జంపా మన్కడింగ్.. నాటౌట్ ఇచ్చిన అంపైర్.. బిగ్ బాష్ లీగ్‌లో మరో రచ్చ

By Srinivas MFirst Published Jan 3, 2023, 7:35 PM IST
Highlights

Big Bash League: నాన్ స్ట్రైకర్ ఎండ్   నుంచి బ్యాటర్లను ఔట్ చేసేందుకు వీలున్న   ‘మన్కడ్’ను టీమిండియా బౌలర్లు ఎవరైనా చేస్తే నానా యాగీ చేసే ఇంగ్లాండ్, ఆసీస్ ఆటగాళ్లు ఇప్పడు అదే ఫాలో అవుతున్నారు.  

ఈ ఏడాది బిగ్ బాష్ లీగ్ పలు ఆసక్తికర ఘటనలకు వేదికగా మారుతున్నది.  సిడ్నీ థండర్స్ 15 పరుగులకే పది వికెట్లు కోల్పోయి   క్రికెట్ లో అత్యంత తక్కువ స్కోరుకు ఆలౌట్ అయిన జట్టుగా నిలవగా.. రెండ్రోజుల క్రితం మైఖేల్ నెసెర్ పట్టిన క్యాచ్ వివాదాస్పదం అయింది. తాజాగా  బీబీఎల్ మరో వివాదానికి తెరతీసింది.   నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ ను బౌలర్  ఔట్ చేస్తే  దానిని మాములుగా  ఔట్ గా ప్రకటించడం నిబంధనల్లో ఉన్నదే.  కానీ  మెల్‌బోర్న్ స్టార్స్ సారథి ఆడమ్ జంపాకు మాత్రం   ఈ విషయంలో నిరాశే ఎదురైంది. 

విషయంలోకి వెళ్తే.. మెల్‌బోర్న్ స్టార్స్ వర్సెస్ మెల్‌బోర్న్ రెనెగేడ్స్ మధ్య   నేడు జరిగిన మ్యాచ్ లో  స్టార్స్  సారథి జంపా.. రెనెగేడ్స్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ విసిరాడు.    నాలుగో బంతిని వేయబోతూ.. నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న  టామ్ రోజర్స్ ను  రనౌట్ (మొన్నటివరకూ దీనిని మన్కడ్ అని వ్యవహరించేవారు)  చేశాడు.  కానీ అంపైర్ మాత్రం దీనిని నాటౌట్ గా ప్రకటించాడు. 

జంపా వికెట్లను పడేసి  అంపైర్ వెనుకకు వెళ్లిపోయాడు.  కానీ థర్డ్ అంపైర్  దీనిని నాటౌట్ గా ప్రకటించేసరికి జంపా తో పాటు  మెల్‌బోర్న్ స్టార్స్ ఆటగాళ్లు అంపైర్ తో చర్చకు దిగారు. అయితే దీనిని నాటౌట్ గా ప్రకటించడానికి కారణం అప్పటికే జంపా  బౌలింగ్ యాక్షన్  పూర్తికావడం. 

 

Spicy, spicy scenes at the MCG.

Not out is the call...debate away, friends! pic.twitter.com/N6FAjNwDO7

— KFC Big Bash League (@BBL)

మెరిల్‌బోన్ క్రికెట్ నిబంధనల ప్రకారం..  బౌలర్ నాన్ స్ట్రైకర్ బ్యాటర్ ను ఔట్ చేయాలనుకుంటే బంతిని రిలీజ్ చేయడానికి ముందే  ఔట్  చేయాలి.  బౌలింగ్ యాక్షన్ ను పూర్తి చేసి అప్పుడు  వికెట్లను పడేస్తే దానిని ఔట్ గా ప్రకటించరు.   దీంతో జంపాకు నిరాశ తప్పలేదు. ఇదిలాఉండగా.. నాన్ స్ట్రైకర్ ఎండ్   నుంచి బ్యాటర్లను ఔట్ చేసేందుకు వీలున్న   ‘మన్కడ్’ను టీమిండియా బౌలర్లు ఎవరైనా చేస్తే నానా యాగీ చేసే ఇంగ్లాండ్, ఆసీస్ ఆటగాళ్లు ఇప్పడు అదే ఫాలో అవుతున్నారని వీడియో చూసిన క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.   

ఇదిలాఉండగా  ఈ మ్యాచ్ లో  తొలుత బ్యాటింగ్ చేసిన  రెనెగేడ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.  షాన్ మార్ష్ (32), గప్తిల్ (32), మెకెంజీ హర్వే (32) ఫర్వాలేదనిపించారు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన  మెల్‌బోర్న్ స్టార్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 108 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 33 పరుగుల తేడాత  రెనెగేడ్స్ విజయం సాధించింది.   

click me!