టీమిండియా ఆశలపై నీళ్లు చల్లిన ఆఫ్ఘాన్... పాకిస్తాన్‌ ముందు ఈజీ టార్గెట్...

By Chinthakindhi RamuFirst Published Sep 7, 2022, 9:15 PM IST
Highlights

పాకిస్తాన్ ముందు 130 పరుగుల ఈజీ టార్గెట్ పెట్టిన ఆఫ్ఘాన్... టీమిండియా ఆశలు ఆవిరి.. 

ఆసియా కప్ 2022 ఫైనల్ ఆశలు సజీవంగా నిలిచేందుకు టీమిండియా పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లింది ఆఫ్ఘాన్. పాక్‌తో జరిగే మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ విజయం సాధిస్తే... టీమిండియా ఫైనల్ ఆశలు కాస్తో కూస్తో మెరుగయ్యేవి. అయితే భారత జట్టుపై ఘన విజయం ఇచ్చిన ఊపుతో ఆఫ్ఘాన్ బ్యాటర్లకు చుక్కులు చూపించారు పాక్ బౌలర్లు...

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగుల స్కోరు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయి, రెహ్మనుల్లా గుర్భాజ్ కలిసి ఆఫ్ఘాన్‌కి మెరుపు ఆరంభం అందించే ప్రయత్నం చేశారు.

Latest Videos

11 బంతుల్లో 2 సిక్సర్లతో 17 పరుగులు చేసిన రెహ్మనుల్లా గుర్భాజ్, హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 36 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆఫ్ఘాన్. ఆ తర్వాత 17 బంతుల్లో 4 ఫోర్లతో 21 పరుగులు చేసిన హజ్రతుల్లా జజాయిని మహ్మద్ హస్నైన్ బౌల్డ్ చేశాడు...

19 బంతుల్లో ఓ ఫోర్‌తో 15 పరుగులు చేసిన కరీం జనత్, మహ్మద్ నవాజ్ బౌలింగ్‌లో అవుట్ కాగా 37 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేసిన ఇబ్రహీం జద్రాన్, హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 

కెప్టెన్ మహ్మద్ నబీని నసీం షా గోల్డెన్ డకౌట్ చేశాడు. అజ్మతుల్లా ఓమర్‌జై 10 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు, రషీద్ ఖాన్ 15 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. 

భారత జట్టుపై 180+ టార్గెట్‌ని బాదేసిన పాకిస్తాన్ టీమ్‌కి, ఆఫ్ఘాన్‌పై 130 పరుగుల లక్ష్యాన్ని కొట్టడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. అదీకాకుండా ఆసియా కప్‌లో వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్న బాబర్ ఆజమ్... నేటి మ్యాచ్‌లో చెలరేగిపోయే పర్ఫామెన్స్ ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నాడు. అయితే తొలి బంతికే బాబర్ ఆజమ్‌ని గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చిన ఫజల్‌హక్ ఫరూకీ, పాక్‌కి ఊహించని షాక్ ఇచ్చాడు. 1 పరుగు వద్ద తొలి వికెట్ కోల్పోయింది పాకిస్తాన్.

నేటి మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిస్తే,.. సూపర్ 4 స్టేజీలో రెండో విజయాన్ని నమోదు చేస్తుంది. దీంతో తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘాన్‌పై గెలిచిన శ్రీలంక, పాకిస్తాన్‌ రెండేసి విజయాలతో... ఆసియా కప్ 2022 ఫైనల్‌లో తలబడతాయి. ఆఖరి మ్యాచ్‌లో ఆఫ్ఘాన్‌పై భారత జట్టు గెలిస్తే... పాయింట్ల పట్టికలో మూడో స్థానంతో ముగిస్తుంది. ముచ్ఛటగా మూడోది కూడా ఓడితే... ఆఫ్ఘాన్ తర్వాతి స్థానంలో నిలుస్తుంది...

 

click me!