
హిత్ స్ట్రిక్, ఆండీ ఫ్లవర్, గ్రాంట్ ఫ్లవర్, హెన్రీ ఒలాంగా, తతెంద తైబు, బ్రెండన్ టేలర్, మసకద్జా, అలెస్టర్ క్యాంప్‌బెల్ వంటి దిగ్గజ ఆటగాళ్లు కలిగిన జట్టు అది. అంతర్జాతీయ క్రికెట్ లో ఒకనాడు వెలుగు వెలిగిన ఆ జట్టు కాలక్రమంలో దాని ప్రభ మసకబారింది. అగ్రశ్రేణి ఆటగాళ్లు రిటైర్ అవడం.. ఆ స్థాయిలో యువ క్రికెటర్లెవరూ క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోకపోవడం.. బోర్డు దివాళాతీయడం.. ఒక్కటేంటి..? కర్ణుడి చావుకు ఉన్న కారణాలన్నీ జింబాబ్వే క్రికెట్ నాశనమవడానికీ ఉన్నాయి. ఒకానొక దశలో క్రికెటర్లు షూ కొనుక్కోవడానికి కూడా వాళ్ల దగ్గర డబ్బులు లేని పరిస్థితి.
క్రికెట్‌లో పసికూన అనే ట్యాగ్‌ను ఆనతికాలంలోనే తొలిగించుకుని అంతర్జాతీయ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న జట్టు జింబాబ్వే.. 2005 తర్వాత క్రమంగా కనుమరుగైంది. నిన్నా మొన్నటి వరకు అసలు ఆ జట్టు ఇంకా మనుగడలోనే ఉందనే విషయం కూడా క్రికెట్ అభిమానుల ఎరుకలో లేదు.
కానీ సుమారు దశాబ్దంన్నర తర్వాత ఆ జట్టుకు మళ్లీ మంచిరోజులు వచ్చినట్టుగా అనిపిస్తున్నది. ఇటీవలే టీ20 ప్రపంచకప్ -2022కు అర్హత సాధించామన్న ఆనందమో ఏమో గానీ ఆ జట్టు తాజాగా సంచలనాలు నమోదు చేస్తున్నది. తాజాగా ఆ దేశ పర్యటనకు వెళ్లిన బంగ్లా పులులకు చుక్కలు చూపిస్తున్నది. మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు గాను బంగ్లాదేశ్.. జింబాబ్వే పర్యమటనకు వెళ్లగా ఇప్పటికే పర్యాటక జట్టు టీ20 సిరీస్ ను కోల్పోయింది. తాజాగా ఆ జట్టు తొలి వన్డే లో కూడా గెలిచింది.
టీ20లలో..
జింబాబ్వే పర్యటనలో బంగ్లాకు ఆతిథ్య జట్టు షాకుల మీద షాకులిస్తున్నది. బంగ్లాదేశ్ ఒకప్పుడు పసికూన జట్టు కావచ్చు గానీ స్వదేశంలో అది న్యూజిలాండ్ ను ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. ఆసీస్ కు షాకిచ్చింది. పలుమార్లు టీమిండియాకూ షాకులిచ్చింది. అలాంటి బంగ్లాను జింబాబ్వే టీ20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో ఆటాడుకుంది. తొలుత బ్యాటింగ్ చేసి 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 205 పరుగలు చేసింది. జింబాబ్వే బ్యాటర్ల ధాటికి బంగ్లా బౌలర్లు టస్కిన్ అహ్మద్, నజుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్, షోరిఫుల్ ఇస్లామ్ లు బెంబేలెత్తారు. ఆ తర్వాత బౌలింగ్ లో కూడా జింబాబ్వే రాణించి బంగ్లాపై 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్ లో బంగ్లా గెలిచినా మూడో మ్యాచ్ లో జింబాబ్వేదే విజయం.
వన్డేలలో..
ఇక శుక్రవారం హరారే వేదికగా ముగిసిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ నిర్దేశించిన 304 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన తీరు అద్భుతం అనాల్సిందే. 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తరుణంలో ఇన్నోసెంట్ కైయా (110), సికందర్ రాజా (135)లు సెంచరీలతో చెలరేగి మరో రెండు ఓవర్లు మిగిలుండానే జింబాబ్వేకు చిరస్మరణీయ విజయం అందించారు. వన్డేలలో జింబాబ్వే.. బంగ్లాను ఓడించడం తొమ్మిదేండ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. 2013లో చివరిసారి జింబాబ్వే.. బంగ్లాపై గెలిచింది.
టీమిండియాకు షాకులు తప్పవా..?
బంగ్లాదేశ్ పర్యటన ముగిశాక జింబాబ్వేకు భారత జట్టు వెళ్లనుంది. అక్కడ యువ భారత్.. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు ఆడుతుంది. అయితే జింబాబ్వే ఒకప్పటి పసికూన జట్టు కాదన్నది తాజాగా కనపడుతున్న ఫలితాల ద్వారా తేలుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో భారత జట్టు శ్రమించక తప్పదు. అలా కాదని లైట్ తీసుకుంటే భారత జట్టుకు షాకులు తప్పవని బంగ్లాదేశ్ సిరీస్ నుంచి నేర్చుకోవాల్సిన అంశం.
కోచ్ మనోడే..
జింబాబ్వే హెడ్ కోచ్ గా లాల్ సింగ్ రాజ్‌పుత్ వ్యవహరిస్తున్నాడు. రాజ్‌పుత్ గతంలో భారత్ జట్టు తరఫున ఆడటమే గాక కోచ్ గా కూడా పనిచేశాడు. 2016 నుంచి 2018 వరకు ఆఫ్ఘనిస్తాన్ కు హెడ్ కోచ్ గా ఉన్న ఆయన.. 2018 నుంచి జింబాబ్వేకు కోచ్ గా పనిచేస్తున్నాడు. రాజ్‌పుత్ మార్గదర్శనంలో జింబాబ్వే జట్టు సంచలనాలను నమోదు చేస్తున్నది.