
టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పుడిప్పుడే విజయాల దిశగా అడుగులు వేస్తున్న బంగ్లాదేశ్.. సంచలన విజయం సాధించింది. డాకా వేదికగా అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టుతో జరిగిన ఏకైక టెస్టులో ఏకంగా 546 పరుగుల తేడాతో చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. 21వ శతాబ్దంలో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం కావడం గమనార్హం. 662 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్.. 115 పరుగులకే కుప్పకూలింది.
ఈ క్రమంలో బంగ్లాదేశ్.. టెస్టు క్రికెట్ చరిత్రలో అతి పెద్ద విజయాన్ని నమోదుచేసింది. క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకూ 500 ప్లస్ పరుగుల తేడాతో విజయాలు సాధించిన జట్లలో బంగ్లాదేశ్ మూడో స్థానంలో నిలిచింది.
టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాలు :
- 1928లో ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 675 పరుగుల తేడాతో విక్టరీ
- 1934 లో ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 562 పరుగుల తేడాతో ఘన విజయం
- 2023లో బంగ్లాదేశ్.. అఫ్గానిస్తాన్ తో మ్యాచ్ లో 546 పరుగుల తేడాతో విజయం
- 1911లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాతో మ్యాచ్ లో 530 పరుగుల తేడాతో విజయం
మొత్తంగా టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇది మూడో అతి పెద్ద విజయం కాగా 21వ శతాబ్దంలో మాత్రం ఇదే మొదటిది.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్.. 382 పరుగులకు ఆలౌట్ అయింది. నజ్ముల్ శాంటో (146) సెంచరీతో పాటు మహ్మదుల్ హసన్ జాయ్ (76), మోహిది హాసన్ (48) రాణించారు. తొలి ఇన్నింగ్స్ లో అఫ్గాన్.. 146 పరుగులకే ఆలౌట్ అయింది. వికెట్ కీపర్ జజాయ్ టాప్ స్కోరర్. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాకు 236 పరుగుల ఆధిక్యం దక్కింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా.. 80 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 425 పరుగుల భారీ స్కోరు చేసింది. శాంటో (124) తో పాటు మోమినుల్ హక్ (121) కూడా సెంచరీ చేశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో అఫ్గాన్ ఎదుట 661 పరుగుల లక్ష్యం నిర్దేశించినట్టైంది.
మూడో రోజు ఆట ముగిసేసమయానికి అఫ్గానిస్తాన్.. 11 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు మాత్రమే చేసింది. నాలుగో రోజు మరో 70 పరుగులు మాత్రమే చేసి మిగిలిన 8 వికెట్లు కోల్పోయింది. అఫ్గాన్ టీమ్ లో రహ్మత్ షా (30) టాప్ స్కోరర్. అఫ్గాన్ టీమ్ లో ఆఖరి వరస బ్యాటర్ జహీర్ ఖాన్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరగడంతో బంగ్లా విజయం ఖాయమైంది.
ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా బ్యాటర్ శాంటో.. 175 బంతుల్లో 146 పరుగులు చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో కూడా 115 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ లో కూడా శాంటో.. 151 బంతుల్లో 15 బౌండరీల సాయంతో 124 రన్స్ సాధించాడు.