భారత్‌లో కరోనా.. స్వదేశంలో జైలు: ముందు నుయ్యి, వెనక గొయ్యిలా ఆసీస్ క్రికెటర్ల స్ధితి

By Siva KodatiFirst Published May 4, 2021, 10:38 PM IST
Highlights

ఐపీఎల్‌ మధ్యలోనే ఆగిపోవడంతో ఆసీస్‌ క్రికెటర్ల పరిస్థితి అయోమయంలో పడింది. ఇప్పటికే కొంతమంది లీగ్‌ను వీడి స్వదేశాలకు వెళ్లిపోగా, ఇంకా చాలామంది క్రికెటర్లు ఇక్కడే ఉండిపోయారు. 

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఐపీఎల్ 2021ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఐపీఎల్ సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్, ఇతర సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ తెలిపింది.

భారత్‌లో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఐపీఎల్‌ను రద్దు చేయాలనే డిమాండ్‌ సర్వత్రా వినిపించింది. మరోవైపు బయోబబుల్‌ వాతావరణంలో ఐపీఎల్‌ను నిర్వహిస్తున్నా క్రికెటర్లకు కరోనా రావడంతో కలకలం రేగింది. దీంతో టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

నిన్నటి వరకూ ఐపీఎల్‌ను కచ్చితంగా జరిపి తీరుతామని పేర్కొన్న బీసీసీఐ.. ఎట్టకేలకు దిగివచ్చింది. క్రికెటర్లకు ఏమైనా జరిగితే లేనిపోని చిక్కుల్లోపడే  ప్రమాదం ఉండటంతో బీసీసీఐ టోర్నీని వాయిదా వేసింది. అయితే ఐపీఎల్‌ మధ్యలోనే ఆగిపోవడంతో ఆసీస్‌ క్రికెటర్ల పరిస్థితి అయోమయంలో పడింది.

ఇప్పటికే కొంతమంది లీగ్‌ను వీడి స్వదేశాలకు వెళ్లిపోగా, ఇంకా చాలామంది క్రికెటర్లు ఇక్కడే ఉండిపోయారు. వారితో పాటు ఆసీస్‌కు చెందిన కోచింగ్‌ స్టాఫ్‌, సహాయక సిబ్బంది కూడా ఇక్కడే ఉన్నారు. కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ లో ఆస్ట్రేలియా క్రికెటర్లు పెద్ద సంఖ్యలో ఆడుతున్నారు.

వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, కామెంటేటర్లతో కలిపి దాదాపు 40 మంది వరకు ఆస్ట్రేలియన్లు ఉంటారు. భారత్‌లోనే ఉండిపోదామంటే మళ్లీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియదు.

Also Read:తరలి వెళ్లిపోతున్న ప్లేయర్స్, ఐపీఎల్ ఇక ఇప్పట్లో లేనట్టే..!

అటు ఆస్ట్రేలియా వెళ్లేందుకు విమానాలు లేవు. భారత్ నుంచి నేరుగా ఆస్ట్రేలియా వస్తే జైలు శిక్షేనంటూ ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ ప్రకటించడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది

మే 15 వరకూ భారత్‌ నుంచి వచ్చే విమానాలను నిషేధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాము ఎలా స్వదేశాలకు వెళ్లాలో క్రికెటర్లకు అర్థం కావడం లేదు. దీనిపై క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) కూడా చేతులెత్తేయడంతో ఇక వారికి బీసీసీఐ, భారత ప్రభుత్వమే శరణ్యం.

ఐపీఎల్‌ను రద్దు చేసిన బీసీసీఐ.. విదేశీ క్రికెటర్లను సురక్షితంగా వారి వారి దేశాలకు పంపే పనిలో పడింది. మరోవైపు ఆస్ట్రేలియా క్రికెటర్లకు మాల్దీవులు ఆశలు కల్పిస్తున్నాయి. భారత్ నుంచి మాల్దీవులు చేరుకుని, అక్కడి నుంచి స్వదేశం వెళ్లాలని ఆస్ట్రేలియా క్రికెటర్లు భావిస్తున్నారు.

ఇప్పటికే ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, ఐపీఎల్ కామెంటేటర్ మైకేల్ స్లేటర్ మాల్దీవులు చేరుకున్నాడు. ఇప్పుడు ఇదే దారిలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాల్దీవుల బాటపట్టే అవకాశాలున్నాయి. 

click me!