ఐసీసీ అవార్డులు: క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా బాబర్ ఆజమ్.. టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా బెన్ స్టోక్స్...

By Chinthakindhi RamuFirst Published Jan 26, 2023, 3:39 PM IST
Highlights

ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022గా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్... టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా బెన్ స్టోక్స్.. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ నాట్ సివర్‌కి ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు.. 

2022 ఏడాదికి సంబంధించి ఐసీసీ అవార్డుల ప్రక్రియ పూర్తయిపోయింది. మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలవగా, వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డుతో పాటు ‘మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా అత్యున్నత్త పురస్కారాన్ని దక్కించుకున్నాడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్... 

గత ఏడాది మొత్తంగా మూడు ఫార్మాట్లలో కలిపి 44 మ్యాచులు ఆడిన బాబర్ ఆజమ్, 55.12 సగటుతో 2598 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ బ్యాటింగ్ రికార్డుల కారణంగానే ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022గా ఎంపికయ్యి ‘సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ’ దక్కించుకోబోతున్నాడు బాబర్ ఆజమ్...

 గత ఏడాది 2 వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచిన బాబర్ ఆజమ్.. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022కి కెప్టెన్‌గానూ ఎన్నికయ్యాడు.. గత ఏడాది పాక్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిదీ, ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు దక్కించుకున్న మొదటి ప్లేయర్ షాహీన్ ఆఫ్రిదీ కాగా రెండో ప్లేయర్ బాబర్ ఆజమ్...

ఈ ఏడాది ఐసీసీ అవార్డుల్లో బాబర్ ఆజమ్‌ హవా కనిపించింది. ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన బాబర్ ఆజమ్, వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. ఐసీసీ వన్డే టీమ్‌లో కెప్టెన్‌గా చోటు దక్కించుకున్న బాబర్ ఆజమ్, ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్‌లోనూ చోటు దక్కించుకున్నాడు. కేవలం టీ20 ఫార్మాట్‌లో మాత్రమే బాబర్‌కి ఏ గుర్తింపు దక్కలేదు...

ఇంగ్లాండ్ టెస్టు సారథి బెన్ స్టోక్స్, ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకి ఎంపికయ్యాడు. జో రూట్ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న బెన్ స్టోక్స్, 10 టెస్టుల్లో 9 విజయాలు అందుకున్నాడు...  అంతకుముందు జో రూట్ కెప్టెన్సీలో ఆఖరి 17 టెస్టుల్లో ఒకే ఒక్క విజయం అందుకున్న ఇంగ్లాండ్, బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో ఊహించని కమ్‌బ్యాక్ ఇచ్చింది..

కెప్టెన్‌గానే కాకుండా ప్లేయర్‌గా టెస్టుల్లో 870 పరుగులు చేసిన బెన్ స్టోక్స్, 2 సెంచరీలు కూడా సాధించాడు. అలాగే బౌలింగ్‌లో 26 వికెట్లు పడగొట్టాడు...

ఇంగ్లాండ్ క్రికెటర్ నాట్ సివర్, ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 దక్కించుకున్నాడు. గత ఏడాది 33 మ్యాచుల్లో బ్యాటుతో 1346 పరుగులు చేసిన నాట్ సివర్, 22 వికెట్లు తీసింది. ఐసీసీ ఉమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో చోటు దక్కించుకున్న నాట్ సివర్, ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గానూ నిలిచింది. వన్డేల్లో 17 మ్యాచుల్లో 833 పరుగులు చేసిన నాట్ సివర్, బౌలింగ్‌లో 11 వికెట్లు తీసి ‘రచెల్ హేహీ ఫ్లింట్’ ట్రోఫీ అందుకోనుంది.. 


 

click me!