Coronavirus: గత వారంతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా కొత్త ఇన్ఫెక్షన్లు 8 శాతం పెరిగాయి. మార్చి 7-13 వరకు 11 మిలియన్ల కొత్త కేసులు నమోదుకాగా, 43,000 మందిని కరోనా బలితీసుకుంది.
Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. గత కొంత కాలంగా స్వల్పంగా నమోదైన కరోనా కేసులు.. ప్రస్తుతం చాలా దేశాల్లో క్రమంగా పెరుగుతున్నట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. మరో భయంకర విషయం ఏమిటంటే ప్రస్తుతం చాలా దేశాలు కరోనా పరీక్షల రేటు తగ్గుదలను చూపిస్తున్నాయి. అయినప్పటికీ.. కరోనా కేసులు అధికంగా నమోదుకావడం ప్రస్తుతం కోవిడ్-19 విజృంభణకు అద్దం పడుతోంది. ప్రస్తుతం COVID-19 కేసులు, మరణాల పెరుగుదల నేపథ్యంలో వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మరోసారి హెచ్చరించింది.
దాదాపు నెల కంటే ఎక్కువ రోజులు కరోనా కేసులు తగ్గుదలను నమోదుచేశాయి. అయితే, గత వారం ప్రపంచవ్యాప్తంగా COVID-19 కేసులు క్రమంగా పెరుగుతుండటం ప్రారంభమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. మరీ ముఖ్యంగా ఆసియాలోని చాలా ప్రాంతాలతో పాటు చైనాలో లాక్‌డౌన్ విధించే స్థాయిలో కరోనా వ్యాప్తి పెరిగిందని పేర్కొంది. మళ్లీ కరోనావైరస్ కట్టడి కోసం పలు దేశాలు లాక్డౌన్ లోకి వెళ్లే పరిస్థితులు పెరిగాయని తెలిపాంది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి పోరాడుతున్నాయని తెలిపింది.
undefined
ఇదివరకు కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతున్న క్రమంలో.. మళ్లీ కోవిడ్ కొత్త కేసులు అధికంగా నమోదుకావడానికి అత్యంత వేగంగా వ్యాపించే Omicron వేరియంట్, దాని BA.2 సబ్‌లినేజ్ లు కారణంగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అలాగే, ప్రజారోగ్యంలో నిర్లక్ష్యం, సామాజిక చర్యలు తగ్గడం, కరోనా ఆంక్షలను దాదాపు అన్ని దేశాలు ఎత్తివేయడం కరోనా పెరుగుదలకు కారణమైందని WHO తెలిపింది. "కొన్ని దేశాలలో పరీక్షలు తగ్గినప్పటికీ ఈ పెరుగుదల సంభవిస్తుంది, అంటే మనం చూస్తున్న కేసులు మంచుకొండ కొన మాత్రమే" అని WHO అధిపతి టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ప్రపంచ దేశాలను హెచ్చరించారు.
గత వారంతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా కొత్త ఇన్ఫెక్షన్లు 8 శాతంపెరిగాయి. మార్చి 7-13 వరకు 11 మిలియన్ కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇదే సమయంలో 43,000 కొత్త మరణాలు నమోదయ్యాయి. జనవరి నెలాఖరు తర్వాత కరోనా కేసులు, మరణాలు పెరగడం ఇదే తొలిసారి. ముఖ్యంగా పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో అతిపెద్ద జంప్ నమోదైందనీ, దక్షిణ కొరియా, చైనాలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో కోవిడ్-19 కేసులు 25 శాతం, మరణాలు 27 శాతం పెరిగాయి.
ఆఫ్రికాలో కరోనా వైరస్ కొత్త కేసులు 12 శాతం, మరణాలలో 14 శాతం పెరుగుదల నమోదైంది. ఇక యూరప్‌లో 2 శాతం కేసులు పెరిగాయి. అయితే ఇక్కడ మరణాలలో పెరుగుదల లేదు. తూర్పు మధ్యధరా ప్రాంతంతో సహా ఇతర ప్రాంతాలు తగ్గుతున్న కేసులను నివేదించాయి, అయితే ఈ ప్రాంతంలో మరణాలు 38 శాతం పెరుగుదలను చూసింది. ఇది మునుపటి ఇన్ఫెక్షన్ల పెరుగుదలతో ముడిపడి ఉంది.
ఆస్ట్రియా, జర్మనీ, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, యునైటెడ్ కింగ్‌డమ్‌లలో మార్చి ప్రారంభం నుండి కేసులు పెరుగుతుండటంతో, యూరప్ మరొక కరోనావైరస్ వేవ్ ను ఎదుర్కొంటుందని అనేక మంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వేరియంట్ బీఏ.2 ఇప్పటివరకు అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వేరియంట్ గా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.