కోచ్ ఎంపికపై కోహ్లీ ఏమైనా మాట్లాడగలడు...కానీ మేమలా కాదు: అన్షుమన్‌ గైక్వాడ్‌

By Arun Kumar PFirst Published Jul 31, 2019, 6:18 PM IST
Highlights

టీమిండియా కోచ్ ఎంపికపై ప్రక్రియ  కొనసాగుతున్న సమయంలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ తన మద్దతు రవిశాస్త్రికే అంటూ ప్రకటిచడంపై వివాదం చెలరేగుతోంది. అయితే  ఈ వ్యాఖ్యలపై తాజాగా సీఎసి మెంబర్ అన్షుమన్ గైక్వాడ్ స్పందించాడు. 

ప్రపంచ కప్ ఓటమి తర్వాత టీమిండియా కోచింగ్ సిబ్బంది ఎంపిక ప్రక్రియను బిసిసిఐ వేగవంతం చేసింది. వెస్టిండిస్ సీరిస్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో చీఫ్ కోచ్ తో పాటు మిగతా కోచింగ్ సిబ్బంది నియామక ప్రక్రియను పూర్తిచేయాలన్న ఉద్దేశ్యంతో ఈ బాధ్యతను సీఎసి(క్రికెట్ అడ్వైజరీ కమిటీ) కి అప్పగించింది. అయితే ఓ వైపు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుండగానే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుత చీఫ్ కోచ్ రవిశాస్త్రికి మద్దతు ప్రకటించాడు. సెలెక్షన్ ప్రక్రియలో కీలకమైన వ్యక్తే ఇలా బహిరంగంగా మద్దతు ప్రకటించడాన్ని మాజీలు, అభిమానులు తప్పుబడుతున్నారు. 

ఇలా వెస్టిండిస్ పర్యటనకు ముందు కోహ్లీ ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలపై సీఎసీ సభ్యులు  అన్షుమన్ గైక్వాడ్ స్పందించారు. కోహ్లీ మాటలు తమను ఏ విధంగానూ ప్రభావితం  చేయబోవని అతడు స్పష్టం చేశాడు. తాము బిసిసిఐ నిబంధనలకు లోబడి అన్ని అర్హతలు కలిగిన వ్యక్తిని మాత్రమే ఎంపిక చేస్తామన్నారు. టీమిండియా చీఫ్ కోచ్ విషయంలో ఎలాంటి ఒత్తిడి తమపై లేదన్నాడు. మాకు కేవలం బిసిసిఐతోనే సంబంధముందని...జట్టుతో, కెప్టెన్ తో అసలు సంబంధమే లేదని గైక్వాడ్ పేర్కొన్నాడు. 

అయితే తాము సిపార్సు చేసిన వ్యక్తిపై తుది నిర్ణయం  తీసుకునే బాధ్యత మాత్రం బిసిసిఐదే. కాబట్టి ఆ సమయంలో వారు టీమిండియా కెప్టెన్ అభిప్రాయాన్ని కోరవచ్చు. కానీ తమకు మాత్రం కోహ్లీ అభిప్రాయంతో పనేలేదని తెలిపాడు. మహిళా జట్టు కోచ్ ఎంపిక సమయంలోనూ తాము ఎవరినీ సంప్రదించలేదని గైక్వాడ్ వివరించాడు. 

ఇప్పటికే దరఖాస్తు గడువు ముగియడంతో ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నట్లు తెలిపాడు. జట్టులోని ఆటగాళ్లను సమన్వయం చేయడం, వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, ప్రణాళికలు రచిస్తూ జట్టును విజయంవైపు నడిపించే సమర్థుడైన వ్యక్తినే తాము ఎంపిక చేస్తాం. తనతో పాటు కపిల్ దేవ్ కు కోచ్ గా పనిచేసిన అనుభవం వుంది కాబట్టి మా పని మరింత సులభం కానుందని గైక్వాడ్ పేర్కొన్నాడు.

click me!