ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం... మాజీ స్పిన్నర్ షేన్ వార్న్‌తో పాటు ఆయన కొడుక్కి...

By Chinthakindhi RamuFirst Published Nov 29, 2021, 9:35 AM IST
Highlights

రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన షేన్ వార్న్... త్వరలోనే కోలుకుని, తిరిగి కామెంటేటర్‌గా ఎంట్రీ ఇస్తానంటూ ఆశాభావం...

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. సిడ్నీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటర్ బైక్‌పై వెళ్తున్న షేన్ వార్న్‌తో పాటు ఆయన కొడుకు జాక్సన్ కూడా గాయపడినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో షేన్ వార్న్ నడుపుతున్న మోటర్ బైక్, కింద పడిన తర్వాత దాదాపు 15 మీటర్ల దూరం ఈ ఇద్దరినీ ఈడ్చుకెళ్లింది...

‘నాకు బాగా గీసుకుపోయింది, అలాగే చాలా చోట్ల గాయాలయ్యాయి. అయితే అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదమైతే జరగలేదు... ’ అంటూ ప్రమాదం తర్వాత మీడియాకి తెలియచేశాడు షేన్ వార్న్...

రోడ్డు ప్రమాదం తర్వాత తన కాలు విరిగిపోయిందేమోననే భయపడ్డానని, నడుము కూడా లేవడానికి సహకరించకపోవడంతో ఇక నడవలేమోనని తీవ్రంగా కంగారు పడ్డానని చెప్పిన షేన్ వార్న్, లక్కీగా అలాంటిమీలేదని డాక్టర్లు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నట్టు తెలిపాడు...

డిసెంబర్ 8 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో కామెంటేటర్‌గా వ్యవహరించబోతున్నాడు షేన్ వార్న్. మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ సమయానికి పూర్తిగా కోలుకుని, విధుల్లో చేరతానని ఆశాభావం వ్యక్తం చేశాడు షేన్ వార్న్...


ఆస్ట్రేలియా తరుపున 145 టెస్టుల్లో 708 వికెట్లు తీసిన షేన్ వార్న్, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ముత్తయ్య మురళీధరన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. వన్డేల్లో 293 వికెట్లు తీసిన షేన్ వార్న్, ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో1000 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు... 

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ ఆరంభానికి ముందు టెస్టు కెప్టెన్సీలో మార్పులు చేసింది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు.  సెక్స్ మెసేజింగ్ స్కాండల్‌లో ఇరుక్కున్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ టిమ్ పైన్,  టెస్టు కెప్టెన్సీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. యాషెస్ సిరీస్‌కి ముందు జరిగిన ఈ సంఘటన, ఆస్ట్రేలియా క్రికెట్‌లో ప్రకంపనలు క్రియేట్ చేసింది. దీంతో ఆసీస్ టెస్టు కొత్త కెప్టెన్‌గా ప్యాట్ కమ్మిన్స్‌ని నియమించింది ఆస్ట్రేలియా. ఆసీస్ టెస్టు టీమ్‌ను నడిపించబోయే 47వ కెప్టెన్‌ ప్యాట్ కమ్మిన్స్...

‘ప్యాట్ కమ్మిన్స్  ఓ అసాధారణ ఆటగాడు, అద్భుతమైన లీడర్. తన జట్టు సభ్యుల వద్ద, ప్రపంచవ్యాప్తంగా విశేషమైన అభిమానులను సంపాదించుకున్న ప్యాట్ కమ్మిన్స్, ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ తన వినయవిధేయలతో గౌరవాన్ని కూడా సంపాదించుకున్నాడు. అతని సారథ్యంలో జట్టు మంచి విజయాలు అందుకుంటుందని ఆశిస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా క్రికెట్ చీఫ్ నిక్ హక్‌లీ...

‘యాషెస్ సిరీస్‌కి ముందు ఆస్ట్రేలియా జట్టును నడిపించే బాధ్యత దక్కడం గౌరవంగా భావిస్తున్నా.... టిమ్ పైన్ గత కొన్నేళ్లుగా జట్టును ఎలా నడిపించాలో, అలాగే నడిపించడానికి నా వంతు ప్రయత్నం చేస్తా...’ అంటూ తెలిపాడు ప్యాట్ కమ్మిన్స్... 

‘స్టీవ్ స్మిత్‌కి కెప్టెన్‌గా, ప్లేయర్‌గా ఎంతో అనుభవం ఉంది. అలాగే జట్టులో ఉన్న యువ ఆటగాళ్లతో కలిసి దృఢమైన శక్తిగా ఆస్ట్రేలియాను నిర్మించేందుకు ప్రయత్నిస్తాం...’ అంటూ చెప్పుకొచ్చాడు కమ్మిన్స్.. టిమ్ పైన్ కెప్టెన్సీలో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన ప్యాట్ కమ్మిన్స్ సారథ్య బాధ్యతలు తీసుకోవడంతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కి వైస్ కెప్టెన్సీ దక్కింది. 

click me!