Duleep Trophy: జైస్వాల్ దురుసు ప్రవర్తన.. గ్రౌండ్ నుంచి వెళ్లగొట్టిన రహానే..

Published : Sep 25, 2022, 03:08 PM IST
Duleep Trophy: జైస్వాల్ దురుసు ప్రవర్తన.. గ్రౌండ్ నుంచి వెళ్లగొట్టిన రహానే..

సారాంశం

Duleep Trophy Final: యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్  తన దురుసు ప్రవర్తనతో  హద్దులు మీరాడు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్ ను స్లెడ్జింగ్ చేస్తూ  కెప్టెన్ చెప్పినా వినకుండా  అదే మాదిరిగా  రచ్చ చేశాడు. 

దులీప్ ట్రోఫీలో  భాగంగా సౌత్ జోన్ తో ముగిసిన ఫైనల్లో డబుల్ సెంచరీ చేసి అందరి మన్ననలు పొందిన ముంబై యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్.. చివరి రోజు తన దురుసు ప్రవర్తనతో విమర్శల పాలయ్యాడు. సౌత్ జోన్ బ్యాటర్  రవితేజను పదే పదే కవ్విస్తూ   హద్దులు మీరాడు. అప్పటికే రెండు సార్లు కెప్టెన్ హెచ్చరించినా వినకుండా స్లెడ్జింగ్ చేయడంతో అంపైర్లు జైస్వాల్ ను గ్రౌండ్ నుంచి వెళ్లిపోమని తేల్చిచెప్పడంతో రహానే అతడిని ఫీల్డ్ నుంచి వెళ్లగొట్టాడు. 

అసలేం జరిగిందంటే..   నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోరు  154-6 వద్ద ఐదో రోజు ఆరంభించిన సౌత్ జోన్ తొలి సెషన్ లో  కాస్త ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ బ్యాటర్ రవితేజను లక్ష్యంగా చేసుకున్నాడు జైస్వాల్. 

రవితేజను పదే పదే కవ్వించడంతో అతడు రహానేకు ఫిర్యాదు చేశాడు. రహానే అప్పటికే రెండుసార్లు జైస్వాల్ ను మందలించి  కామ్  గా ఉండాలని  హెచ్చరించాడు. హద్దులు మీరొద్దని చెప్పినా జైస్వాల్ మాత్రం వినిపించుకోకుండా రవితేజను మళ్లీ గెలికాడు. దీంతో ఈసారి అతడు  అంపైర్ కు ఫిర్యాదు చేశాడు. 

 

అంపైర్లు  రహానేను పిలిచి జైస్వాల్ పై క్రమశిక్షణ చర్యలకు దిగారు. జైస్వాల్ ను గ్రౌండ్ నుంచి పంపించాలని రహానేకు సూచించారు. అప్పటికే రెండుసార్లు చెప్పి చూసిన రహానే కూడా మరో మాట ఆలోచించకుండా జైస్వాల్ ను ఫీల్డ్ వదిలిపోవాలని పంపించాడు. ఈ ఘటనతో జైస్వాల్ పై విమర్శల వర్షం కురుస్తున్నది.  మంచి బ్యాటర్ గా ఎదుగుతున్న క్రమంలో ఇలాంటి పనులు చేసి పేరు చెడగొట్టుకోవద్దని నెటిజన్లు జైస్వాల్ కు సూచిస్తున్నారు. 

ఇక కోయంబత్తూరు వేదికగా ఆదివారం ముగిసిన దులీప్ ట్రోఫీ ఫైనల్ లో సౌత్ జోన్  294 పరుగుల తేడాతో ఓడింది. నాలుగో రోజు  ఓవర్ నైట్ స్కోరు (154-6)కు  మరో 80 పరుగులు మాత్రమే జోడించి చేతులెత్తేసింది. హైదరాబాద్ బ్యాటర్ టేకులపల్లి రవితేజ (53) కాస్త ప్రతిఘటించడంతో సౌత్ జోన్ స్కోరు 200 దాటింది.  అతడికి సహకరించేవారెవరూ లేకపోవడంతో  ఇన్నింగ్స్.. 71.2 ఓవర్లలో 234 పరుగుల వద్ద తెరపడింది. 

ఇదిలాఉండగా వెస్ట్ జోన్ కు ఇది 19వ దులీప్ ట్రోఫీ కావడం విశేషం. ఈ జాబితాలో నార్త్ జోన్ కు 18, సౌత్ జోన్ 13, సెంట్రల్ జోన్ 6, ఈస్ట్ జోన్ 2, ఇండియా బ్లూ 2, ఇండియా రెడ్ 2, ఎలైట్ సి ఒక్కసారి దులీప్ ట్రోఫీని నెగ్గాయి. 
 

 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !