మైదానంలోనే రెచ్చిపోయిన ఆసిస్ అభిమానులు... ఆర్చర్ కు చేదు అనుభవం

By Arun Kumar PFirst Published Sep 5, 2019, 3:57 PM IST
Highlights

ఇంగ్లాండ్ వేదికన జరుగుతున్న యాషెస్ సీరిస్ లో బౌలర్ జోఫ్రా ఆర్చర్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఏకంగా మైదానంలోనే అతడు ఇద్దరు ఆసిస్ అభిమానుల నుండి అవమానాన్ని ఎదుర్కొన్నాడు.  

టీ20 జమానాలో కూడా టెస్ట్ క్రికెట్ కు కాస్తో కూస్తో ఆదరణ వుందంటే అది యాషెస్ సీరిస్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీల వల్లే. టెస్ట్ క్రికెట్ కు అభిమానులు దూరమైనప్పటికి ఇలాంటి సీరిస్ లకు ఏమాత్రం ఆదరణ తగ్గలేదు. కేవలం ఈ సీరిస్ ఇంగ్లాండ్-ఆస్ట్రేలియాల మధ్యే అయినా ప్రపంచ వ్యాప్తంగా వున్న క్రికెట్ ప్రియులు దీనిపై ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే ఇంగ్లాండ్ వేదికన జరుగే ఈ టెస్ట్ సీరిస్ కేవలం ఆటతోనే కాదు వివాదాలకు కూడా బాగా ఫేమస్. అలా ఈ సంవత్సరం మరో అడుగు ముందుకు పడి కేవలం ఆటగాళ్లే కాదు అభిమానులు కూడా వివాదాలకు కారణమవుతున్నారు. 

తాజాగా ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. మాంచెస్టర్ వేదికన బుధవారం నాలుగో టెస్ట్ ఆరంభమయ్యింది. ఈ టెస్ట్ మొదట ఆసిస్ బ్యాటింగ్ ఎంచుకోగా ఇంగ్లాండ్ ఫీల్డింగ్ చేసింది. ఈ క్రమంలో ఆర్చర్ బౌండరీవద్ద ఫీల్డింగ్ చేస్తుండగా ఓ ఇద్దరు ఆసిస్ అభిమానులు అతడిని దుర్భాషలాడారు. 

''నువ్వు ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడివేనా... ఆ దేశ పౌరసత్వం  వుందా. మాకెందుకో అనుమానంగా వుంది. ఓ సారి నీ పాస్ పోర్టు చూపిస్తావా. బార్బడోస్ ఆటలు ఇక్కడ సాగవు.'' అంటూ ఆర్చర్ స్వదేశం ఇంగ్లాండ్ కాదంటూ పదేపదే అరవసాగారు. వారి చేష్టలను, మాటలను ఆర్చర్ పట్టించుకోకపోయినా ఇంగ్లాండ్ అభిమానులు మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. 

మైదానంలో వుండే సెక్యూరిటీ సిబ్బందికి సదరు వ్యక్తుల అనుచిత ప్రవర్తనపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన యాషెస్ నిర్వహకుల దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఇలాంటి చర్యలను ఉపేక్షించకూడదన్న ఉద్దేశ్యంతో సదరు ఆసిస్ అభిమానుల నుండి వివరణ కోరకుండానే బయటకు పంపించేశారు. 

ఇదే యాషెస్ సీజన్లో ఆసిస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లను ఇంగ్లాండ్ అభిమానుల అవమానించారు. బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిన విషయాన్ని పదేపదే  గుర్తుచేస్తూ ''చీటర్స్'' అంటూ హేళన చేస్తున్నారు. దీనిపై ఏకంగా ఆస్ట్రేలియా ప్రధాని సైతం స్పందించి ఇంగ్లీష్ అభిమానులు క్రీడాస్పూర్తిని మరిచి ప్రవర్తిస్తున్నారంటూ చురకలు అంటించాడు.  

click me!