
మెగా టోర్నీకి ముందు పాకిస్తాన్ కు ఫుల్ జోష్ ను ఇచ్చే విజయం దక్కింది. టీ20 ప్రపంచకప్ కు ముందు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లి అక్కడ బంగ్లాదేశ్ తో కలిసి ముక్కోణపు సిరీస్ ఆడిన పాకిస్తాన్.. ఫైనల్లో కివీస్ ను ఓడించి ట్రోఫీని దక్కించుకుంది. క్రిస్ట్‌చర్చ్ వేదికగా ముగిసిన ఫైనల్లో న్యూజిలాండ్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఈ సిరీస్ లో నిలకడగా రాణించిన ఓపెనర్లు ఫిన్ అలెన్ (12), డెవాన్ కాన్వే (14) లు విఫలమయ్యారు.
5 ఓవర్లకే కివీస్ ఓపెనర్లను కోల్పోవడంతో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (38 బంతుల్లో 59, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్ ఫిలిప్స్ (22 బంతుల్లో 29) లు కివీస్ ను ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 50 పరుగులు జోడించారు. ఆ తర్వాత చప్మన్ (25), నీషమ్ (17) మెరుపులతో న్యూజిలాండ్.. 7 వికెట్ల కు 163 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన పాకిస్తాన్.. పేలవ ఫామ్ లో ఉన్న బాబర్ ఆజమ్ (15) మరోసారి నిరాశపరిచాడు. షాన్ మసూద్ (19) కూడా నిలవలేకపోయాడు. కానీ తన కెరీర్ లో అత్యద్భుత ఫామ్ లో ఉన్న రిజ్వాన్ (29 బంతుల్లో 34, 4 ఫోర్లు) పాక్ ను ఆదుకున్నాడు. గత కొన్నాళ్లుగా మిడిలార్డర్ సమస్యలతో సతమతమవుతున్న పాక్.. ఈ మ్యాచ్ లో వాటిని అధిగమించింది. మహ్మద్ నవాజ్ (22 బంతుల్లో 38 నాటౌట్, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హైదర్ అలీ (15 బంతుల్లో 31, 3 ఫోర్లు, 2 సిక్స్ లు) మెరుపులు మెరిపించారు. చివర్లో ఇఫ్తికార్ అహ్మద్ (14 బంతుల్లో 25 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్) దూకుడుగా ఆడటంతో పాకిస్తాన్.. 19.3 ఓవర్లలో విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్ లో బౌలింగ్ లో ఒక వికెట్ తీయడమే గాక బ్యాటింగ్ లో కీలక పరుగులు చేసిన మహ్మద్ నవాజ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. సిరీస్ ఆసాంతం రాణించిన బ్రాస్‌వెల్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.