
ఆసియా కప్ 2022 టోర్నీని డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆరంభించిన భారత జట్టు, నేడు ఆఫ్ఘాన్‌తో నామమాత్రపు ఆఖరి మ్యాచ్ ఆడనుంది. టాస్ గెలిచిన ఆఫ్ఘాన్, ఫీల్డింగ్ ఎంచుకుంది. వరుసగా మూడో మ్యాచ్‌లో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి ఫైనల్ రేసు నుంచి తప్పుకున్న భారత జట్టు, కనీసం నేటి మ్యాచ్‌లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది...
మరోవైపు ఆఫ్ఘాన్ కూడా టైటిల్ ఫెవరెట్స్‌లో ఒకటిగా ఆసియా కప్ 2022 టోర్నీని ఆరంభించింది. గ్రూప్ స్టేజీలో టేబుల్ టాపర్‌గా నిలిచిన ఆఫ్ఘాన్... సూపర్ 4లో మాత్రం అదే జోరు చూపించలేకపోయింది. శ్రీలంక చేతుల్లో చిత్తుగా ఓడిన ఆఫ్ఘాన్, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడింది...
నిన్న పాక్‌పై మ్యాచ్ ఆడిన ఆఫ్ఘాన్, నేడు భారత జట్టుతో తలబడుతోంది. నేటి మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని ఆఫ్ఘాన్ కూడా ఆరాటపడుతోంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 130 పరుగుల టార్గెట్‌ని కాపాడుకుంటూ ఆఖరి ఓవర్ పోరాడిన ఆఫ్ఘాన్, ఆఖరి వికెట్ తీయలేక ఓటమిపాలైంది... దీంతో టీమిండియా, ఆఫ్ఘాన్‌ని తక్కువ అంచనా వేస్తే... మరో భంగపాటు తప్పదు...
వరుసగా మూడు మ్యాచుల్లో టాస్ ఓడిపోయిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ, నేటి మ్యాచ్‌లో బరిలో దిగడం లేదు. అతని స్థానంలో భారత వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. కెఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకున్న తర్వాత వరుసగా ఫెయిల్ అవుతూ టీమిండియా పరాభవానికి ప్రధాన కారణంగా మారాడు. కెఎల్ రాహుల్ నుంచి సరైన ఇన్నింగ్స్ రాకపోతే అతనిపై తీవ్రమైన ట్రోలింగ్ రావడం ఖాయం.
మొదటి మూడు మ్యాచుల్లో ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చిన విరాట్ కోహ్లీ, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. రవీంద్ర జడేజా గాయపడడంతో అతను లేని లోటు తీరుస్తాడని భావించిన దీపక్ హుడా బ్యాటుతో మెరుపులు మెరిపించలేకపోతున్నాడు...
రోహిత్ శర్మతో పాటు యజ్వేంద్ర చాహాల్, హార్ధిక్ పాండ్యాలకు నేటి మ్యాచ్‌లో రెస్ట్ ఇచ్చింది భారత జట్టు. వీరి స్థానంలో దీపక్ చాహార్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నారు.
భారత జట్టు: కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ చాహార్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్
ఆఫ్ఘనిస్తాన్: హజ్రతుల్లా జజాయి, రెహ్మనుల్లా గుర్భాజ్, ఇబ్రహీం జద్రన్, నజిముల్లా జద్రన్, మహ్మద్ నబీ, కరీం జనత్, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమ్రజయ్, ముజీబ్ వుర్ రెహ్మాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్, ఫజల్‌హక్ ఫరూకీ