం, సుసెక్స్ క్లబ్‌కి విజయాన్ని దూరం చేసింది...

టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ ఛతేశ్వర్ పూజారాకి లిస్టు ఏ క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. సుసెక్స్ క్లబ్ తరుపున చేసిన సెంచరీ, పూజారా కెరీర్‌లో 12వ లిస్టు ఏ సెంచరీ. మొత్తంగా 107 లిస్టు ఏ మ్యాచులు ఆడిన ఛతేశ్వర్ పూజారా సగటు 55కి పైగా ఉండడం మరో విశేషం... 

click me!