మూడో రోజుకు తోక ముడిచిన కంగారూలు.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌కు స్వల్ప ఆధిక్యం

Published : Jun 18, 2023, 05:55 PM IST
మూడో రోజుకు తోక ముడిచిన కంగారూలు.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌కు స్వల్ప ఆధిక్యం

సారాంశం

Ashes 2023: యాషెస్ టెస్టు సిరీస్ లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్  ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది.  లంచ్ బ్రేక్ కు ముందే కంగారూలు తోకముడిచారు. 

ఎడ్జ్‌బాస్టన్ టెస్టు రసవత్తరంగా సాగుతోంది.  తొలి రెండు రోజులు  బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శించిన  పిచ్ పై మూడో రోజు ఉదయం సెషన్ లో ఇంగ్లాండ్ పేసర్లు రెచ్చిపోయారు.  రెండో రోజు ఆటలో పొద్దంతా బౌలింగ్ వేసి 5 వికెట్లు  మాత్రమే పడగొట్టిన ఇంగ్లీష్  బౌలర్లు.. మూడో రోజు మాత్రం ఫస్ట్ సెషన్ లోనే కంగారూలను మిగతా ఐదు వికెట్లు పడగొట్టి  స్వల్ప ఆధిక్యాన్ని  సాధించారు.  తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్.. 386 పరుగులకు ఆలౌట్ అయింది.  

ఓవర్ నైట్ స్కోరు 311- 5 వద్ద మూడో రోజు ఆట ఆరంభించిన  ఆసీస్‌కు అండర్సన్ ఫస్ట్ షాకిచ్చాడు.  అండర్సన్ వేసిన 99వ ఓవర్లో   రెండు బంతులను బౌండరీకి తరలించిన  వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (66).. అదే ఓవర్లో నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  

కేరీ స్థానంలో వచ్చిన  ఆసీస్ సారథి పాట్ కమిన్స్ (62 బంతుల్లో 38, 3 సిక్సర్లు)   ధాటిగా ఆడేందుకు యత్నించాడు. మోయిన్ అలీ వేసిన  102వ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టి  ఆసీస్ స్కోరును 350 పరుగులు దాటించాడు.  అయితే 150 దిశగా సాగుతున్న ఉస్మాన్ ఖవాజా (321 బంతుల్లో 141, 14 ఫోర్లు, 3 సిక్సర్లు) ను డ్రింక్స్ విరామం తర్వాత  రాబిన్సన్ బౌల్డ్ చేశాడు.   ఖవాజా - కమిన్స్  లు ఏడో వికెట్ కు 38 పరుగులు జోడించారు.  ఖవాజా నిష్క్రమిచిన తర్వాత ఆసీస్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు.   రాబిన్సన్ తన తర్వాతి ఓవర్లో నాథన్ లియాన్ (1) ను ఔట్ చేశాడు.  స్కాట్ బొలాండ్ (0) ను బ్రాడ్ ఔట్ చేయగా.. కమిన్స్  ను రాబిన్సన్  ఔట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్.. 386 పరుగుల వద్ద ముగిసింది.  దీంతో  ఇరు ఆటగాళ్లు లంచ్‌కు వెళ్లారు. 

 

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో  393 పరుగులు చేసి డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.  ఆసీస్ 386 పరుగులే చేయడంతో ఇంగ్లాండ్ కు ఏడు పరుగుల నామమాత్రపు  ఆధిక్యం దక్కింది.  తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్, రాబిన్సన్ లు తలా మూడు వికెట్లు తీయగా  మోయిన్ అలీ రెండు వికెట్లు పడగొట్టాడు.   స్టోక్స్, అండర్సన్ లు తలా ఓ వికెట్ తీశారు. 

 

PREV
click me!

Recommended Stories

కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన