బాబర్ ఆజమ్ దోస్తులనే ఎంపిక చేశారా..? ఆటగాళ్ల పర్ఫార్మెన్స్ అక్కర్లేదా..? మీకంటే అఫ్గాన్ జట్టు బెటర్

Published : Sep 16, 2022, 02:17 PM IST
బాబర్ ఆజమ్ దోస్తులనే ఎంపిక చేశారా..? ఆటగాళ్ల పర్ఫార్మెన్స్ అక్కర్లేదా..?  మీకంటే అఫ్గాన్ జట్టు బెటర్

సారాంశం

T20I World Cup 2022: టీ20 ప్రపంచకప్  లో పోటీపడనున్న పాకిస్తాన్ జట్టును గురువారం  ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జట్టు ఎంపికపై  తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీలక ఆటగాళ్లను పక్కనబెట్టి... 

వచ్చే నెలలో  ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ గురువారం రాత్రి జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే  ఈ జట్టు ప్రకటనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తో పాటు  కెప్టెన్ బాబర్ ఆజమ్ మీద సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. పీసీబీ చీఫ్ సెలక్టర్ మహ్మద్ వసీం ను ట్రోలర్స్ ఓ ఆటాడుకుంటున్నారు. అసలు ఇది టీ20 ప్రపంచకప్ ఆడాల్సిన జట్టేనా..?  ఈ టీమ్  తో ప్రపంచకప్ గెలుస్తారా..?  అని ప్రశ్నిస్తున్నారు. 

ముఖ్యంగా  జట్టు ఎంపికలో పాకిస్తాన్ బ్యాటర్ ఫకర్ జమాన్ ను కాదని స్పిన్నర్  ఉస్మాన్ ఖాదిర్ ను తీసుకోవడం దుమారానికి దారితీసింది. అతడితో పాటు ఆసియా కప్ లో రాణించిన షహన్వాన్ దహానీని  మేయిన్ టీమ్ లో కాకుండా  రిజర్వ్ బెంచ్ లోకి తీసుకోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇదే విషయమై పాక్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘ఉస్మాన్ ఖాదిర్ ఎందుకు..? అతడో నాసిరకం స్పిన్నర్. స్పిన్ పిచ్ ల మీదే భారీగా పరుగులిస్తాడు. అలాంటిది ఆస్ట్రేలియా పిచ్ ల మీద అతడెందుకు..? ఈ జట్టుతో మీరు ప్రపంచకప్ గెలిచినట్టే...!’ అని యూజర్ ట్వీట్ చేశాడు. దానికి మరో యూజర్ .. ‘ఎందుకంటే ఖాదిర్ బాబర్ ఆజమ్ ఫ్రెండ్. ఖాదిర్ లేకుంటే బాబర్ కు తోచదు..’ అని  వ్యంగ్యంగా స్పందించాడు.  

 

అంతేగాక.. ‘దహానీని రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేశారు. మేయిన్ స్క్వాడ్ లోకి తీసుకుంటే బాగుండేది.  ఖాదిర్ ను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేస్తే బాగుండేది..’, ‘అసలు ఇది  టీ20 ప్రపంచకప్ ఆడే జట్టేనా..? జట్టులో అసలు సమతుల్యం లేదు. బ్యాకప్ ఆటగాళ్లు అంతకంటే దరిద్రంగా ఉన్నారు.  అఫ్గానిస్తాన్ ప్రకటించిన జట్టు పాకిస్తాన్ కంటే పది రెట్లు నయం..’ అని  కామెంట్ చేస్తున్నారు.  ఓ యూజర్ జట్టును ఏకంగా ‘బక్వాస్ టీమ్’ అని స్పందించాడు. ‘ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్దిల్ షా  ఎందుకు..? షోయభ్ మాలిక్  ను ఎందుకు ఎంపిక చేయలేదు..?’ అని కామెంట్ చేశాడు.

 

 

నెటిజన్లే గాక పాక్ మాజీలు కూడా జట్టు ఎంపికపై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. పాక్ మాజీ బౌలర్ మహ్మద్ ఆమీర్, ‘చీఫ్ సెలక్టర్ కి చీప్ సెలక్షన్...’ అంటూ ట్వీట్  చేశాడు. షోయభ్ అక్తర్ స్పందిస్తూ.. ‘పాక్ సెలక్టర్ల యావరేజ్‌గా ఉన్నప్పుడు, టీమ్ కూడా యావరేజ్‌గానే ఉంటుంది. ఇలాంటి టీమ్‌తోనే పెద్ద పెద్ద విజయాలు ఆశించడం కష్టమే...’ అంటూ కామెంట్ చేశాడు. 

టీ20 ప్రపంచకప్ కు పాకిస్తాన్ : బాబర్ ఆజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అసిఫ్ అలీ, హైదర్ అలీ,  హరీస్ రౌఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నేన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం, నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది, షాన్ మసూద్, ఉస్మాన్ ఖాదిర్ 
రిజర్వ్ ఆటగాళ్లు : ఫకర్ జమాన్, మహ్మద్ హరీస్, షహన్వాజ్ దహానీ 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !