BCCI: సాహా ఎపిసోడ్ తో మేల్కొన్న బీసీసీఐ.. మీడియా కు కొత్త గైడ్ లైన్స్.. లంకతో సిరీస్ నుంచే అమలు చేసే యోచన..?

Published : Feb 21, 2022, 04:52 PM IST
BCCI: సాహా ఎపిసోడ్ తో మేల్కొన్న బీసీసీఐ.. మీడియా కు కొత్త గైడ్ లైన్స్.. లంకతో సిరీస్ నుంచే అమలు చేసే యోచన..?

సారాంశం

Wriddhiman Saha: సాహా-జర్నలిస్టుల వివాదంతో బీసీసీఐ మేల్కొన్నది. బీసీసీఐతో కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లలో మిగిలిన వారికి ఇలాంటివి జరగకూడదనే ఉద్దేశంతో...  

టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా ను  ఇంటర్వ్యూ కోసం ఓ ‘పేరు మోసిన జర్నలిస్టు’  బెదిరింపులకు పాల్పడటంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆలస్యంగా మేలుకుంది. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా  పటిష్టమైన చర్యలు  చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నది. ఈ మేరకు  మీడియాకు కొత్త నిబంధనలను విధించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.  ఇందుకు సంబంధించి బీసీసీఐ ఇప్పటికే కసరత్తులు కూడా ప్రారంభించింది. 

బీసీసీఐ కొత్త మీడియా గైడ్ లైన్స్ ప్రకారం.. బోర్డు తో కాంట్రాక్ట్ ఉన్న  ఏ ఆటగాడు కూడా  ఇకనుంచి మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి వీళ్లేదు.  ఆటగాళ్ల ఇంటర్యూలు తీసుకోవాలంటే అంతకుముందే సదరు జర్నలిస్టులు బీసీసీఐ  మీడియా మేనేజర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.. 

ఇదే విషయమై బీసీసీఐకి చెందిన ఓ అధికారి  స్పందిస్తూ... ‘సాహా విషయంలో జరిగింది  మరెవరికీ జరుగకూడదు. మేము జర్నలిస్టులపై గౌరవం కలిగిఉన్నాం. వాళ్లు కూడా ఆటగాళ్ల ఇంటర్వ్యూల కోసం   వారి యజమానుల నుంచి ఎలాంటి ఒత్తిడి ఎదుర్కుంటారో మాకు తెలుసు. కానీ ఇలా వ్యవహరించడమనేది కరెక్ట్ కాదు. అందుకే మేం కొత్త మీడియా గైడ్ లైన్స్ తీసుకురాబోతున్నాం..’ అని తెలిపాడు. 

బీసీసీఐ ప్రతిపాదిస్తున్న కొత్త మీడియా గైడ్ లైన్స్: 

-  బీసీసీఐతో కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లతో మీడియా నేరుగా సంప్రదించడానికి వీలులేదు. 
- బీసీసీఐ నియమించిన మీడియా మేనేజర్ ద్వారానే ఆటగాళ్లు-మీడియా మధ్య  సమాచారం బదిలీ కావాలి. 
- అండర్-19 క్రికెటర్లకూ ఇదే వర్తిస్తుంది. 
- ఒకవేళ ఏదైనా పబ్లిక్ ఫంక్షన్లు, ప్రెస్ కాన్ఫరెన్స్ లలో పాల్గొనే ఆటగాళ్లు మీడియాతో మాట్లాడొచ్చు. 
- బీసీసీఐకి సమాచారం ఇవ్వకుండా ఏదైనా అనుచిత  వ్యాఖ్యలు చేసే ఆటగాడిపై నిషేధం లేదంటే జరిమానా విధించే అవకాశం. 
- బీసీసీఐ మీడియా మేనేజర్ అనుమతి లేకుండా ఆటగాళ్లతో ఇంటర్వ్యూలు, బైట్స్ తీసుకునే జర్నలిస్టులను ఏడాది పాటు బ్లాక్ లిస్ట్ లో పెట్టే ఛాన్స్.. 

పైన పేర్కొన్న నిబంధనలను  త్వరలో జరుగనున్న  శ్రీలంకతో టీ20 సిరీస్ నుంచే అమలు చేసేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తున్నది. 

 

కాగా.. రెండ్రోజుల క్రితం సాహా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఇన్నాళ్లు భారత క్రికెట్ కు సేవ చేసినందుకు గాను ఓ పేరు మోసిన జర్నలిస్టు నుంచి నాకు దక్కుతున్న గౌరవమిది.. జర్నలిజం విలువలు ఎక్కడికి పడిపోయాయో  అనేదానికి ఇది నిదర్శనం..’ అని ట్వీట్ చేశాడు. 

సాహా చేసిన ట్వీట్ లోని వాట్సాప్ స్క్రీన్ షాట్ లో సదరు జర్నలిస్టు (అతడి పేరును సాహా వెల్లడించలేదు).. అతడితో చేసిన చాట్ కింది విధంగా ఉంది. ‘నాతో ఇంటర్వ్యూ చేయి.. నీకు అది బాగా ఉపయోగపడుతుంది. వాళ్లు (బీసీసీఐ) ఒక వికెట్ కీపర్ ను ఎంచుకున్నారు. నువ్వు 11 మంది జర్నలిస్టులను ఎంపిక చేస్కో.. నాతో పోల్చితే వాల్లు వేస్ట్. నీకు  సాయం చేసేవాళ్లను ఎంచుకో..’ అని రాసుకొచ్చిన ఆ జర్నలిస్టు.. ఆ తర్వాత సాహాకు  వాయిస్ కాల్ కూడా చేశాడు. కానీ సాహా నుంచి ఎలాంటి స్పందనా లేదు. 

దీంతో కొద్దిసేపటికే మళ్లీ అతడే  చాట్ చేస్తూ.. ‘నువ్వు నాకు ఫోన్ చేయలేదు. నేను మళ్లీ నీతో ఇంటర్వ్యూ చేయను. నేను అవమానాలను అంత తేలికగా తీసుకోను. అంతేకాదు.. నేను దీనిని  గుర్తుంచుకుంటాను. నువ్వు ఇలా చేసి ఉండకూడదు..’ అని సాహాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు.  

సాహా చేసిన ఈ ట్వీట్ పెద్ద దుమారమే లేపింది.  సాహాకు మద్దతుగా భారత మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఆర్పీ సింగ్,  ఇర్ఫాన్ పఠాన్ లు నిలిచారు. సదరు జర్నలిస్టు పేరును బయటపెట్టాలని సాహాను కోరారు. ఈ అంశంపై బీసీసీఐ కూడా  విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !