
గురువారం రాత్రి వాంఖెడే వేదికగా ముగిసిన ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఫిక్సయిందా..? ముంబై జట్టు ఓనర్ ముఖేశ్ అంబానీ తన పలుకుబడిని ఉపయోగించి మ్యాచ్ లో పవర్ కట్ చేయించాడా..? సోషల్ మీడియా లో ఇప్పుడు ఇదే చర్చ. ముంబై-చెన్నై మ్యాచ్ లో పవర్ కట్ వల్ల టాస్ కూడా ఆలస్యమవగా.. తర్వాత చెన్నై ఇన్నింగ్స్ (బ్యాటింగ్) ప్రారంభమయ్యాక కూడా 2 ఓవర్ల దాకా కరెంట్ రాలేదు. కానీ ఆలోపే చెన్నైకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ముంబై విజయం అంబానీదే గానీ ఆ జట్టుది కాదంటున్నారు నెటిజన్లు.. వాంఖెడేలో పవర్ కట్ ఇష్యూ ఉండటం వింతే అయినా దీనిమీద బీసీసీఐ ఇంతవరకు స్పందించలేదు.
రాత్రిపూట కూడా నిద్రపోని నగరంగా పేరు గాంచిన ముంబైలో ప్రతి వీధిలో బల్బులు రాత్రంతా జిగేల్ మని వెలుగులు విరజిమ్ముతుంటాయి. అలాంటి ముంబై లో, అదీ ప్రతిష్టాత్మక మ్యాచ్ జరుగుతున్న సమయంలో పవర్ కట్ అనేది కొంత అనుమానాలకు దారి తీస్తున్నది. అదీగాక వేల కోట్లు ఖర్చు పెట్టి ఐపీఎల్ ను నిర్వహిస్తున్న బీసీసీఐ.. హక్ ఐ టెక్నాలజీని ఉపయోగించుకునేంత స్థాయిలో కూడా లేదా..? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఈ మ్యాచ్ లో డీఆర్ఎస్ లేకపోవడం వల్ల తొలి ఓవర్లో డెవాన్ కాన్వే వికెట్ కోల్పోయిన చెన్నై అదే ఓవర్లో మోయిన్ అలీ వికెట్ కూడా నష్టపోయింది. ఆ తర్వాత ఓవర్లో రాబిన్ ఊతప్ప కూడా ఔటయ్యాడు. ఊతప్ప ఔట్ అయిన సమయంలో డీఆర్ఎస్ పునరుద్దరించినా అతడు దానిని తీసుకోకుండానే వెనుదిరిగాడు.
కాగా.. ముంబై గెలవడానికే అంబానీ ఇలా చేశారని, ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందని నెటిజ్లను ఆడిపోసుకుంటున్నారు. అంబానీ.. వాంఖెడే స్టేడియానికి పవర్ వచ్చే చోట వైర్లను కట్ చేస్తున్నట్టు మీమ్స్ సృష్టించి వాటిని వైరల్ చేస్తున్నారు. మరికొందరు ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఇంత అభద్రతా భావం ఉన్న వ్యాపారవేత్తను ఇప్పటివరకూ చూడలేదు. సీఎస్కే కూడా ఐదు టైటిళ్లు సాధించి తమతో సమానంగా వస్తుందని భావించిన అంబానీ.. ఈ డర్టీ ట్రిక్ ఉపయోగించాడు. మనీ, తన పవర్ ను ఉపయోగించి ఇలా చేశాడు. అతడిని కర్మ వదిలిపెట్టదు..’ అని స్పందించారు.
వేదాంశ్.కె అని రాసి ఉన్న ఓ ట్విటర్ యూజర్ స్పందిస్తూ.. ‘ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందని నేను 100 శాతం నమ్ముతున్నాను. ఫస్ట్ ఓవర్ లో డీఆర్ఎస్ లేదు. స్టేడియంలో పవర్ కట్. సీఎస్కే ను ప్లేఆఫ్స్ నుంచి పంపించడానికి ఇది అంబానీ పన్నిన కుట్ర..’ అని ట్వీట్ చేశాడు.