కరోనా మళ్లీ కలవరపెడుతోంది. గత కొంత కాలం వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఈ మధ్య కాలంలో మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు మళ్లీ కరోనా ఆంక్షలు విధించడం ప్రారంభించాయి.
దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లో కోవిడ్ పెరుగుతోంది. ఆ ప్రాంతంలో రోజు రోజుకు కేసులు ఎక్కువవుతోంది. దీంతో ప్రజలు ఆందోళనకు గురువుతున్నారు. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. హాస్పిటలో చేరికలు, మరణాల సంఖ్య తక్కువగానే ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం.
గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 1,367 తాజా COVID-19 కేసులు నమోదు అయ్యాయి. దీంతో పాటు కరోనాతో ఒకరు మృతి చెందారు. ఢిల్లీలో సానుకూలత రేటు 4.50 శాతంగా ఉంది. ఈ మేరకు ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం రాజధానిలో ఒక రోజులో వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవడం వరుసగా ఇది ఆరో రోజు.
undefined
మొత్తంగా దేశ రాజధానిలో కోవిడ్ కేసుల సంఖ్య ఇప్పటి వరకు 18,78,458 కి చేరుకుంది. తాజా మరణంతో కలుపుకుంటే మరణాల సంఖ్య 26,170కి చేరుకుందని బులెటిన్ పేర్కొంది. మంగళవారం మొత్తం నగరంలో 30,346 కోవిడ్-19 పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం పేర్కొంది. అంతకు ముందు రోజు 1,204 COVID-19 కేసులు, ఒక మరణం నమోదైంది. అయితే పాజిటివిటీ రేటు 4.64 శాతంగా ఉంది. సోమవారం నాడు 6.42 శాతం పాజిటివ్ రేటుతో 1,011 కేసులు నమోదయ్యాయి. ఒక మరణం సంభవించింది.
కాగా ఆదివారం 1,083 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. ఆ రోజు 4.48 శాతం పాజిటివ్ రేటు నమోదవ్వగా.. కరోనాతో ఒకరు మృతి చెందారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ నెల నుంచే కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఆసుపత్రిలో చేరే రేటు తక్కువగా ఉందని హెల్త్ బులిటెన్ తెలిపింది. మొత్తం యాక్టివ్ కేసులలో మూడు శాతం కంటే తక్కువ మంది హాస్పిటల్ లో చేరుతున్నారని పేర్కొంది. ప్రస్తుతం 129 మంది కోవిడ్-19 రోగులు ఢిల్లీలోని వివిధ హాస్పిటల్ లో చేరగా.. 3,336 మంది హోమ్ ఐసోలేషన్‌లో కోలుకుంటున్నారు. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో COVID-19 రోగులకు కోసం 9,390 పడకలు అందుబాటులో ఉండగా అందులో 1.58 శాతం మాత్రమే పేషెంట్లతో నిండిపోయాయని తెలిపింది.
కరోనా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వ్యక్తులపై రూ. 500 జరిమానా విధించాలని అధికారులను ఆదేశిస్తూ ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ ఫోర్ వీలర్ వాహనాల్లో కలిసి ప్రయాణించే వారికి జరిమానా వర్తించదని పేర్కొంది. అయితే రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఏప్రిల్ 12వ తేదీన మాస్క్ తప్పనిసరి అనే నిబంధనను ఎత్తేసింది. ఫైన్లు కూడా ఉండవని పేర్కొంది.
కాగా ఇటీవల జాతీయ రాజధాని కోసం COVID-19 నిర్వహణ విధానాలను రూపొందించే ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సమావేశంలో మళ్లీ మస్క్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే మాస్క్ ధరించని వారికి జరిమానా విధించాలని కూడా అధికారులు నిర్ణయించారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ 21వ తేదీ నుంచి ఢిల్లీ ప్రభుత్వ టీకా కేంద్రాలలో 18-59 సంవత్సరాల వయస్సు గల లబ్ధిదారులకు కోవిడ్-19 వ్యాక్సిన్‌లను ఉచితంగా అందించే కార్యక్రమం ప్రారంభించినట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ తెలిపింది.