ఐసీసీ ఈవెంట్లలో రోహిత్ ప్రదర్శన ఎలా ఉంది..? ఈసారైనా దాన్నుంచి బయటపడతాడా..?

Published : Jun 06, 2023, 01:12 PM IST
ఐసీసీ ఈవెంట్లలో  రోహిత్ ప్రదర్శన ఎలా ఉంది..?  ఈసారైనా దాన్నుంచి బయటపడతాడా..?

సారాంశం

WTC Final 2023:  ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ  వరల్డ్  టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ బుధవారం నుంచి  మొదలుకానుంది. 

పదేండ్లుగా ఐసీసీ ట్రోఫీ కొరతతో అల్లాడుతున్న టీమిండియాకు ఈ ఏడాది మరో అవకాశం దక్కింది. జూన్ 7 నుంచి  ఇంగ్లాండ్ లోని ఓవల్ లో ఆస్ట్రేలియాతో  టీమిండియా.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనుంది.  కెప్టెన్ ‌గా రోహిత్ కు ఇది  రెండో ఐసీసీ  ఈవెంట్. మరి  సుదీర్ఘకాలంగా టీమిండియాకు ఆడుతున్న హిట్‌మ్యాన్.. ఐసీసీ ఈవెంట్లలో ఎలా ఆడుతున్నాడు..? ఫైనల్‌లో రోహిత్ ‘హిట్టా’, ‘ఫట్టా’ అన్నది ఇక్కడ చూద్దాం. 

రోహిత్‌కు 2007 టీ20 వరల్డ్ కప్ ఫస్ట్ మేజర్ ఐసీసీ ఈవెంట్. ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్ లు ఆడిన రోహిత్.. 118  పరుగులు చేశాడు.  పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ లో  రోహిత్.. 16 బంతుల్లోనే 30 పరుగులు సాధించాడు. 2009 టీ20 వరల్డ్ కప్ లో రోహిత్.. ఐదు ఇన్నింగ్స్ లలో 131 పరుగులే చేశాడు.  

2010 లో నిర్వహించిన  పొట్టి ప్రపంచకప్‌లో 2 ఇన్నింగ్స్ లలో 84 రన్స్ మత్రమే సాధించాడు. ఫామ్ లేమి కారణంగా 2011 వన్డే వరల్డ్ కప్ లో  రోహిత్ చోటు కోల్పోయాడు.  2012 టీ20 వరల్డ్ కప్  లో కూడా హిట్‌మ్యాన్.. 4 ఇన్నింగ్స్ లలో 82 రన్స్ చేశాడు.  2013 ఛాంపియన్స్ ట్రోఫీలో  ఓపెనర్ గా ప్రమోట్ అయిన రోహిత్.. ఐదు ఇన్నింగ్స్ లలో 177 పరుగులు సాధించాడు. ఈ టోర్నీలో భారత్ ఫైనల్ చేరగా ఇంగ్లాండ్ తో ఆ మ్యాచ్ లో 14 బంతులాడి 9 పరుగులే చేసి ఔటయ్యాడు.  

టీ20 టోర్నీలలో కనిపించని మ్యాజిక్.. 

ఇక 2014 టీ20 ప్రపంచకప్ లో 6 ఇన్నింగ్స్ లో 200 రన్స్ చేసిన హిట్ మ్యాన్.. శ్రీలంకతో ముగిసిన ఫైనల్ మ్యాచ్ లో  26 బంతులు ఆడి 29 పరుగులకే వెనుదిరిగాడు.  ఈ మ్యాచ్ లో భారత్ ఫైనల్ లో లంక చేతిలో ఓడింది. 2015 వన్డే వరల్డ్ కప్ లో  రోహిత్.. 8 ఇన్నింగ్స్ లలో 330 పరుగులు సాధించాడు. ఈ  టోర్నీలో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు చేసిన రోహిత్.. మెరుగ్గానే ఆడాడు. కానీ 2016 టీ20 వరల్డ్ కప్ లో 5 ఇన్నింగ్స్ లలో 88  పరుగులు  మాత్రమే చేసి నిరాశపరిచాడు. 

2017 ఛాంపియన్స్ ట్రోఫీలో 5 ఇన్నింగ్స్ లలో 304 రన్స్ చేసిన రోహిత్.. ఫైనల్ లో పాకిస్తాన్ తో పోరులో మరోసారి చేతులెత్తేశాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ 3 బంతులు మాత్రమే ఆడి   డకౌట్ అయ్యాడు. 2019 వరల్డ్ కప్ లో రోహిత్ తన పీక్స్ చూపించాడు. ఈ టోర్నీలో ఏకంగా 648 రన్స్ తో రాణించాడు. ఇందులో  ఐదు సెంచరీలు ఉండటం గమనార్హం. కానీ సెమీస్ లో భారత జట్టు న్యూజిలాండ్ చేతిలో ఓడింది. 

అప్పుడూ వైఫల్యమే.. 

2021 టీ20 వరల్డ్ కప్ లో రోహిత్.. 174 పరుగులు మాత్రమే చేయగా గతేడాది పొట్టి ప్రపంచకప్ లో  6 ఇన్నింగ్స్ లలో 116 పరుగులే చేసి నిరాశపరిచాడు. 2021లో జరిగిన ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (న్యూజిలాండ్) లో కూడా రోహిత్ 34, 30 పరుగులతో   విఫలమయ్యాడు.   తన సుదీర్ఘ కెరీర్ లో ఐదు ఐసీసీ ఫైనల్స్ ఆడిన రోహిత్.. 2007లో మినహా మిగిలిన మ్యాచ్‌లలో తీవ్రంగా నిరాశపరిచాడు. మరి  రేపట్నుంచి ఆస్ట్రేలియాతో మొదలుకాబోయే   డబ్ల్యూటీసీ ఫైనల్స్ - 2023 లో అయినా హిట్ మ్యాన్ ఫైనల్ ఫోబియాను అధిగమిస్తాడా..? 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IPL 2026 auction లో కామెరాన్ గ్రీన్ కు రూ.25 కోట్లు.. చేతికి వచ్చేది రూ.18 కోట్లే ! ఎందుకు?
IPL 2026 Auction: కామెరాన్ గ్రీన్‌కు జాక్‌పాట్.. రూ. 25.20 కోట్లు కుమ్మరించిన కేకేఆర్ !