కరోనా ఎఫెక్ట్‌తో అమలవుతున్న దేశవ్యాప్త లాక్ డౌన్ వల్ల నిత్యావసర వస్తువుల కోసం ఆన్ లైన్ రిటైల్ సంస్థలకు పుష్కల డిమాండ్ లభిస్తోంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పలు సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. డిమాండ్ కు అనుగుణంగా సరుకులను డెలివరీ చేసేందుకు ఈ-రిటైలర్ సంస్థలు సిబ్బందిని నియమించుకుంటున్నాయి. ఈ క్రమంలో బిగ్ బాస్కెట్, దాని ప్రత్యర్థి గోఫర్స్ 12 వేల మంది ఉద్యోగులను నియమించుకునే పనిలో ఉన్నట్లు తెలిపాయి.
బెంగళూరు: కరోనా మహమ్మారిని అదుపు చేయడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ వల్ల ఆన్‌లైన్ గ్రోసరీ మార్కెట్లకు డిమాండ్ పెరుగుతున్నది. ఈ డిమాండ్‌ను చేరుకోవడానికి ఆయా ఈ-రిటైల్ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి.
భారతదేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ గ్రోసర్ బిగ్ బాస్కెట్, దాని ప్రత్యర్థి గ్రోఫర్స్ కొత్తగా 12,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామని ప్రకటనలు ఇచ్చాయి. వేర్‌హౌసెస్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో పని చేయడానికి 10 వేల మంది ఆన్‌గ్రౌండ్ సిబ్బందిని నియమించు కుంటున్నట్లు బిగ్ బాస్కెట్ పేర్కొంది. వచ్చే కొన్ని రోజుల్లో ఈ నియామకం ఉంటుందని తెలిపింది.
బిగ్ బాస్కెట్ ప్రత్యర్థి సంస్థ గ్రోఫర్స్ కూడా అదనంగా 2 వేల మందిని నియమించుకుంటానని చెప్పింది. కరోనా వైరస్ కారణంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ఈ రెండు కంపెనీలకు డిమాండ్ బాగా పెరిగింది. లేబర్ కొరత ఏర్పడటం ఇప్పుడు కంపెనీకి పెద్ద ఆందోళనగా మారిందని బిగ్ బాస్కెట్ కో ఫౌండర్, సీఈవో హరి మీనన్ తెలిపారు.
గతేడాది తాము ఎక్కువగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై పెట్టుబడి పెట్టామని, వచ్చే 18 నెలల వరకు తమకు అవసరమైన నిల్వ సామర్థ్యం ఉందని, కానీ ఇప్పుడు వర్క్ ఫోర్స్ ప్రాబ్లమ్‌గా మారిందని బిగ్ బాస్కెట్ సహ వ్యవస్థాపకుడు హరి మీనన్ అన్నారు.
సాఫ్ట్ బ్యాంక్ పెట్టుబడిపెట్టిన గ్రోఫర్స్ కూడా వేర్‌హౌసెస్‌లో పనిచేసేందుకు ఉద్యోగులు నియమించుకుంటున్నట్టు తెలిపింది. మరోవైపు గ్లోబల్ ఈ- రిటైల్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కూడా తాత్కాలిక స్టాఫ్‌కు డబుల్ పేమెంట్స్ ఆఫర్ చేస్తున్నాయి.
లాక్‌డౌన్ వల్ల ఈ–కామర్స్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. చాలా మంది ఉద్యోగులు ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో ఈ కంపెనీలకు పెద్ద మొత్తంలో లేబర్ కొరత ఏర్పడింది.
ఇప్పుడు వర్క్ ఫోర్స్ కావాల్సి ఉందని, అందుకే డెలివరీ, వేర్‌హౌస్ పర్సనల్స్‌ను నియమించుకుంటున్నామని బిగ్‌బాస్కెట్ హ్యుమన్ రీసోర్సెస్ వైస్ ప్రెసిడెంట్ తనూజా తివారీ చెప్పారు. బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఆన్‌గ్రౌండ్ స్టాఫ్‌ను అప్పాయింట్ చేసుకుంటున్నాయని చెప్పాయి.
కనీసం టాప్ 30 సిటీల్లో డెలివరీ సమస్యలను పరిష్కరించుకోవాలని భావిస్తున్నామని అగ్రశ్రేణి ఈ రిటైల్ సంస్థలు తెలిపాయి. ఈ కంపెనీలు ప్రస్తుతం వేర్‌హౌసెస్‌లో ఆర్డర్లను పిక్ చేసుకుని, లాస్ట్ మైల్‌కు డెలివరీ చేసేందుకు స్టాఫ్‌ను వెతుకుతున్నాయి.
ప్రస్తుతం తమ వేర్‌హౌసెస్ స్టాఫ్‌లో 65 శాతం మంది మాత్రమే పనిచేస్తున్నట్టు గ్రోఫర్స్ సప్లై చెయిన్ హెడ్ రోహిత్ శర్మ తెలిపారు. అందుకే అదనంగా రెండు వేల మంది కావాలన్నారు. లేబర్ కొరతతో బిగ్‌బాస్కెట్ కేవలం 40 శాతం కెపాసిటీతో మాత్రమే ఆపరేట్ అవుతోంది.
లేబర్ కొరత పరిష్కారమయ్యాక, మరిన్ని ఆర్డర్లను డెలివరీ చేస్తామని ఈ కంపెనీలు చెబుతున్నాయి. బిగ్ బాస్కెట్ సీఈఓ హరి మీనన్ చెప్పిన లెక్కల ప్రకారం, రోజుకు 90 వేల ఆర్లర్లను బిగ్ బాస్కెట్ డెలివరీ చేస్తోంది. లాక్‌డౌన్‌కు ముందు ఇది లక్షా 60 వేల ఆర్డర్లను డెలివరీ చేసేది.
లార్జ్ ఫార్మాట్ ఆఫ్‌లైన్ రిటైలర్స్ కూడా సిబ్బందిని నియమించు కుంటున్నాయి. స్పెన్సర్స్ రిటైల్, నేచర్ బాస్కెట్ వంటివి స్టోర్, డెలివరీ స్టాఫ్‌కోసం వర్చువల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. రిలయన్స్ రిటైల్ అందుబాటులో ఉన్న ఫ్యాషన్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ వర్కర్లను, ఫుడ్, గ్రోసరీ స్టోర్స్‌లోకి మార్చింది.