
Champions Trophy 2025 Semi Final Race: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఉత్కంఠగా సాగుతోంది. మరీ ముఖ్యంగా గ్రూప్ బీ లో మ్యాచ్ లు రసవత్తరంగా మారాయి. సెమీస్ రేసు కోసం ఇప్పుడు మూడు జట్లు పోటీ పడుతున్నాయి. బుధవారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఇంగ్లాండ్‌పై గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు గ్రూప్ బీ నుండి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాతో పాటు సెమీఫైనల్ స్థానం కోసం పోటీలో నిలిచింది. భారత్, న్యూజిలాండ్ గ్రూప్ A నుండి సెమీఫైనలిస్టులుగా ఖరారు కాగా, గ్రూప్ Bలో టాప్ లో నిలిచే రెండు జట్ల కోసం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
రెండు జట్లకు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ లాహోర్‌లో ఇంగ్లాండ్‌ను ఎనిమిది పరుగుల తేడాతో ఓడించింది. దీని ఫలితంగా జోస్ బట్లర్ టీమ్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ స్థానం నుండి అధికారికంగా ఔట్ అయింది. అయితే, ఆఫ్ఘనిస్తాన్‌కు ఇంకా సెమీ ఫైనల్ ఫోర్‌కు టిక్కెట్ దొరకలేదు. వారు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాతో కలిసి నాకౌట్స్ కోసం చివరి ప్రయత్నం చేయనున్నారు. వర్షం కారణంగా మంగళవారం జరిగిన మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లు పాయింట్లు పంచుకున్నాయి. అయితే, ఈ మూడు జట్ల సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ఆఫ్ఘనిస్తాన్:
ఇంగ్లాండ్‌పై గెలిచినప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ Bలో మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాల కంటే ఒక పాయింట్ వెనుకబడి ఉంది. హష్మతుల్లా షాహిది నేతృత్వంలోని జట్టు ఆస్ట్రేలియాతో శుక్రవారం లాహోర్‌లో జరగబోయే మ్యాచ్ సెమీస్ డిసైడర్ కానుంది. ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే సెమీఫైనల్స్‌లో స్థానం ఖాయం చేసుకుంటుంది.
ఆస్ట్రేలియా:
ఆస్ట్రేలియా గెలిస్తే సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్‌పై ఒక పాయింట్ ఎక్కువ ఉండటంతో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో వర్షం కారణంగా రద్దయినట్టు జరిగినా స్టీవ్ స్మిత్ టీమ్ ముందుకు వెళ్తుంది.
సౌత్ ఆఫ్రికా:
చివరి గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై గెలిస్తే ప్రోటీస్ ముందుకు సాగుతుంది. సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్‌పై ఓడిపోయినా, ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడిస్తే కూడా ముందుకు వెళ్లవచ్చు. ఒకవేళ ఇంగ్లాండ్ చివరి మ్యాచ్‌లో గెలిచి, ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాను ఓడిస్తే, ప్రోటీస్ ఆసీస్‌తో కలిసి నెట్ రన్ రేటు తో పోటీ పడుతుంది. ఇది వారి చివరి ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.