ఐపీఎల్ మ్యాచులన్నీ ముంబైలోనే, ఫైనల్ ఆలస్యం, మరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్..?

By team teluguFirst Published May 4, 2021, 11:05 AM IST
Highlights

మొత్తం పరిస్థితుల నేపథ్యంలో ఒకే వేదిక నుండి మొత్తం ఐపీఎల్ నిర్వహించే ప్రయత్నాలను బీసీసీఐ చేపట్టింది.

కరోనా దెబ్బకు దేశం  చివురుటాకులా వణికిపోతుంది. ప్రజలు పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. వైరస్ ఇక్కడకు పాకుతుంది, అక్కడ సోకదు అన్నట్టుగా కాకుండా అత్యంత సురక్షితమైనదని భావించే ఐపీఎల్ బయో సెక్యూర్ బబుల్ ని కూడా ఛేదించి వైరస్ లోపలికి ప్రవేశించి క్రికెటర్లకు కూడా సోకింది. కోల్కతా ఆటగాళ్లలో వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారిన పడగా, పాట్ కమిన్స్ సహా మరికొందరు లక్షణాలతో బాధపడుతున్నారు. 

చెన్నై సూపర్  కింగ్స్ ఆటగాళ్లకు ఇప్పటివరకు సోకకున్నప్పటికీ... వారి బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ సహా మరో ఇద్దరికి వైరస్ సోకింది. ఢిల్లీ స్టేడియం గ్రౌండ్ స్టాఫ్ లో కూడా ఇద్దరు వైరస్ బారిన పడ్డారు. దీనితో ఇప్పుడు ఐపీఎల్ టీముల్లో కరోనా కలవరం మొదలయింది. లక్ష్మీపతి బాలాజీ మొన్న డాగ్ అవుట్ లో ఉండగా ముంబై ఇండియన్స్ స్టాఫ్, ప్లేయర్స్ తో కూడా ముచ్చటించాడు. దీనితో ఇప్పుడు సదరు టీములు కూడా టెన్షన్ కి గురవుతున్నాయి. 

ఈ మొత్తం పరిస్థితుల నేపథ్యంలో ఒకే వేదిక నుండి మొత్తం ఐపీఎల్ నిర్వహించే ప్రయత్నాలను బీసీసీఐ చేపట్టింది. తొలుత ప్రకటించిన 6 వేదికల్లోనూ ప్రస్తుతానికి ముంబై లో 2000 పైచిలుకు కేసులు మాత్రమే ఒక్క రోజుకి నమోదవుతున్నాయి. మిగిలిన నగరాల్లో అది విపరీతంగా ఎక్కువుంది. 

దీనితో ముంబైలోని హోటల్స్ తో బీసీసీఐ చర్చలు జరుపుతుంది. బయో బబుల్ వాతావరణం సృష్టి గురించిన ఏర్పాట్లను పరిశీలిస్తుంది. ఇలా గనుక ఒక్కటే నగరం నుంచి నిర్వహిస్తే ప్రయాణం చేయడం కూడా అవసరం ఉండదు. కరోనా వైరస్ వ్యాప్తి రిస్కును కూడా తగ్గించినట్టవుతుంది. దీనితో ముంబై నగరంలో మిగిలిన మ్యాచుల నిర్వహణ గురించిన అధికారిక ప్రకటన సాధ్యమైనంత త్వరగా వెలువడే అవకాశం ఉంది. అంతే కాకుండా ముంబై లో మూడు గ్రౌండ్లు అందుబాటులో ఉండడం మరొక కారణం. 

ఈ వైరస్ నేపథ్యంలో ఫైనల్ మ్యాచును జూన్ మొదటి వారంలో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. కానీ ఇక్కడే ఒక సమస్య వచ్చి పడింది. అదే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జూన్ 18 నుండి 22 మధ్య ఇంగ్లాండ్ లో జరగనుంది. ఇప్పటికే భారత్ నుండి రాకపోకలను నిషేధించిన బ్రిటన్ ప్రభుత్వంతో బీసీసీఐ చార్చలు జరుపుతుంది. వీసాలు, క్వారంటైన్ కలం, నియమ నిబంధనలు, బయో బాబుల్ ల గురించిన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. 

ముంబై లోనే ఫైనల్ నిర్వహిస్తే భారత్, న్యూజిలాండ్ ప్లేయర్స్ నేరుగా ముంబై నుండే ఇంగ్లాండ్ వెళ్లేందుకు వీలుంటుంది. ఆ తరువాత క్వారంటైన్ అన్ని కూడా తేలికగా తేలిపోయే ఆస్కారం ఉంది. మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

click me!