కొంత కాలం కిందట వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ కోవిడ్ కేసుల పెరుగుదల వల్ల పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించడం ప్రారంభించాయి. ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలు పలు జిల్లాల్లో మాస్కు ధరించడం తప్పని సరి చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రపంచంలోని పలు దేశాలతో పాటు మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, దాని చుట్టపక్కల ఉన్న జిల్లాల్లో అధికంగా ఇన్ఫెక్షన్లు నమోదు అవుతున్నాయి. కాగా దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 2,067 కేసులు వెలుగులోకి వచ్చాయి.
తాజా కరోనా గణాంకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసింది. దీని ప్రకారం మంగళవారం ఒక్క రోజే 2,067 కొత్త కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్లు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 4,30,47,594కి పెరిగింది. యాక్టివ్ కేసులు 12,340కి పెరిగాయి. 40 తాజా కరోనా మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,22,006కి చేరుకుంది.
undefined
మొత్తం కరోనా ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.03 శాతం ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.49 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 0.38 శాతంగా నమోదైందని తెలిపింది. మొత్తంగా వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,25,13,248కి చేరుకోగా, కేసు మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 186.90 కోట్లకు మించి డోసులు అందజేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆయా రాష్ఠ్ర ప్రభుత్వాలు కరోనా ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సోమవారం నుంచి రాజధాని లక్నోతో పాటు ఎన్‌సీఆర్ జిల్లాల్లోని బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో కోవిడ్ కేసుల పెరుగుదల జాతీయ రాజధాని ప్రాంతం (NCR) పరిధిలోకి వచ్చే జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం గౌతమ్ బుద్ధ్ నగర్, ఘజియాబాద్, హాపూర్, మీరట్, బులంద్‌షహర్, బాగ్‌పత్‌తో పాటు రాజధాని లక్నోలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లను ఉపయోగించడం తప్పనిసరి చేసినట్లు అధికారిక ప్రతినిధి తెలిపారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న తరువాత హర్యానా ప్రభుత్వం కూడా తన నాలుగు జిల్లాల్లో ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గురుగ్రామ్‌లో గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసుల పెరుగుదల పెరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంతో పాటు ఫరీదాబాద్, సోనిపట్ ఝజ్జర్ జిల్లాలలో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయాన్ని హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ మంగళవారం ప్రకటించారు. కాగా కోవిడ్ -19 కేసుల పెరుగుదలపై అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరించాలని చెబుతున్నారు. కరోనా లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాని చెబుతున్నారు.